iDreamPost

హైదరాబాద్ లో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు!

హైదరాబాద్ లో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే నాలుగు రోజుల్లో హైదరాబాద్ లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో GHMC అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితుల కోసం 168 మాన్సున్ ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దింపారు. ఇందులో 64 మొబైల్, 104 మినీ మొబైల్, 160 స్టాటిక్ లేబర్స్ టీమ్స్ ఉంటాయి.

మొబైల్, మినీ మొబైల్ ఎమర్జెన్సీ టీమ్లలో షిష్టుల వారీగా ప్రతి టీమ్ లో నలుగురు కార్మికులు ఉంటారు. ఒక వాహనంతో పాటు, గునపాలు, పారలు, గొడుగు, టార్చ్, రెయిన్ కోట్లతో సిద్ధంగా ఉంటారు. నీరు నిలిచిపోయిన ప్రాంతాల దగ్గర నీటిని తొలగించనున్నారు. ఇది కాకుండా ప్రతి చెరువుకు ఒక ఇన్ఛార్జితో పాటు ఇద్దరిని కేర్ టేకర్స్ గా నియమించారు. హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఏ ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జోనల్ కమిషనర్లు, ఎస్ఈ, ఈవీడీఎం మాన్ సున్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మేయర్ విజయలక్ష్మి సూచించారు. వరద నీటిని ఎప్పటికప్పుడు తొలగించేలా ఈవీడీఎం సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు సూచనలను పాటించాలని తెలియజేశారు.

శిథిలావస్తలో ఉన్న నిర్మాణాల విషయంలో వాటిని కూల్చేయడం సాధ్యం కాకపోతే అక్కడి ప్రజలను నివాసాల నుంచి ఖాళీ చేయించాలని సూచించారు. అలాంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కొత్త సెల్లార్ తవ్వకాలకి అనుమతించ కూడదని స్పష్టం చేశారు. సెల్లార్ తవ్వకాల వల్ల మట్టి జారి.. పొరుగు నిర్మణాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని తెలిపారు. కంట్రోల్ రూమ్ కాల్ సెంటర్ నంబర్ 040-2111 1111కి అందుతున్న ఫిర్యాదులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండి చర్యలు చేపడుతున్నాయని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి తెలియచేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి