iDreamPost

Kakinada Mayor – మేయర్‌ తొలగింపు ప్రక్రియ సమాప్తం.. ఉత్తర్వులు జారీ

Kakinada Mayor – మేయర్‌ తొలగింపు ప్రక్రియ సమాప్తం.. ఉత్తర్వులు జారీ

కాకినాడ మేయర్‌ సుంకర పావనిపై పెట్టిన అవిశ్వాస తీర్మాన ప్రక్రియ పూర్తయింది. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమెను మేయర్‌ పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుంకర పావని మాజీ మేయర్‌ అయ్యారు.

కాకినాడ కార్పొరేషన్‌కి 2017లో జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలిచిన టీడీపీ పాలక మండలని ఏర్పాటు చేసింది. అయితే 23 మంది కార్పొరేటర్లు మేయర్‌ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ.. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 5వ తేదీన జరిగిన ప్రత్యేక సమావేశంలో మేయర్‌ పావని, డిప్యూటీ మేయర్‌ సత్తిబాబులపై కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరిగింది. పాలక మండలిలో ప్రస్తుతం మొత్తం 44 మంది కార్పొరేటర్లు ఉండగా.. మేయర్, డిప్యూటీ మేయర్‌లకు వ్యతిరేకంగా 33 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్‌ అఫిషియో సభ్యులు ఓటేశారు. దీంతో వారిద్దరిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.

అయితే తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ.. ఓటింగ్‌కు ముందే సుంకర పావని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. అవిశ్వాస తీర్మానంపై జరిగే సమావేశానికి అభ్యంతరాలు చెప్పలేదు. అయితే ఫలితాన్ని మాత్రం తుది తీర్పునకు లోబడి ఉండాలని చెబుతూ.. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.

అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తనను మేయర్‌ పదవి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై సుంకర పావని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పునకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపిస్తున్నారు. 22వ తేదీన కోర్టు తీర్పు వెలువరించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు హైకోర్టు తీర్పును ధిక్కరించేందిగా ఉందంటూ పావని విమర్శిస్తున్నారు.

Also Read : నెగ్గిన అవిశ్వాస తీర్మానం – సుంకర పావని ఇక మాజీ మేయర్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి