iDreamPost

మీరట్ లో తెలుగు డాన్ ఎన్కౌంటర్..

మీరట్ లో తెలుగు డాన్ ఎన్కౌంటర్..

అతనొక సాధారణ బట్టల వ్యాపారి కుమారుడు.. కొంతకాలం తండ్రికి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉన్నాడు.. కానీ అతని ఆలోచనల్లో మార్పు వచ్చి నిజజీవితంలో డాన్ గా మారిపోయాడు. అనేక హత్యలు, దోపిడీలు, బెదిరింపులకు పాల్పడ్డాడు.. సుపారీలు తీసుకుని హత్యలు చేసాడు..హవాలా వ్యాపారం కూడా చేసాడు. ఢిల్లీ నెంబర్ వన్ డాన్ గా మారిపోయాడు. అతనే శివశక్తి నాయుడు.. అతన్ని మీరట్ లో పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో హతమయ్యాడు. ఢిల్లీని వణికించిన శివశక్తి నాయుడుని ఎన్కౌంటర్ చేయడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

శివశక్తి నాయుడు తండ్రి తెలుగు వాడే.. ఢిల్లీకి వలసవెళ్లి అక్కడ బట్టల వ్యాపారం మొదలుపెట్టి అక్కడే స్థిరపడ్డారు.. కానీ కొంతకాలం తండ్రికి వ్యాపారంలో సాయం చేసిన శివ శక్తి నాయుడు నెమ్మదిగా నేరాల బాట పట్టాడు.. అనేకమంది వ్యాపారులను సెలెబ్రిటీలను బెదిరించి కోట్లలో డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడు.. నాయుడు తన 13 మంది సహచరులతో కలిసి దక్షిణ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త రాజేష్ కల్రాను బెదిరించి డిఫెన్స్ కాలనీ సమీపంలో రూ .7.69 కోట్లు దోచుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేసాడని ఆరోపణలున్నాయి.

కొంతకాలం క్రితం శివ శక్తి నాయుడును పోలీసులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపారు..జైలునుండి తన కార్యకలాపాలను నిర్వహిస్తూ, ఆరేళ్ళ తరువాత పెరోల్ పై బయటకొచ్చిన శివ శక్తి నాయుడు అప్పటినుండి తప్పించుకుని తిరుగుతున్నాడు. శివ శక్తి నాయుడు తలపై పోలీసులు లక్ష రూపాయల బహుమతిని కూడా ప్రకటించారు.. సినిమాల్లో డాన్ పాత్రలను ఇష్టపడే శివ శక్తి నాయుడు తాను కూడా డాన్ లాగే ప్రవర్తించేవాడు. అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేసి ఆనందించేవాడు.

ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై నాయుడు సోమవారం ఒక ఎస్‌యూవీని దొంగిలించినట్లు పోలీసులు వెల్లడించారు. నాయుడు దోచుకున్న వాహనం మీరట్ లోని వైష్ణో ధామ్ కాలనీకి సమీపంలో గుర్తించబడింది. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యి సంఘటన స్థలానికి చేరుకోగానే శివశక్తి ఉన్న ఇంటి నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దాంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. అరగంట ఎన్‌కౌంటర్ తర్వాత గాయపడి ఉన్న నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. తరువాత చికిత్స సమయంలో శివశక్తి నాయుడు మరణించాడు.

కాగా శివశక్తి నాయుడు ఢిల్లీ స్పెషల్ సెల్ ఆఫీసర్ లలిత్ మోహన్ నేగిని హత్య చేయడానికి కుట్ర పన్నాడని పోలీసులు వెల్లడించారు. ఎన్కౌంటర్ సమయంలో ఒక పోలీస్ అధికారికి గాయాలయ్యాయి. దాంతో అతనిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. శివశక్తినాయుడికి ఢిల్లీతో పాటుగా జమ్మూ కాశ్మీర్, హర్యానా, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా స్థావరాలు ఉన్నాయి. ఢిల్లీని వణికించిన శివశక్తి నాయుడు హతమవ్వడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి