iDreamPost

Godse Movie గాడ్సే రిపోర్ట్

Godse Movie గాడ్సే రిపోర్ట్

నిన్న విరాట పర్వం సందడి ఎక్కువగా కనిపించడంతో సత్యదేవ్ గాడ్సే రిలీజైన విషయం అంతగా సామాన్య ప్రేక్షకుల దృష్టిలో పడలేక పోయింది. అయినప్పటికీ ట్రైలర్లు ఈవెంట్లు గట్రా ప్రమోషన్లు చేయడంతో కొంత బజ్ అయితే వచ్చింది. అందులోనూ బ్లఫ్ మాస్టర్ హీరో దర్శకుడి కాంబినేషన్ కావడం వల్ల బాగుండొచ్చనే నమ్మకం ఫ్యాన్స్ లో కనిపించింది. ఇది కూడా కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడిన బాపతే. డేట్లు మారుతూ ఫైనల్ గా 17న లాక్ చేసుకుని థియేటర్లలో అడుగు పెట్టింది. అసలే బాక్సాఫీస్ దగ్గర చిన్న సినిమాల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. టాక్ నే నమ్ముకుని ఇవి బరిలో దిగుతున్నాయి. మరి గాడ్సే ఎలా ఉన్నాడో రిపోర్ట్ లో చూద్దాం

హైదరాబాద్ నగరంలో బడా వ్యక్తులు కొందరు కిడ్నాప్ కు గురవుతారు. ఎవరో చేశారో ముందు అర్థం కాదు. తర్వాత దీనివెనుక గాడ్సే (సత్యదేవ్) అనే బిజినెస్ మెన్ ఉన్నాడని తెలుస్తుంది. కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న వైశాలి(ఐశ్వర్య లక్ష్మి) అనూహ్యమైన నిజాలు వెలికి తీస్తుంది. ఇంతలో గాడ్సే తన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచుతాడు. అసలు గాడ్సే ఇదంతా ఎందుకు చేశాడు, అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి. సత్యదేవ్ ఎప్పటిలాగే మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ సాయికుమార్ ని మించి డైలాగ్ డెలివరీ ఉందని చూపించాలనే తాపత్రయమో ఏమో కానీ కొన్ని సీన్స్ లో ఓవర్ ది బోర్డ్ వెళ్లిపోయారు.

దర్శకుడు గోపి గణేష్ పట్టాభి అవుట్ డేటెడ్ లైన్ తీసుకున్నారు. ఇప్పటి ఆడియన్స్ కి మెసేజులు వినే ఓపిక లేదు. వర్తమాన సంఘటనలనే తీసుకున్నా కనీస లాజిక్ లేకుండా ఓవర్ బిల్డప్స్ తో కథనం నడిపించిన తీరు సెకండ్ హాఫ్ లో విసుగు తెప్పిస్తుంది. దానికి తోడు ఎంటర్ టైన్మెంట్ జీరో కావడంతో ఇంత సేపు సందేశాలను భరించడం కష్టమనిపిస్తుంది. హీరోలోని బెస్ట్ పెర్ఫార్మర్ ని బయటికి తేవడానికి కథలు రాసుకోకూడదు. అలా అయితే కమల్ హాసన్ ఉత్తమ విలన్ సినిమా వందల కోట్లు తెచ్చేది. పబ్లిక్ కి ఏం కావాలో గుర్తించి సరైన డ్రామా ఉండేలా చూసుకుంటేనే హిట్ దక్కుతుంది. లేదంటే గాడ్సే లాగా ఉసూరుమనక తప్పదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి