iDreamPost

మూడు రాజధానులు -2015లో ప్రకటించి ఉంటే !!!

మూడు రాజధానులు -2015లో ప్రకటించి ఉంటే !!!

అవి 2015 శాసనసభ సమావేశాలు….

“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు, అమరావతి, విశాఖపట్నం నగరాల్ని న్యాయ, శాసన నిర్వాహక, కార్య నిర్వాహక రాజధానులుగా చేయాల్సిన అవసరం ఉందంటూ శాసనసభ్యులు చేస్తున్న సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుని రాజధాని ఒక్క చోట ఉండాలా, మూడు చోట్లా ఉండాలా అనే విషయాన్ని నిర్ణయిస్తాము” – రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ప్రకటించారు.

”రాష్ట్రానికి మూడు ప్రాంతాల్లో రాజధాని నగరాలు రాబోతున్నాయ”నే ముఖ్యమంత్రి ప్రకటనతో ఉత్తరాంధ్ర, ఆంద్ర, రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతవాసులకు కర్నూలు పట్టణంలో హై కోర్టు పెడుతున్నారన్న వార్త ఎంతో సంతోషాన్ని కలిగించింది. వెనుకబడ్డ ప్రాంతమైన ఉత్తరాంధ్ర ప్రాంతం వారు ఉపాధి కోసం ఎక్కువగా విశాఖపట్నం నగరానికే వస్తుంటారు. ఇప్పుడు విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని యువత తమకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ఆశిస్తోంది. నిజానికి ఆంధ్ర, తెలంగాణల్లో హైదరాబాద్ నగరం తర్వాత అన్ని సదుపాయాలు, తగినంత విస్తీర్ణం కలిగిన ప్రాంతం విశాఖపట్నమే. విజయవాడ-గుంటూరు ప్రాంతం ముందు నుంచి రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం. సాహిత్యపరంగా, వాణిజ్యపరంగా, విద్యాపరంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న ప్రభుత్వ ఆలోచనా విధానంతో కృష్ణ గుంటూరు జిల్లా వాసులు ఏకీభవిస్తూ మూడు రాజధానుల ప్రతిపాదనను సాదరంగా స్వాగతిస్తున్నారు.

….చంద్రబాబు నాయుడు అలాంటి ప్రకటన చేసి ఉంటే … మరుసటి రోజు ఉదయం ప్రధాన మీడియాలో అలా వార్త వచ్చేది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాల్లో అధికార పార్టీ కార్యకర్తలకు స్థానికులు కృతజ్ఞతలు చెబుతూ, స్వీట్లు తినిపిస్తున్న ఫోటోలు; విశాఖ, కర్నూలు, అమరావతి పట్టణాల పరిసర గ్రామాల్లో ‘”థాంక్యు సీఎం సార్” అనే పెద్ద పెద్ద అక్షరాలు, పక్కనే దేవుళ్ళ వేషాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు బొమ్మలతో ఏర్పడ్డ ఫ్లెక్సీల ఫోటోలు లోపలి పేజీల్లో దర్శనమిచ్చేవి.

వీకెండ్లో వచ్చే కొత్త పలుకుల్లో …

“శ్రీ బాగ్” ఒప్పందం ప్రకారం రాష్ట్ర రాజధాని ఆంధ్ర ప్రాంతంలో ఉంటే హై కోర్టు రాయలసీమలో; రాజధాని రాయలసీమలో ఉంటే హై కోర్టు ఆంధ్ర ప్రాంతంలో ఉండాలి. ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి రాజధాని కర్నూలు పట్టణం, ఆ తర్వాత అక్కడి నుంచి రాజధాని హైదరాబాద్ కు మారింది. అప్పటి వరకు గుంటూరులో ఉన్న హై కోర్టు కూడా హైదరాబాద్ నగరానికే వచ్చింది. అయినప్పటికీ కర్నూలు జిల్లాలో హై కోర్టు పెట్టాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఏదో ఒక సందర్భంలో తెర మీదకు వస్తూనే ఉంది. ఆ డిమాండును గౌరవిస్తూ నేడు హై కోర్టును కర్నూలులో పెట్టాలన్న ముఖ్యమంత్రి నిర్ణయానికి అక్కడి ప్రాంత న్యాయవాదులు సంబురాలు చేసుకుంటున్నారు.

హై కోర్టుతో నిజానికీ సామాన్య జనానికి పెద్ద పనులేమీ ఉండవు. అయినప్పటికీ రోజువారీగా కొన్ని వేల మంది ఆ ప్రాంతానికి రాకపోకలు సాగిస్తుంటారు కనుక అక్కడ కార్యకలాపాలు పెరుగుతాయి, అందువల్ల స్థానికులకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కలుగుతుంది. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నంను ఎంచుకోవడం వెనుక ఎంతో మేధోమధనం జరిగినట్టు అనిపిస్తోంది.

రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువగా ఉన్న సముద్ర తీరాన్ని సరిగ్గా ఉపయోగించుకుని ఎగుమతి దిగుమతులకు సంబంధించితిన్ వ్యాపారాలు, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారికి ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవడానికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందనే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఎంచుకుని ఉంటారన్నది మేధావుల అభిప్రాయం. విశాఖపట్నం భౌగోళికంగా రాష్ట్రానికి ఒక మూల ఉంటుంది కనుక రాజధానికి రావడానికి సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారన్న కొందరి వాదన అర్ధరహితం. ఎందుకంటే తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ రాజధాని నగరాలు అలాగే ఒక మూలకు ఉంటాయి. ఒక రాష్ట్రానికి ఒకటికి మించి రాజధానులు ఉండటం కూడా కొత్తేమీ కాదు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్రలే ఇందుకు ఉదాహరణలు.

చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో అభివృద్ధి కేవలం హైదరాబాద్ లో మాత్రమే చేశాడన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రాంతం వారు ఎక్కువగా బాధపడటానికి కారణం కూడా హైదరాబాద్ వంటి నగరం తమకు కాకుండా పోతోందనే. ఇప్పుడు మళ్ళీ అలా ఒకే ప్రాంతంలో రాజధాని నగరాన్ని నిర్మించడం ద్వారా మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తలెత్తే అవకాశం లేకపోలేదు. ఇలా మూడు ప్రాంతాల్లో మూడు నగరాల్ని ఎంచుకోవడం ద్వారా ప్రత్యేక రాష్ట్రాల సమస్య తలెత్తకుండా ఎంతో ముందుచూపుతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని విద్యావేత్తలు అంటున్నారు.

తీర ప్రాంతం కావడంతో ఉత్తరాంధ్ర ఎక్కువగా తుఫానులకు దెబ్బ తింటూ ఉంటుంది, అలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విశాఖ కేంద్రంగా దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగానికి సులభంగా ఉంటుంది. ఇటీవల హుదూద్ వంటి తుఫానుల సమయంలో ఒక బస్సులో కూర్చునే చంద్రబాబు అన్ని చక్కబెట్టగలిగినప్పుడు- విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయడం వలన భవిష్యత్తులో మరోసారి దురదృష్టవశాత్తూ అలాంటిదేమైనా సంభవిస్తే ఆయన మరింత వేగంగా ఉత్తరాంధ్ర పునరుద్ధరన పనులు చేపట్టటానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ నుంచి విడిపోయిన సమయంలో రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్న తన మాటను నెగ్గించుకునేందుకు విఫలయత్నం చేసిన చంద్రబాబు ప్రస్తుతం అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేందుకే ఈ మూడు రాజధానుల ఆలోచన చేసుంటారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.”

ఇక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో …

మూడు ప్రాంతాల నుంచి రోజుకి మూడు బ్యాచులు, బ్యాచుకు మూడొందల మంది చొప్పున రైతులు, విద్యార్ధులు, మేధావులు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకుల ఉద్యోగులు, ఆ సంఘాల సభ్యులు, ఈ సంఘాల సభ్యులు – తమ ప్రాంతాన్ని మూడిట్లో ఒక రాజధానిగా ఎంచుకుని, అభివృద్ధి పధంలో నడిపించబోతున్నందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు.

…అంతే అందరు బాగుండాలి.. ఆయన ఉంటే అంతా బాగుంటుంది….

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి