iDreamPost
iDreamPost
కరోనా సెకండ్ వేవ్ తాలూకు ప్రభావం ఊహించిన దాని కన్నా చాలా తీవ్రంగా కొనసాగుతోంది. గత ఏడాదిలాగా దీని వ్యవహారం లేకపోవడంతో అధిక సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దెబ్బకు థియేటర్లు మూతబడ్డాయి. షూటింగులు ఆగిపోయాయి. ఖర్చుకు భయపడి నాని శ్యాం సింగ రాయ్ టీమ్ ధైర్యంగా కొనసాగించింది కానీ ఆ యూనిట్ లోనూ పాజిటివ్ కేసులు బయట పడటంతో ఫైనల్ గా బ్రేక్ చెప్పక తప్పలేదు. ఇక ఎగ్జిబిటర్ల బాధ వర్ణనాతీతం. మిగిలిన వ్యాపారాలకు కనీసం ఓ ఆరు గంటల సేపు వెసులుబాటు ఉండగా తమకు ఆ ఛాన్స్ కూడా లేదని వాపోతున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు జనం కూడా ఎంటర్ టైన్మెంట్ మూడ్ లో లేరు.
తాజాగా విడుదలకు సిద్ధమైన సినిమాలు కొన్ని ఓటిటిలతో చర్చలు జరుపుతున్నాయి. థియేటర్లు తెరుచుకోవడానికి బాగా టైం పట్టేలా ఉండటంతో పాటు క్రేజ్ ఉన్న చిత్రాలు క్యూలో ఉన్న నేపథ్యంలో అనవసరమైన రిస్క్ ఇష్టం లేని మీడియం బడ్జెట్ మూవీస్ డిజిటల్ రూటు పట్టక తప్పేలా లేవు. అందులో ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కూడా ఉందట. గతంలో దీన్ని ఓటిటి రిలీజ్ కోసమే అన్నట్టు కేవలం 45 రోజుల్లో అది కూడా లాక్ డౌన్ టైంలో శరవేగంగా పూర్తి చేశారు. ఈలోగా ఉప్పెన రిలీజ్ కావడంతో వైష్ణవ్ మార్కెట్ పెరిగిపోయి థియేటర్లో వదులుదాం అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది.
లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం దీన్ని డిజిటిల్ లోనే వదిలితే ఎలా ఉంటుందన్న ఆలోచన టీమ్ లో జరుగుతోందట. సుప్రసిద్ధ నవల కొండపోలం ఆధారంగా రూపొందిన ఈ సినిమా కంటెంట్ థియేటర్ ని డిమాండ్ చేసేది కాదని ఎక్కువ శాతం ప్రేక్షకులకు చేరువ కావాలంటే ఓటిటినే బెటరనే ఆలోచనలో దర్శకుడు క్రిష్ ఉన్నట్టు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. టైటిల్ కూడా ఫిక్స్ చేయలేదు. అనిశ్చితి రాజ్యమేలుతున్న తరుణంలో ఏ సినిమా ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవరూ ఊహించలేకపొతున్నారు. మరి దీనికేమవుతుందో వేచి చూడాలి