iDreamPost

చంద్రబాబు – జానా రెడ్డి.. ఎవరు సీనియర్‌..? ఇప్పుడు చర్చ ఎందుకు..?

చంద్రబాబు – జానా రెడ్డి.. ఎవరు సీనియర్‌..? ఇప్పుడు చర్చ ఎందుకు..?

సీనియారిటీ.. ఈ పదం ప్రతి రంగంలోనూ వినిపిస్తుంది. రాజకీయాల్లో ఈ పదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సీనియారిటీ ఆధారంగానే పదవులు, అధికారం, సమాజంలో గౌరవం దుక్కుతాయి. మరి సీనియారిటీని నిర్థారించేందుకు ప్రామాణికత ఏమిటి..? సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉంటేనే సీనియర్‌ అయిపోతారా..? అనుభవంతోపాటు మాటలు, చేతల ద్వారా సీనియారిటీని నిర్థారిస్తారా..? తెలుగు రాష్ట్రాలో తిరుపతి లోక్‌సభ, నాగార్జున సాగర్‌ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నాగార్జున సాగర్‌లో ఓటమిపాలైన కుందూరు జానా రెడ్టిలు మాట్లాడిన తీరుతో సీనియారిటీ అంటే ఏమిటి..? ఎలా నిర్థారిస్తారు..? అనే అంశాలపై చర్చ జరుగుతోంది.

తిరుపతి, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల ఫలితాలు ఒకే రోజు వచ్చాయి. రెండు చోట్లా అధికార పార్టీ అభ్యర్థులే గెలిచారు. తిరుపతిలో వైసీపీ అభ్యర్థి గెలుపుపై చంద్రబాబు, నాగార్జున సాగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయంపై కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు జానా రెడ్డిలు స్పందించిన తీరు వారి సీనియారిటీని తెలియజేస్తోంది. నాగార్జున సాగర్‌లో ఓటమిని జానా రెడ్డి ఒప్పుకున్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని చెప్పారు. దాదాపు అర్థ శతాబ్ధం పాటు రాజకీయాల్లో ఉంటూ.. ఒక సారి సమితి అధ్యక్షుడిగా, 8 సార్లు ఎమ్మెల్యేగా, పలుమార్లు మంత్రిగా పని చేసిన జానారెడ్డి తన ఓటమిపై, ప్రజలు ఇచ్చిన తీర్పుపై స్పందన ఇది.

ఇదే సమయంలో 40 ఏళ్ల అనుభవం, మూడు సార్లు ముఖ్యమంత్రిని, దేశంలోనే తనకంటే సీనియర్‌ రాజకీయ నాయకుడు ఎవరూ లేరంటూ మాట్లాడే చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నిక ఫలితంపై స్పందిచిన తీరు విడ్డూరంగా ఉండడమే కాకుండా.. సీనియర్‌ అయితే ఇలా మాట్లాడతారా..? అనే సందేహం వచ్చేలా ఉంది. తిరుపతిలో నైతిక విజయం టీడీపీదేనన్నారు చంద్రబాబు. వైసీపీ దొంగఓట్లు వేసుకుని గెలిచిందంటూ ప్రజా తీర్పును అపహాస్యం చేశారు. ఇక వారి అభ్యర్థి పనబాక లక్ష్మీ.. తమకు ఓటు వేసిన వారే ఓటర్లు.. వైసీపీకి ఓటు వేసిన వారందరూ దొంగ ఓటర్లేనంటూ మాట్లాడారు.

చంద్రబాబు, జానారెడ్డి ఇద్దరూ… రాజకీయాల్లో సుదీర్ఘకాలం నుంచి ఉన్నవారే. కానీ జానారెడ్డి ప్రజా తీర్పును గౌరవిస్తే.. చంద్రబాబు మాత్రం అవహేళన చేసేలా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఇప్పుడు గెలిచిన వారు రేపు ఓడిపోవచ్చు. ఓడిన వారు రేపు గెలవచ్చు. ఈ విషయం చంద్రబాబుకు తెలియనిది అయితే కాదు. కానీ గెలిచినప్పుడు ప్రజాతీర్పు అని, ఓడిపోయినప్పుడు అదే ప్రజా తీర్పును అవహేళన చేసేలా ప్రతిసారి మాట్లాడడం చంద్రబాబుకే చెల్లింది. అందుకే రాజకీయాల్లో ఎంత కాలం నుంచి ఉన్నారనే ప్రాతిపదికన కాకుండా.. సుదీర్ఘ అనుభవంతోపాటు.. ఆ అనుభవానికి తగినట్లుగా చేతలు, మాటలు ఉంటేనే సీనియర్‌ అనడం సబబుగా ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి