iDreamPost

కరోనా వైరస్ : గుజరాత్‌ వైఫల్యాలు తేటతెల్లం : రాష్ట్రాన్ని ‘మునిగిపోతున్న టైటానిక్‌’తో పోల్చిన హైకోర్టు

కరోనా వైరస్ : గుజరాత్‌ వైఫల్యాలు తేటతెల్లం : రాష్ట్రాన్ని ‘మునిగిపోతున్న టైటానిక్‌’తో పోల్చిన హైకోర్టు

కరోనా వైరస్‌ విజృంభన నేపథ్యంలో దాని నియంత్రణ, రోగులకు చికిత్స అందించడంలో గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వ తప్పులు, వైఫల్యాలు బహిర్గతమయ్యాయి. రాష్ట్రంలోని పరిస్థితులు ‘మునుగుతున్న టైటానిక్‌ షిప్‌’ మాదిరిగా ఉన్నాయని రాష్ట్ర హైకోర్టే వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలకు గుజరాత్‌ సొంత రాష్ట్రం. రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి విజరురూపానీ నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తున్నా కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లోనే రాష్ట్ర పాలన సాగుతోందని విశ్లేషకులు పేర్కొటున్నారు.

మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో సిఎం విజరు రూపానీ పాలనలో జోక్యం చేసుకునే ఆలోచన కూడా ఆ రాష్ట్ర గవర్నర్‌కు లేదు. పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో నకిలీ యాంత్రిక శ్వాస యంత్రాలను వెంటిలేటర్లుగా తీసుకురావడం ద్వారా రూపానీ ప్రభుత్వం తప్పు చేసిందని విమర్శకులు పేర్కొంటున్నారు.

రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వ తీరుపై గట్టి వ్యాఖ్యలు చేసింది. కోర్టు పేర్కొంటున్న అంశాలతో మహరాష్ట్ర, బెంగాల్‌ వంటి రాష్ట్రాలపై విమర్శలు చేస్తున్న బిజెపి నేతలు తమ తప్పులను మాత్రం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

చెరసాల కంటే దారుణంగా..

143 పేజీల తన తాజా నివేదికలో గుజరాత్‌ను హైకోర్టు దేశంలోనే తీవ్ర కరోనా ప్రభావిత రాష్ట్రంగా పేర్కొంది. వ్యక్తిగత పరిరక్షణ పరికరాలు (పిపిఈ), వెంటిలేటర్లు, ఐసియులు, ఐసోలేషన్‌ వార్డుల కొరతను ప్రస్తావించింది. అహ్మదాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి విషాదకరంగా ఉందని పేర్కొంది. ఆసుపత్రి చెరసాలకు బాగా ఉంటుందని, చెరసాల కంటే దారుణంగా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయని న్యాయమూర్తులు జెబి.పర్దివాలా, ఐలేష్‌ వోరా పేర్కొనడం ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రతిబింభిస్తోందని విశ్లేషకులు పేర్కొన్నారు.

ఆసియాలోనే పెద్ద ఆసుపత్రిగా పేరున్న ఆ ఆస్పత్రిలో కరోనా నియంత్రణ సదుపాయాలు లేవని, అసలు ఆసుపత్రిలో ఏం జరుగుతుందో రాష్ట్ర ఆరోగ్య మంత్రికి కనీసం అవగాహన లేనట్టు ఉందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో నోడల్‌ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హోంశాఖకు అమిత్‌ షా మంత్రిగా ఉన్నారు. ఆయన అహ్మదాబాద్‌ పక్కనే ఉన్న గాంధీనగర్‌ నుంచి ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమిత్‌ షా పార్లమెంటరీ నియోజకవర్గంలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు అహ్మదాబాద్‌ నగర పరిధిలోనే ఉన్నాయి. గుజరాత్‌ను మోడల్‌ రాష్ట్రంగా చెప్పుకునే బిజెపి నేతలు హైకోర్టు వ్యాఖ్యలపై ఏం సమాధానం చెప్పుకుంటారన్న దానిపై చర్చ నడుస్తోంది.  

మరోవైపు అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ బదిలీ కూడా తీవ్ర చర్చకు దారి తీస్తుంది. ఆ కమిషనర్ చేసిన తప్పేంటంటే…కరోనా పరీక్షలను రాపిడ్ గా నిర్వహించడం. కరోనా పరీక్షలు రాపిడ్ గా నిర్వహించడం వల్ల ఎక్కవ కేసులు బయటపడుతున్నాయని ఆయనను రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అకస్మాత్తుగా బదిలీ చేశారు. ఇప్పుడు దీనిపై సర్వత్రా చర్చ జరుగుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి