iDreamPost

గంగవ్వకు సెలవు – ఇంటికి నాగ్ హామీ

గంగవ్వకు సెలవు – ఇంటికి నాగ్ హామీ

మొదట్లోనే జరగాలని ఆశించింది ఎట్టకేలకు నిన్న పూర్తయ్యింది. బిగ్ బాస్ 4 నుంచి అనారోగ్య కారణాల వల్ల గంగవ్వ సెలవు తీసుకుంది. ఈ సందర్భంగా తను నిజాయితీగా ఎంత బాధ పడుతోందో స్వయంగా చెప్పుకుంది. ఉండాలని ఉన్నా ఒళ్ళు సహకరించడం లేదని, తనను అందరూ బాగా చూసుకున్నారని, తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నానని అడిగింది. దీంతో డాక్టర్ రిపోర్ట్స్ తో పాటు రికమండేషన్లు చెక్ చేసిన నాగార్జున ఇక ఉంచడం మంచిది కాదని వెంటనే బిగ్ బాస్ కు విన్నపం చేసేశాడు. ఊహించినట్టే పర్మిషన్ కూడా వచ్చేసింది. అయితే స్వంత ఇంటి కలను నెరవేర్చుకోవడం కోసం గేమ్ కు వచ్చిన గంగవ్వకు అది ఇంకా నెరవేరలేదు.

కేవలం ఐదు వారాలకు మించి ఉండలేకపోయింది. అందుకే నాగ్ తాను ఆ ఇంటికయ్యే ఖర్చుని భరిస్తానని హామీ ఇచ్చి అవ్వ గుండెల్లోనే కాదు ప్రేక్షకుల హృదయాలనూ గెలుచుకున్నాడు. గంగవ్వ వెళ్ళిపోతున్న సందర్భంగా హౌస్ మేట్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రోమోస్ లోనే అవ్వ వెళ్ళిపోవడం గురించి ముందే హింట్ ఇచ్చేశారు కాబట్టి ఎలిమినేషన్ మీద ఎవరూ పెద్దగా ఫోకస్ పెట్టలేదు. సోషల్ మీడియా లీకులు కూడా మొన్నే జరిగిపోయాయి. గంగవ్వ వెంటనే తన ఊరికి వెళ్ళడం లేదు. తగినన్ని వైద్య పరీక్షలు చేయించి పూర్తి ఫిట్ గా ఉందని డాక్టర్లు చెప్పాక తన స్వగ్రామానికి పంపనున్నారు. అందుకే ఇంకొద్ది రోజులు గంగవ్వ హైదరాబాద్ లోనే ఉండబోతున్నారు.

హౌస్ లో తన అనుభవాలకు సంబంధించి స్టార్ మా ఛానల్ కు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాక మొత్తం తతంగం పూర్తవుతుంది. నిజానికి గంగవ్వ రెండో వారంలోనే వెళ్తానని చెప్పింది. అయితే నాగార్జున బుజ్జగించి ఒప్పించి ఉండేలా చేశారు. ఆ తర్వాత అవ్వ హుషారుగా గేమ్ ఆడింది. కాకపోతే మిగిలిన పార్టిసిపెంట్స్ తరహాలో ఆటలో రాజకీయాలను చేయలేకపోయింది. ఫలితంగా సానుభూతి మీదే ఎక్కువగా నెగ్గుకురావాల్సి వచ్చింది. అయితే తన వయసు, చదువు, బ్యాక్ గ్రౌండ్ దృష్ట్యా చూసుకుంటే ఈ మాత్రం చేయడం చాలా గొప్ప విషయం. అందుకే ప్రేక్షకులు సైతం ఓట్ల విషయంలో తనను గెలిపిస్తూనే వచ్చారు. నామినేషన్ వరకు వెళ్ళకుండా కేవలం తన టాలెంట్, వ్యక్తిత్వం తో గంగవ్వ ఇక్కడిదాకా నెగ్గుకువచ్చింది. తను వెళ్లిపోయింది కాబట్టి సభ్యులు అల్లరి డోస్ పెంచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి