iDreamPost

లాక్ డౌన్.. ప్రభుత్వం వినూత్న ప్రయోగం

లాక్ డౌన్.. ప్రభుత్వం వినూత్న ప్రయోగం

దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ప్రతి ఒక్క రంగానికీ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగం ఒడిదుడుకులకు లోనయ్యింది. రవాణా స్తంభించడంతో పంటల ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో రైతాంగం తీవ్ర ఆవేదనలో ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రైతుల వద్ద నుంచి పంటలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

ప్రభుత్వం ఇప్పటికే అరటి, టమాటా పంటలను ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించి కొనుగోలు చేసింది. ఇంకో రెండు మూడు రోజుల్లో మామిడి, బత్తాయి, కర్బూజ, పుచ్చ లాంటి పండ్లను కొనుగోలు చేయనుంది. ప్రభుత్వానికి గిట్టుబాటు కాకపోయినా రైతులను ఆదుకునే ఉద్ధేశ్యంతో ఈ చర్యలు చేపట్టింది.

అయితే ఇంత భారీ ఎత్తున తీసుకున్న పంటలను కేవలం రైతు బజార్లలో అమ్మడం వీలు పడదు. ఉదయం 11 గంటల వరకు మాత్రమే సడలింపు ఉండడంతో పూర్తిస్థాయి అమ్మకాలకు సాధ్యం కాదు. పైగా ఈ పంటలను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి కుదరదు.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. రైతుల వద్ద కొనుగోలు చేసిన పంటలను స్వయం సహాయక గ్రూపుల ద్వారా గ్రామస్థాయికి తీసుకెళ్లి అమ్మకాలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పట్టణాలు, గ్రామాల్లో కలిపి 8.20 లక్షల స్వయం సహాయక గ్రూపులు ఉన్నాయి. వీరికి పండ్లు, ఇతర పంటలను అందించి అమ్మకాలు చేయించనుంది. తద్వారా ప్రజలకు తక్కువ ధరకే పంటలు అందించడంతోపాటు పంటలు వృథా కాకుండా ఉంటాయి. నేడో రేపో దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడనున్నాయి. అలాగే ఉత్తరాది రాష్ట్రాలకు పంటలను ఎగుమతి చేసేందుకు చర్యలు చేపట్టింది.

మరోవైపు నేటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కానున్నాయి. మద్ధతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 260 కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో మరో 810 కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ రబీ సీజన్‌లో దాదాపు 30లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. రైతులకు ఎలాంటి నష్టం లేకుండా పంటన్నింటినీ ప్రభుత్వమే కొనుగోలు చేయిస్తుందని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి