iDreamPost

Father Name As Surname: తండ్రి పేరుని ఇంటి పేరుగా మార్చుకునే కల్చర్ ఎలా వచ్చిందో తెలుసా?

  • Published Feb 05, 2024 | 11:39 PMUpdated Feb 05, 2024 | 11:39 PM

కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్, శృతిహాసన్ లాంటి వారు తమ పేరులో తండ్రి పేరుని చేర్చుకున్నారు. తండ్రి పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. మరి ఈ సాంప్రదాయం ఎలా మొదలైంది? ఎప్పుడు మొదలైంది? అనే పూర్తి వివరాలు మీ కోసం.

కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్, శృతిహాసన్ లాంటి వారు తమ పేరులో తండ్రి పేరుని చేర్చుకున్నారు. తండ్రి పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. మరి ఈ సాంప్రదాయం ఎలా మొదలైంది? ఎప్పుడు మొదలైంది? అనే పూర్తి వివరాలు మీ కోసం.

  • Published Feb 05, 2024 | 11:39 PMUpdated Feb 05, 2024 | 11:39 PM
Father Name As Surname: తండ్రి పేరుని ఇంటి పేరుగా మార్చుకునే కల్చర్ ఎలా వచ్చిందో తెలుసా?

ఇంటి పేరు.. దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మందికి ఉంటుంది. ఇక్కడ దాదాపు అందరికీ పేరు ముందు ఇంటి పేరు ఉంటుంది. కొణిదెల శివ శంకర్ వరప్రసాద్ అని, యెదుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి అని, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని, నారా చంద్రబాబు నాయుడు అని ఇలా వ్యక్తుల పేర్ల ముందు ఇంటి పేర్లు అనేవి కామన్ గా ఉంటాయి. ఈ ఇంటి పేర్లలో చాలా వరకూ కులం పేర్లు అనేవి ఉంటాయి. కానీ తమిళనాడులో మాత్రం తమ పేర్ల తర్వాత తండ్రుల పేర్లు పెట్టుకుంటారు. మహిళలు పెళ్ళైన తర్వాత భర్తల పేర్లు తగిలించుకుంటారు. 

కీర్తి సురేష్.. తండ్రి పేరు అయినటువంటి సురేష్ కుమార్ లో సురేష్ ని తన పేరు చివర తగిలించుకుంది. అలానే ఐశ్వర్య రాజేష్.. తన తండ్రి పేరుని తన పేరు తర్వాత పెట్టుకుంది. త్రిష కృష్ణన్, వరలక్ష్మి శరత్ కుమార్, శృతి హాసన్ ఇలా వీరంతా తమ పేర్లకు తండ్రుల పేర్లు తగిలించుకున్నారు. నటులే కాదు.. రాజకీయ నేతలు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇంటిపేరు ముత్తువేల్ కాగా.. పూర్తి పేరు ముత్తువేల్ కరుణానిధి. ఈయన కుమారుడు ఎం.కే. స్టాలిన్.. ముత్తువేల్ కరుణానిధి ఇంటిపేరు, తండ్రి పేరు వచ్చేలా తన పేరు ముందు పెట్టుకున్నారు. ఎం.కే. స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా తన తండ్రి పేరులో ఉన్న స్టాలిన్ ని పేరు తర్వాత తగిలించుకున్నారు. అసలు తండ్రి పేర్లను తమ పేర్లకు తగిలించుకునే కల్చర్ ఎలా వచ్చింది? ఎప్పుడు మొదలైంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

మామూలుగా మన దగ్గర ఇంటి పేర్లనేవి కులాల ఆధారంగా ఉంటాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రామ్ గోపాల్ వర్మ, కృష్ణంరాజు, ప్రభాస్ రాజు, అనుష్క శెట్టి, అనుష్క శర్మ ఇలా చాలా మంది పేర్లు కులాల ఆధారంగా ఉంటాయి. వీరి పేర్లను బట్టి వీరి కులం ఏంటో అనేది తెలుస్తుంది. కొంతమంది మాత్రం కులం పేరు కాకుండా తమ తండ్రి పేరును కానీ ఊరి పేరుని కానీ తమ పేరుకి తగిలించుకునేవారు. గుర్తింపు కోసం తండ్రి పేరు లేదా ఊరి పేరుని తమ పేరులో చేర్చుకునేవారని చెబుతారు. ఉదాహరణకు సిఖ్ ల ఇంటి పేరులో.. ఊరి పేరు ఉంటుంది. మరాఠీల్లో తమ పేరు చివర కర్ అని పెట్టుకున్నారు. మార్వాడీస్ లో కూడా తమ పేరులో ఊరి పేరు ఉంటుంది. ఉదాహరణకు మార్వాడీస్ ఊరు కజర్ అయితే కజారియా అని పేరు తర్వాత చేర్చుకున్నారు. 

అయితే ఇంటిపేరుగా తండ్రి పేరు పెట్టుకోవాలన్న కల్చర్ మాత్రం పెరియార్ వల్ల వచ్చిందని చెబుతారు. అప్పట్లో పెరియార్ కుల వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. అంతకు ముందు తమిళులు ఇంటి పేరులో తమ కులం పేరు పెట్టుకునేవారు. పెరియార్ రాకతో కులం పేరుని తమ ఇంటి పేరు నుంచి తొలగించి దాని బదులు గుర్తింపు కోసం తండ్రుల పేర్లు తగిలించుకున్నారు. అలా అప్పటి నుంచి తండ్రి పేరు తమ పేరు ముందు గానీ, పేరు వెనుక గానీ తగిలించుకునే కల్చర్ మొదలైందని చెబుతారు. ఈ పెరియార్ ప్రభావం తమిళనాడులో మాత్రమే ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ చాలా మంది తమ పేరు ముందు కులం పేరు వాడరు. తండ్రి పేరు పెట్టుకుంటారు. పెళ్ళైన ఆడవారు ఐతే భర్త పేరు పెట్టుకుంటారు. అలా అని వీరికి ఇంటి పేర్లు లేవని కాదు. అవి ఉంటాయి. కానీ వాటిని పాస్ పోర్ట్, ఆధార్ కార్డు, బ్యాంక్ లోన్స్ వంటి వాటికే పరిమితం చేస్తారు. బయటకు మాత్రం చెప్పుకోరు. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా మంది ఇంటిపేర్లు కులం పేర్లే ఉంటాయి. కొన్ని పేర్లు వింటే కులం పేర్లు కాదేమో అనిపిస్తుంది. కానీ ఆ ఇంటి పేర్లు కూడా కుల వృత్తుల ఆధారంగానే ఏర్పడ్డాయి. అయితే కుల ప్రస్తావన ఉన్న ఇంటి పేరు కావచ్చు లేదా తమ పేరులో కులం పేరుని పెట్టుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తున్నదే. చాలా మందికి కులం పేరు తమ పేరులో ఉంటుంది. ఉన్నంత మాత్రాన చెడ్డవారు కాదు, లేనంత మాత్రాన మంచివారని కాదు. పేరులో ఏం ఉండదు, మనిషి గుణంలోనే ఉంటుంది. కులంలో ఏం ఉండదు.. కుల వివక్షలోనే ఉంటుంది. కాకపోతే తమిళులు కులానికి వ్యతిరేకులు. అందుకే కుల వృత్తుల ఆధారంగా వచ్చిన కులం అనే పదాన్ని లేకుండా చేయాలనే ఈ కులాన్ని తమ ఇంటి పేరుగా తొలగించడం మొదలుపెట్టారు. మరి తమిళులు కులాన్ని వదిలి తండ్రి పేరు పెట్టుకోవడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.   

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి