iDreamPost

వీడియో: కోనసీమ జిల్లాలో బోరు బావి నుంచి ఎగసిపడిన మంటలు!

వీడియో: కోనసీమ జిల్లాలో బోరు బావి నుంచి ఎగసిపడిన మంటలు!

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బోరు బావి నుంచి మంటలు ఎగసిపడ్డాయి. మంటలు అదుపు చేసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగించారు. అయితే ఓఎన్జీసీ పైప్ లైన్ లీకేజీ వల్లే ఈ మంటలు ఎగిసిపడిన్నట్లు చెబుతున్నారు. ఓఎన్జీసీ సిబ్బందితో పాటుగా.. అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా తీవ్రంగా కృషి చేసి మంటలను అదుపులోకి తెచ్చారు. గంటల కృషి తర్వాత బోరు బావిలో నుంచి ఎగసిపడిన మంటలు అదుపులోకి వచ్చాయి.

కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడులోని ఆక్వా చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. చేపల చెరువు కోసం బోరు బావి తవ్వుతుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. అయితే ఓఎన్జీసీ గ్యాస్ పైపు లీకవడం వల్లే ఇలా మంటలు ఎగసిపడుతున్నాయని చెబుతున్నారు. బోరు తవ్వుతున్న క్రమంలో లోపల ఉన్న ఓఎన్జీసీ గ్యాస్ పైపు దెబ్బతిని గ్యాస్ లీకైనట్లు చెబుతున్నారు. ఈ ఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే ఓఎన్జీసీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది కూడా మంటలను అదుపుచేసేందుకు సహాయం చేశారు.

అయితే ఇక్కడ ఇంకో చిక్కుప్రశ్న కూడా ఉంది. నిజంగా బోరు వేస్తున్న సమయంలో ఓఎన్జీసీ పైపు దెబ్బతిని మంటలు వస్తున్నాయా? లేక భూమి పొరల్లో ఏమైనా వాయులు ఉండటం వల్ల ఈ మంటలు చెలరేగుతున్నాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. పొలాల్లో అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయని రైతులు చెబుతున్నారు. భూమి పొరల్లో ఉండే గ్యాస్ బుడగల కారణంగా ఇలా జరుగుతుందని తెలిపారు. ఈ ఘటనా స్థలం గ్రామాలకు దూరంగా ఉండటంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే కోనసీమ జిల్లా పరిధిలో గ్యాస్ లీక్ వల్ల జరిగే అగ్ని ప్రమాదాలు చాలానే జరిగాయి. గ్రామాల మీదుగా ఓఎన్జీసీ గ్యాస్ లైన్ వెళ్లడంతో అడపాదడపా ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ గ్యాస్ లీక్ కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి