iDreamPost

రాజోలు వైసిపిలో ముదురుతున్న వర్గపోరుకి చెక్ పెట్టేది ఎవరు ??

రాజోలు వైసిపిలో ముదురుతున్న వర్గపోరుకి చెక్ పెట్టేది ఎవరు ??


రాజోలు నియోజకవర్గ వైసిపిలో ఇటీవల కాలంలో పార్టీ కొత్త ఇంచార్జ్ గా నియమితులైన పాతపాటి అమ్మాజీ, పాత ఇంచార్జ్ బొంతు రాజేశ్వరరావు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ వివాదం ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ దృష్టికి కూడా వచ్చింది. అయినప్పటికీ ఇరు వర్గాల మధ్య సఖ్యత కుదరకపోవడంతో నియోజకవర్గంలో రోజు రోజుకి ఈ వర్గపోరు ముదరుతుంది. దీంతో ఈ వివాదానికి ఎలాగైనా చెక్ పెట్టడానికి స్వయంగా రాష్ట్ర మంత్రులు రంగంలోకి దిగారు.


రాజోలు పార్టీలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించదానికి, ఇరువర్గాలతో మాట్లాడే భాద్యతను పార్టీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులకి అప్పగించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో శనివారం తూర్పుగోదావరి లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి జిల్లా పర్యటనకి వచ్చిన జిల్లా ఇంచార్జ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ లతో పాటు అమలాపురం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు తదితరులు ఈరోజు మల్కిపురంలోని తోటా నరసింహులు నివాసంలో రాజోలు నియోజకవర్గానికి చెందిన ఇరు వర్గాల నేతలతో భేటీ అయ్యారు.


ఇటీవల కాలంలో నియోజకవర్గంలో పార్టీ తరుపున రెండు సార్లు పోటీ చేసి తృటిలో విజయం చేజార్చుకున్న ఇరిగేషన్ శాఖ మాజీ ఉన్నతాధికారి బొంతు రాజేశ్వరరావు కు ప్రాధాన్యత తగ్గించడం, అదే సమయంలో కొత్త ఇంచార్జ్ గా పాతపాటి అమ్మాజీ ని నియమించడంతో నియోజకవర్గంలో వర్గపోరు మరింత ముదిరింది. ఈ పరిణామాలతో కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురౌతున్నారు. తుని నుండి నియోజకవర్గానికి వలస వచ్చిన మహిళకు కోఆర్డినేటర్ పదవి ఇవ్వడం ఏంటని బొంతు రాజేశ్వర రావు వర్గం ప్రశ్నిస్తుంది. దీనిపై ఆగ్రహంతో ఉన్న ఆ వర్గం ఇటీవలే తాటిపక లో రోడ్డెక్కి ధర్నా కూడా నిర్వహించింది.


ఇటీవల దాకా నియోజకవర్గంలో బొంతు రాజేశ్వర రావు దే ఆధిపత్యం. వైసిపి కి అనుకూలంగా ఉంటున్న స్థానిక ఎమ్మెల్యే రాపాక వర్గం మీద కూడా బొంతు రాజేశ్వర రావే పెత్తనం చెలాయించారు. అయితే రెండు నెలల క్రితం పార్టీ అమ్మాజీ ని కొత్త ఇంచార్జ్ గా నియమించడంతో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. తుని నియోజకవర్గానికి చెందిన అమ్మాజీ కి ఇంతకుముందు రాజోలు నియోజకవర్గంలో పెద్దగా పరిచయాలు లెవ్వు. అయితే ఇంతకముందు ఆమె తుని నియోజకవర్గంలోని కోటనందూరు జెడ్పిటిసి గా చేశారు. గతంలో జిల్లాలో జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అండదండలతో ఆమె రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ (మాల) చైర్మన్ పదవి దక్కించుకున్నారు.


అసెంబ్లీ ఎన్నికల అనంతరం వైసిపికి టచ్ లో ఉంటున్న స్థానిక ఎమ్మెల్యే రాపాక, వచ్చే ఎన్నికల్లో వైసిపి తరుపున బరిలోకి దిగాలని భావిస్తున్నాడని, దానిలో భాగంగానే ఆయన స్వయంగా వైసిపి అధిష్టానంతో లాబీయింగ్ జరిపి మహిళా నేతను కోఆర్డినేటర్ గా నియమించడంలో కీలకపాత్ర పోషించాడని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

ఒకపక్క ఎన్నికల తరువాత రాజోలు నియోజకవర్గంలో వైసిపి రాజకీయం ఎన్నో మలుపులు తిరుగుతుంది. మరోవైపు స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ రోజు తోటా త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఇరువర్గాలతో మంత్రులు జరుపుతున్న చర్చలు ఫలించి ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదురుతుందో లేదో తెలియాలంటే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి