iDreamPost

తొలి తెలుగు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎవరు..?

తొలి తెలుగు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎవరు..?

భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర తెలపడంతో అత్యున్నత పదవికి రెండో తెలుగు వ్యక్తి ఎంపికైనట్లు అయింది. జస్టిస్ ఎన్.వి.రమణ ముందు ఆ పదవిని అధిరోహించిన తెలుగు వ్యక్తి కోకా సుబ్బారావు. 1966 – 67 సంవత్సరం లోనే ఆయన మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు సీజేఐ గా బాధ్యతలు నిర్వర్తించారు.

గోదావరి వాసి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కి చెందిన వారు కోకా సుబ్బారావు. 1902 పుట్టిన ఆయన కుటుంబమంతా న్యాయవాద వృత్తి లోనే కొనసాగేది. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన సుబ్బారావు మద్రాస్ న్యాయ కళాశాలలో లా పూర్తి చేశారు. తన మామయ్య వెంకటరమణ నాయుడు వద్ద జూనియర్గా పనిచేసిన కోకా సుబ్బారావు, తర్వాత డిస్టిక్ మున్సిఫ్ గా బాపట్లలో పనిచేశారు. అనంతరం మద్రాసు హైకోర్టు న్యాయవాదిగా పనిచేసిన సుబ్బారావు 1948 లో మొదటిసారి మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

1953లో మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు సూచనలతో ఆయన గుంటూరులో హైకోర్టు ఏర్పాటుకు ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. తర్వాత అదే కోర్టు కు ప్రత్యేక న్యాయమూర్తి గానూ సేవలందించిన జస్టిస్ కోకా సుబ్బారావు తిరుపతిలో ఎస్ వి యూనివర్సిటీ తొలి ఉపకులపతి గా పనిచేశారు.

1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు తొలి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కోకా సుబ్బారావు రెండేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. 1958లో ఆయనకు పదోన్నతి లభించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి గా అవకాశం వచ్చింది. తర్వాత సీనియార్టీ లో భాగంగా 1966 జూన్ 30వ తేదీన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ కోకా సుబ్బారావు 1967 ఏప్రిల్ 11వ తేదీన పదవీ విరమణ చేశారు. సుమారు పది నెలల పాటు ఈ పదవిలో ఉన్న

తొలి తెలుగు వ్యక్తి ఆయనే.. 

మళ్లీ సుమారు 55 ఏళ్ల తర్వాత మరో తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వి రమణ కు ఈ అరుదైన అవకాశం లభించింది. జస్టిస్ కోకా సుబ్బారావు గోదావరి జిల్లాల వ్యక్తి అయితే జస్టిస్ ఎన్వీ రమణ కృష్ణా జిల్లాకు చెందినవారు. తొలి తెలుగు వ్యక్తి 10 నెలలు మాత్రమే పదవిలో ఉంటే జస్టిస్ ఎన్వీ రమణ సంవత్సరానికి పైగా ఈ పదవిలో కొనసాగుతారు. అత్యున్నత పదవిలో అత్యధిక కాలం ఉండే అవకాశం జస్టిస్ ఎన్వీ రమణ దక్కనుంది.

Also Read : తదుపరి సీజేఐ నియామకంపై రాష్ట్రపతి ఉత్తర్వులు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి