iDreamPost

అంబేద్కర్ ,రంగా విగ్రహాల ధ్వంసానికి టీడీపీ కుట్ర పన్నుతుందా?సజ్జలకు సమాచారం ఉందా?

అంబేద్కర్ ,రంగా విగ్రహాల ధ్వంసానికి టీడీపీ కుట్ర పన్నుతుందా?సజ్జలకు సమాచారం ఉందా?

డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్, కాపు నేత వంగవీటి మోహన్‌ రంగా విగ్రహాలను ధ్వంసం చేసే కుట్రలకు టీడీపీ పాల్పడుతోంది. ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో అరాచకం సృష్టించి.. ఆ నెపం వైసీపీపై నెట్టేందుకు చంద్రబాబు వ్యూహం రూపొందించారు. కార్యకర్తలకు రహస్య ఆదేశాలిచ్చారు… అంటూ వైసీపీ నేత, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వంలో ముఖ్యమైన స్థానంలో ఉన్న నేత.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసాధారణమనే చెప్పాలి. ప్రతిపక్ష పార్టీల మాదిరిగా.. అధికారంలో ఉన్న నేతలు, అదీ సీఎం ముఖ్య సలహాదారు విమర్శలు చేయలేరు. సజ్జల రామకృష్ణా రెడ్డి ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేశారంటే.. ఖచ్చితంగా బలమైన సంకేతాలు, ఆధారాలు ఉన్నాయనే భావించాలి. సజ్జల అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలా వ్యవహరిస్తారా..? కుల, మత రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబుకు ఉందా..? అంటే.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, తాజాగా జరుగుతున్న అవాంఛనీయ ఘటనలను తప్పకుండా పరిగణలోకి తీసుకుని ఓ అంచనాకు రావాల్సి ఉంటుంది.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన ప్రారంభ నెలల్లో.. ఇసుక సమస్యపై టీడీపీ ఆందోళన చేసింది. అది తప్పా.. ఇప్పటి వరకు ఆ పార్టీ చేసిన ఆందోళనలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అవి ఏమంటే కూడా ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఠక్కున చెప్పలేరు. ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం ఏ విధంగానూ టీడీపీకి లభించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెరపైకి కుల, మత రాజకీయాలు వచ్చాయి. దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ మొదలైన టీడీపీ రాజకీయాలు, ఆ తర్వాత బీసీల వద్దకు చేరుకుంది. ఇవి ఫలితాన్ని ఇవ్వకపోడంతో మత రాజకీయలు మొదలయ్యాయి. దేవాలయాలపై దాడులు, దేవతావిగ్రహాల ధ్వంసం ఘటనలు చేటుచేసుకున్నాయి. ఈ ఘటనలను అడ్డుపెట్టుకుని ప్రజలను మతాల వారీగా విభజించే ప్రయత్నం చేశారు. సీఎంకు మతాన్ని ఆపాదించి.. మెజారిటీ ప్రజలైన హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయి. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తే.. ఏకంగా సీఎం, హోం మంత్రి, డీజీపీ మతాల గురించి మాట్లాడుతూ విమర్శలు చేశారు. అయినా కాలం అన్నింటికీ సమాధానం చెప్పింది. రోజుల వ్యవధిలోనే దేవాలయాలు, దేవుళ్లపై జరుగుతున్న దాడులకు సూత్రదారులు, పాత్రదారులు ఎవరో పోలీసులు కనిపెట్టి.. ఆట కట్టించారు. అరెస్ట్‌లు జరగడంతో.. ఇక దేవాలయాలు, దేవుళ్ల జోలికి వెళ్లలేదు.

ఏం చేసినా.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడడం సాధ్యం కాలేదు. ఇకపై ప్రాంతాల వారీగా లక్ష్యాలు పెట్టుకున్నారనే.. సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానించి ఉండొచ్చు. అంబేడ్కర్, వంగవీటి రంగా విగ్రహలు ఉభయగోదావరి జిల్లాలో అధికం. ఆయా జిల్లాలో ఎస్సీ, కాపు సామాజికవర్గాల జనాభా అధికం. ఈ రెండు వర్గాల మధ్య సఖ్యతలేదనేది గత చరిత్ర చెబుతోంది. ఇలాంటి నేపథ్యంలో బిఆర్‌ అంబేడ్కర్, రంగా విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా.. ఈ రెండు సామాజికవర్గాల్లో అలజడి రేపొచ్చు. రాజకీయంగా చైతన్యవంతమైన ఉభయగోదావరి జిల్లాలు రాష్ట్ర రాజకీయాలును మలుపుతిప్పే సత్తా గలవి. ఈ రెండు జిల్లాలోనే 34 శాసన సభ నియోజకవర్గాలున్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఏం జరిగినా.. దాని ప్రభావం రాష్ట్రం మొత్తంపై పడుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ఏపీ ఇంటిలిజెన్స్‌ అప్రమత్తమైంది. అక్కడ నుంచి వచ్చిన సమాచారం మేరకే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారని వెల్లడైంది. సజ్జల వ్యాఖ్యలు రాజకీయంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రచ్చకు దారితీయడం, మీడియాలో ప్రముఖంగా వినిపించడం వల్ల ఇలాంటి కుట్రలేమైనా, ఎవరైనా చేసినా.. అవి అమలకు నోచుకోవు. అంతిమంగా ప్రజలకు మేలే జరుగుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి