iDreamPost

Garuda Gamana Vrishabha Vahana : సంచలనం రేపుతున్న కన్నడ సినిమా

Garuda Gamana Vrishabha Vahana : సంచలనం రేపుతున్న కన్నడ సినిమా

ఇటీవలే విడుదలై కర్ణాటకలో సంచలనం సృష్టిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా గరుడ గమన వృషభ వాహన. హైదరాబాద్ లాంటి నగరాల్లోనూ దీనికి షోలు వేయడంతో అంతగా ఇందులో ఏముందబ్బా అని మూవీ లవర్స్ దృష్టి సారించారు. రిషబ్ శెట్టి, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదు. రెండున్నర గంటల నిడివిలో డ్యూయెట్లు కానీ కామెడీ సన్నివేశాలు కానీ మచ్చుకు కూడా కనిపించవు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కి భిన్నంగా పూర్తిగా వయొలెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో నిజంగా అంత గొప్పగా చెప్పుకునే విషయం ఉందో లేదో రిపోర్ట్ లో చూద్దాం.

మంగళూరు ప్రాంతం మంగళాదేవి అనే ఊరిలో ఇద్దరు పేరు మోసిన రౌడీ షీటర్లు హరి(రిషబ్ శెట్టి), శివ(రాజ్ బి శెట్టి)లు. తమకు అడ్డు వస్తున్నారనో లేదా ఎదిరిస్తున్నారో అనిపిస్తే చాలు ముందు వెనుకా చూడకుండా వాళ్ళను కిరాతకంగా హత్యలు చేస్తుంటాడు శివ. హరి తన అండదండలతో అక్కడో ముఠా నాయకుడిగా ఎదుగుతాడు. వీళ్ళ అంతు చూసేందుకు స్థానిక ఎమ్మెల్యే ఒక పోలీస్ ఇన్స్ పెక్టర్(గోపాల్ దేశ్ పాండే)ని ట్రాన్స్ఫర్ మీద ఆ ఊరికి తీసుకొస్తాడు. చట్టప్రకారం వాళ్ళను ఏమీ చేయలేమని గుర్తించి ముల్లుని ముల్లుతోనే తీయాలనే సూత్రం అనుసరించి వాళ్ళను ఎలా చావు దాకా తీసుకొచ్చాడనేదే అసలు కథ

నిజానికి ఇందులో కనివిని ఎరుగని పాయింట్ ఏమి లేదు. కాకపోతే దర్శకుడు రాజ్ బి శెట్టితో పాటు రిషబ్ శెట్టిల అద్భుతమైన నటన, సహజంగా అనిపించే లొకేషన్స్, మాస్ కి ఎలివేషన్ ఇచ్చే రెండు మూడు ఎపిసోడ్లు కాపాడాయి. అయితే హింస బాగా మితిమీరిపోయింది. లెన్త్ కూడా ఎక్కువ కావడంతో ల్యాగ్ అనిపిస్తుంది. ఇద్దరు రౌడీల పుట్టుక ఎదుగుదల చావు తప్ప ఇందులో ఇంకేమి లేదు. సంగీత దర్శకుడు మిథున్ ముకుందన్ పనితనం గొప్పగా ఉంది. చాలా మంచి బీజీఎమ్ ఇచ్చారు. పాటలు అడ్డంకే అయ్యాయి. అప్పుడెప్పుడో సుకుమార్ తీసిన జగడమే నచ్చని టాలీవుడ్ ఆడియన్స్ కి ఈ ఫ్లేవర్ కనెక్ట్ కావడం కష్టమే. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఫలక్ నుమా దాస్ లాంటి రూరల్ గ్యాంగ్ డ్రామాకు కొనసాగింపు అనిపిస్తుంది. డబ్బింగ్ చేసినా రీమేక్ చేసినా ఇక్కడ ఆడదు

Also Read : Sai Pallavi : భానుమతి చెల్లెలి వెండితెర ప్రవేశం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి