iDreamPost

టీడీపీ ఎమ్మెల్సీ వివాదానికి ఆరోగ్య‌శాఖ చెక్‌..!

టీడీపీ ఎమ్మెల్సీ వివాదానికి ఆరోగ్య‌శాఖ చెక్‌..!

గ‌త ఎన్నిక‌ల్లో ఊహించిన భారీ దెబ్బ‌తో తెలుగుదేశం పార్టీ మ‌తిభ్ర‌మిస్తున్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న ఆరోప‌ణ‌లు ఏడాది నుంచి వ‌స్తూనే ఉన్నాయి. పార్టీ పెద్ద‌లు అనుస‌రిస్తున్న తీరు దానికి ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. ఏదో అంశంపై వివాదం చేసి.. మీడియాలో క‌నిపించాల‌నే త‌ప‌నే త‌ప్పా.. ప్ర‌జా సంబంధ అంశ‌మా.. అందులో వాస్త‌వ‌మెంత‌.. అని ఆ పార్టీ ఆలోచించ‌డం లేదు. గ‌తంలో విద్యుత్ బిల్లుల విష‌యంలోనూ అదే పంథా అనుస‌రించింది. ఒకేసారి మూడు నెల‌ల‌కు బిల్లులు ఇవ్వ‌డం అంద‌రూ ఇంట్లోనే ఉండ‌డం కార‌ణంగా చార్జీలు అధికంగా వ‌చ్చాయ‌ని విద్యుత్ శాఖ ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా దాన్నో అవ‌కాశంగా చేసుకుని వైసీపీ ప్ర‌భుత్వంపై బుర‌ద చెల్లే ప్ర‌య‌త్నం చేశారు. బిల్లు ఎక్కువ రావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను ప్ర‌జ‌ల‌ను అర్థం చేసుకోవ‌డం, బిల్లుల వ‌సూలు విష‌యంలో ఆ కుటుంబాల ప‌రిస్థ‌తి బ‌ట్టి ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల‌ని అధికారుల‌కు జ‌గ‌న్ అదేశించ‌డంతో పాటు కొన్నాళ్ల పాటు వ‌సూళ్లు పెండింగ్ లో పెట్ట‌మ‌ని సూచించ‌డంతో టీడీపీ పాచిక పార‌లేదు. దాన్ని వివాదాస్ప‌దం చేయాల‌ని ప్ర‌య‌త్నించినా ప్ర‌జ‌ల నుంచి పెద్ద‌గా స్పంద‌న రాలేదు.

మంచి చేసినా వివాదాలే…

ప్ర‌జ‌లు, ప్ర‌జా ప్ర‌తినిధుల మంచి కోరుతూ ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల విష‌యంలోనూ టీడీపీ వివాదాస్ప‌దం చేస్తోంది. క‌రోనా విష‌యానికి వ‌స్తే.. ప‌రీక్ష‌లు చేయ‌డంలోనూ.. వైర‌స్ నియంత్ర‌ణ‌లోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది. ఇది అంద‌రూ ప్ర‌శంసిస్తున్న విష‌య‌మే. కానీ.. తెలుగుదేశం మాత్రం ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉంది. ఇదిలా ఉండ‌గా.. అసెంబ్లీ, మండ‌ల స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు ముంద‌స్తుగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. అప్ప‌టికే ప‌క్క రాష్ట్రమైన తెలంగాణ‌లో ముగ్గురు ఎమ్మెల్యేలు వైర‌స్ బారిన ప‌డ‌డంతో ప్ర‌జా ప్ర‌తినిధుల ఆరోగ్యం రీత్యా ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఆ ప‌రీక్ష‌ల్లో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిందని… ఆయన క్వారంటైన్‌కు రావాలని అధికారులు సూచించారు. దీన్ని కూడా చంద్ర‌బాబు రాజ‌కీయం చేయాల‌ని చూశారు. హైదరాబాద్‌లో ఉన్న దీపక్ రెడ్డి అప్ప‌టికే అక్కడ రెండు చోట్ల పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ వ‌చ్చిందంటూ దీన్ని వివాదం చేశారు. కరోనా పాజిటివ్ అన్న పేరుతో దీపక్ రెడ్డిని క్వారంటైన్ లో ఉంచాలనుకోవడం వెనుక రాజకీయ దురుద్ధేశాలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా అనుమానంగా ఉందని చంద్రబాబు ఆరోపించారు. అంతకన్నా ముందు కరోనా పరీక్షల ఖచ్చితత్వం ఏంటన్నది ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. క్వారంటైన్ లో ఉంటే మంచిద‌ని దీప‌క్ రెడ్డి కి సూచించింది అధికారులు. అదీ ఆయ‌న, కుటుంబ స‌భ్యుల ఆరోగ్య సంర‌క్ష‌ణ కోస‌మే. ఆయ‌న ‌క్వారంటైన్ లో ఉంటే ప్ర‌భుత్వానికి క‌లిసి వ‌చ్చే అంశం ఏమిటి..? ఈ విష‌యాలేవీ ఆలోచించ‌డ‌కుండానే.. క‌రోనా ప‌రీక్ష‌ల‌పై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఆరోగ్య శాఖ స‌మాధానం

తాజాగా.. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి కరోనా వివాదంపై ఏపీ ఆరోగ్యశాఖ వివరణ ఇచ్చింది. ఆర్టీపీసీఆర్‌లో 67శాతమే కచ్చితత్వం ఉన్నట్లు ఏపీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. శరీరంలో నూరుశాతం వైరస్‌ ఉంటేనే ఫలితం పాజిటివ్‌గా వస్తుందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఒకవేళ కరోనా పేషెంట్ రికవరీ దశలో ఉన్నా, వైరల్‌ ఇన్ఫెక్షన్‌ స్థాయి 33శాతమే ఉన్నా ఫలితం నెగెటివ్‌ వస్తుందని పేర్కొంది. మొదటిసారి దీపక్‌రెడ్డికి నూరుశాతం వైరల్‌ ఇన్ఫెక్షన్‌ ఉండి పాజిటివ్‌ వచ్చిందని, రెండోసారి రికవరీ దశలో ఉన్నందున నెగెటివ్‌ వచ్చిందని ఏపీ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి