iDreamPost

వీడియో: అస్సలు బయటకు రావొద్దు.. కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్!

వీడియో: అస్సలు బయటకు రావొద్దు.. కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్!

రెండు తెలుగు రాష్ట్రాలు గత వారంరోజులుగా వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. ఐదురోజుల ముసురు తర్వాత కాస్త వానలు తెరపివ్వడంతో హైదరాబాద్ నగర ప్రజలు హమ్మయ్య అనుకున్నారు. కానీ, ఆ ఆనందం కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉందని చెప్పాలి. ఎందుకంటే సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి భారీ వర్షం మొదలైంది. నగరం మొత్తం తడిసి ముద్దైంది. కేవలం రెండు గంటల్లోనే ఒక్కో ప్రాంతంలో దాదాపు 4 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. సరిగ్గా ఆఫీసులు నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో నగరం మొత్త స్తంభించిపోయింది.

రోడ్లపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. వాతావరణ శాఖ ముందే హెచ్చరికలు జారీ చేయడంతో చాలా మంది ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ వర్షసూచనతో ముందే అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, పోలీసు శాఖ తగిన చర్యలు చేపట్టారు. ఎక్కడా ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాలకు డీఆర్ఎఫ్, ప్రత్యేక బృందాలను మోహరించారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు.

నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బృందాలుగా ఏర్పడి ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. కానిస్టేబుల్స్ మాత్రమే కాకుండా ఉన్నతాధికారులు కూడా రోడ్లపైకి వచ్చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద దగ్గరుండి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. అత్యవసరం అయితేనే రోడ్లపైకి రావాలని వాతావరణ, పోలీసు శాఖ అధికారులు కోరుతున్నారు. నగరవాసులు అనవసరంగా రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ లో ఇరుక్కోకండి అంటూ సూచిస్తున్నారు. వర్షం తగ్గినా కూడా ట్రాఫిక్ క్లియర్ అయ్యేందుకు సమయం పడుతుంది కాబట్టి అనవసరంగా రోడ్లపైకి రాకండని సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి