iDreamPost

రియల్ లైఫ్ లో తండ్రికి జరిగిన అన్యాయానికి రీల్ లైఫ్ లో పగ తీర్చుకున్న హీరో..

రియల్ లైఫ్ లో తండ్రికి జరిగిన అన్యాయానికి రీల్ లైఫ్ లో పగ తీర్చుకున్న హీరో..

స్మగ్లర్ వీరప్పన్.. పరిచయం అక్కర్లేని పేరు.. సత్యమంగళం అడవులను కేంద్రంగా చేసుకుని, మూడు(కేరళ,కర్ణాటక,తమిళనాడు) రాష్ట్రాల ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెట్టిన బందిపోటు వీరప్పన్ ఎర్రచందనం, ఏనుగులను చంపి వాటి దంతాలను స్మగ్లింగ్ చేస్తూ, అడ్డుపడిన పోలీస్ అధికారులను హత్యలు చేస్తూ సృష్టించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు..

వీరప్పన్ అనేకమంది ప్రముఖులను  కిడ్నాప్ చేసాడు. వారిలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కూడా ఒకరు. జూలై 30, 2000 న కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేసిన వీరప్పన్ తనతో పాటు బందీగా రాజ్ కుమార్ ను అడవుల్లోకి తీసుకువెళ్ళాడు..దాంతో కర్ణాటకలో రాజ్ కుమార్ అభిమానులు ఆందోళనలు చేపట్టారు. నిరసనలు వ్యక్తం చేసారు. వీరప్పన్ కి ఉన్న నేర చరిత్ర కారణంగా, తమ అభిమాన నటుడికి హాని తలపెడతాడేమో అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి.108 రోజులపాటు రాజ్ కుమార్ ని బందీగా ఉంచుకున్న వీరప్పన్ నవంబర్ 15, 2000 న విడిచిపెట్టాడు.

ఆ తర్వాత 18 అక్టోబర్, 2004 లో STF పోలీసులు ఆపరేషన్ కకూన్ చేపట్టి వీరప్పన్ ను ఎన్కౌంటర్ చేసారు. కాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ అనే సినిమాను రూపొందించారు. ఆ సినిమాలో రాజ్ కుమార్ తనయుడు, శివ రాజ్ కుమార్ వీరప్పన్ ని మట్టుబెట్టడానికి ప్రయత్నించే ఆఫీసర్ సెంథమర్తె కణ్ణన్ పాత్రలో కనిపిస్తారు. ఆపరేషన్ కకూన్ ని ఇతివృత్తంగా చేసుకుని వర్మ రూపొందించిన కిల్లింగ్ వీరప్పన్ ప్రేక్షకాదరణ పొందింది.

ముఖ్యంగా వీరప్పన్ పాత్ర పోషించిన సందీప్ భరద్వాజ్ నటనకు ప్రశంసలు దక్కాయి. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలని ముప్పు తిప్పలు పెట్టే వీరప్పన్ ని పట్టుకోవడానికి ప్రయత్నించే ఆఫీసర్ గా శివ రాజ్ కుమార్ నటించారు. వీరప్పన్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సాగే సెంథమర్తె కణ్ణన్ పాత్రలో శివ రాజ్ కుమార్ నటన అద్భుతంగ ఉంటుంది. చివరకు అంబులెన్సులో వెళ్తున్న వీరప్పన్ ని సెంథమర్తె కణ్ణన్ ఆధ్వర్యంలో ఉన్న STF పోలీసులు కాల్చి చంపడంతో సినిమా పూర్తవుతుంది. అలా రియల్ లైఫ్ లో తన తండ్రిని కిడ్నాప్ చేసిన వీరప్పన్ పై రీల్ లైఫ్ లో పగ తీర్చుకునే అవకాశం రామ్ గోపాల్ వర్మ కల్పించాడన్న మాట.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి