iDreamPost

రైతులపై భారం మోపుతూ మోడీ సర్కారు నిర్ణయం, అన్నదాతల్లో కొత్త ఆందోళన

రైతులపై భారం మోపుతూ మోడీ సర్కారు నిర్ణయం, అన్నదాతల్లో కొత్త ఆందోళన

మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారుతోంది. అసలే అంతంతమాత్రంగా సాగుతున్న వ్యవసాయదారులకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఒకేసారి 50 శాతం పైబడి ధరలు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఎరువులు, డీఏపీ ధరలు అమాంతంగా పెంచుతూ కంపెనీలు ప్రకటన చేశాయి. ఇది రైతుల్లో కొత్త ఆందోళనకు కారణమవుతోంది. అయితే పెరిగిన రవాణా ఛార్జీలు, ఇతర కారణాలతోనే ధరలు పెంచాల్సి వచ్చిందని ఎరువుల కంపెనీలు చెబుతున్నాయి.

ఖరీఫ్ సీజన్ కి ముందే ఈ పెంచిన ధరలు అమలులోకి వస్తున్నాయి. దాదాపుగా 58 శాతం మేర ధరలు పెరిగాయి. కాంప్లెక్స్ ఎరువులు, డీఏపీ సహా అన్నింటా ధరల మోత మోగింది. డీఏపీ బస్తా రూ. 1200 నుంచి ఏకంగా రూ. 1900కి పెరిగింది. అమ్మోనియా పాస్ఫేట్ సహా అన్నింటి ధరల మోతాదు కూడా అదే రీతిలో ఉంది. ఎరువుల బస్తా రూ. 475 నుంచి రూ. 700కి పెంచారు. ఇది వ్యవసాయంలో పెట్టుబడుల మోతకి కారణం కాబోతోంది.

అసలే గిట్టుబాటు ధరల సంగతిని ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాల్లో విస్మరించింది. కనీస మద్ధతు ధర విషయంలో కూడా హామీ ఇవ్వగలమే తప్ప చట్టంలో పొందు పరచలేమంటూ చేతులెత్తేసింది. నాలుగు నెలలుగా రాజధాని సమీపంలో అన్నదాతల ఆందోళన కొనసాతున్నా పట్టనట్టే ఉంది. ఓవైపు పెట్టుబడి పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఎంఎస్పీకి కూడా ధీమా లేని స్థితికి తీసుకురావడంతో రైతుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా మారబోతోంది.

పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. కూలీల రేట్లు పెరిగాయి. రుణ సదుపాయం లేకపోవడంతో అప్పులపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రకృతి కరుణ ఉంటుందో లేదో తెలియని స్థితి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం అదనపు భారం మోపడం పట్ల రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు అందుబాటులో ఉన్నప్పటికీ దేశీయంగా పెంచిన ధరల ప్రభావంతో అన్నింటా మోత తప్పడం లేదని వాపోతున్నారు. రైతుల పట్ల మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విపక్షాల విమర్శలకు ఈ పరిస్థితి బలం చేకూరుస్తోంది.

Also Read : కరోనా సెకండ్‌ వేవ్‌.. లాక్‌డౌన్‌పై ప్రధాని మాట..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి