iDreamPost

ఒక ఆడ పిల్ల చాలు అనుకుంటే రూ. 2 లక్షలు.. సీఎం ప్రకటన

ఒక ఆడ పిల్ల చాలు అనుకుంటే రూ. 2 లక్షలు.. సీఎం ప్రకటన

ఆడ, మగ ఇద్దరు సమానమనమైనప్పటికీ.. పిల్లవాడు అనే సరికి ఇంటి వారసుడు అని, తమ పేరు నిలబెడతాడన్న పాత చింతకాయ పచ్చడి సామెతలతో మెదళ్లకు ఎక్కించేసుకున్నారు కొందరు. పట్టణాలు, నగరాలతో పోలిస్తే.. పల్లెటూళ్లు, గ్రామాల్లో ఇలాంటి వాదనలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఆడ పిల్ల పుడితే.. అత్తింటి నుండి ఆరళ్లు మొదలౌతాయి. ఇక రెండో కాన్పులో కూడా ఆడ శిశువు జన్మిస్తే.. వారిని పురిటిలోనే చంపేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఏటా ఆడ పిల్లల భ్రూణ హత్యలు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు లింగ నిర్దారణపై చర్యలు.. ఆడ పిల్లలను రక్షించేందుకు, వారి సంక్షేమం కోసం ఏకంగా ప్రధాని మోడీ బేటీ బచావో, బేటీ పఢావో తీసుకువచ్చినప్పటికీ.. సరిగ్గా కళ్లు తెరవని పసికందులు ప్రాణాలు కోల్పోతున్నారు.

అయితే ఇప్పుడు ఆడ పిల్లల భ్రూణ హత్యల నివారణకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక ఆడ పిల్ల పుట్టిన వెంటనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే.. ఆ తల్లిదండ్రులకు రూ. 2 లక్షల ప్రోత్సహాకాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రకటించారు. గతంలో రూ. 35 వేలు ఇన్సెంటివ్ కింద ఆడపిల్లల తల్లిదండ్రులకు అందిస్తుండగా.. తాజాగా దాన్ని పెంచారు. అలాగే ఇద్దరు ఆడ పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబ నియత్రణ ఆపరేషన్ చేయించుకుంటే.. లక్ష ఇస్తామని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు సుఖ్విందర్ సింగ్.

ప్రస్తుతం హిమాచల్‌లో లింగ నిష్పత్తి.. 1000: 950గా ఉంది. దేశంలో అత్యుత్తమ రాష్ట్రాల్లో మూడో స్థానంలో నిలిచిందని సీఎం అన్నారు.  21 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే అమ్మాయిలకు కూడా ప్రోత్సహాకాలు ఇవ్వాలని తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. ఆడ పిల్లలు ప్రతి రంగంలో రాణిస్తూ దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతున్నారని, ప్రతి రంగంలోనూ ఎదుగుతూ.. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. హిమాచల్ సీఎం తీసుకున్న ఇలాంటి చర్యల వల్ల  ఆడ పిల్లల భ్రూణ హత్యలు తగ్గుతాయని మీరు భావిస్తున్నట్లయితే.. కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి