iDreamPost

అమలు ఎంత ముఖ్యమో చాటిచెప్పిన ‘రూ. 10వేలు’

అమలు ఎంత ముఖ్యమో చాటిచెప్పిన ‘రూ. 10వేలు’

ఏదైనా ఒక పథకాన్ని ప్రకటించడం ఒకెత్తయితే, దానిని సక్రమంగా అర్హులకు అందజేసే వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం మరొక ఎత్తు. ఈ పంపిణీలో ఏ మాత్రం తేడా వచ్చినా పథకం లక్ష్యమే మారిపోతుంది. అంతిమంగా ఇచ్చి మరీ తిట్టించుకోవాల్సి రావొచ్చు. దీనికి ప్రధాన ఉదాహరణ తెలంగాణా రాష్ట్రంలోని తుఫాను బాధితులకు రూ. 10వేల రూపాయల పంపిణీగా చెప్పొచ్చు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు తక్షణ సాయంగా రూ. 10వేలు అందజేయాలని తెలంగాణా సీయం కేసీఆర్‌ నిర్ణయించారు. బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని ప్రకటించిన నాడే అధికారులకు ఆఫ్‌ ది రికార్డ్‌ ఆదేశాలు కూడా అందాయి. దీంతో అధికారులు పరిహారం పంపిణీకి సిద్దమయ్యారు.

సుమారు నాలుగు లక్షల కుటుంబాలకు అందించేందుకు సమాయత్తమై పంపిణీ ప్రారంభించారు. సరిగ్గా ఇక్కడే క్షేత్ర స్థాయిలో రాజకీయనాయకుల ప్రమేయంతో బాధితుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. అధికారులు ఊహించిన దానికంటే దాదాపు రెట్టింపు మంది బాధితులుగా బైటకు వచ్చారు. ఏ మాత్రం ముంపు ప్రభావం లేని కుటుంబాలు సైతం రాజకీయ నేతల అండదండలతో పరిహారం జాబితాలో పేర్లు చోటు దక్కించేసుకున్నాయి. వారంతా పరిహారం పొందేసారు. దీంతో నిజమైన అర్హులకు ఈ నగదు సాయం ఇంకా అందకుండా పోయింది. బాధితులను ఆదుకుందామని ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని అర్ధంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో మిగిలిపోయిన బాధితులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు కారణమైందని పరిశీలకులు చెబుతున్నారు.

పథకం ప్రకటించడంతోనే సరిపోదని, ఖచ్చితంగా అర్హులైన లబ్దిదారులకు అందజేయడం కూడా కీలకమని ఈ సంఘటనతో మరోమారు తేలిందని చెబుతున్నారు. కాగా ఈ పరిస్థితిని నుంచి సేఫ్‌గా బైటపడేందుకు తెలంగాణా ప్రభుత్వ పెద్దలు బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నారట.

ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో నాయకులకు ఆ విషయం అర్ధం కాకపోతే పరిస్థితి ఎంతగా చేయిదాటిపోతుందో ఈ సంఘటనే ప్రభల ఉదాహరణగా చూపుతున్నారు. వ్యవస్థలను సమాయత్తం చేయకుండా అప్పటికప్పుడు అమలు చేసే సంక్షేమ పథకాల్లో కొద్దిపాటి లోటుపాట్లు కలగడం సహజం. కానీ వరద బాధితులకు అందించే సాయంలో కూడా అవకతవకలకు సిద్దపడిపోవడం అంటే అధికార పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులే ఎదురవుతాయన్న అభిప్రాయం పలువురి నుంచి వ్యక్తమవుతోంది.

ఏది ఏమైనా సంక్షేమ పథకం ప్రజలకు అందించేటప్పుడు రూ. 10వేల పంపిణీ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. లేకపోతే ఇచ్చి మరీ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి