iDreamPost

ఏపీలో లాక్ డౌన్ పై మినహాయింపులు ఇవే..

ఏపీలో లాక్ డౌన్ పై మినహాయింపులు ఇవే..

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చే అంశాలపై జగన్ సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చింది. వైరస్ ప్రభావం ఆధారంగా మూడు జోన్లుగా విభజించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ మొదటి నుంచి చెబుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుంది. ఈనెల 14వ తేదీన ముగిసిన లాక్ డౌన్ ను వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగిస్తూ.. 20 తేదీ తర్వాత నుంచి లాక్ డౌన్ నుంచి కొన్ని అంశాలను సడలింపు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మార్గదర్శకాలపై కూలంకషంగా చర్చించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ సడలింపు ఇచ్చే అంశాలపై కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వైరస్ ప్రభావం లేని ప్రాంతాలలో నిబంధన నుంచి మినహాయింపు లభించనుంది. అయితే ఆయా ప్రాంతాల్లో కూడా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.

– రైసు, పప్పు మిల్లు, పిండి మరలు, డైరీ ఉత్పత్తుల సేవలకు మినహాయింపు.

– సబ్బుల తయారీ కంపెనీలు, ఔషధ తయారీ పరిశ్రమలు, మాస్కులు, బాడీ సూట్లు తయారీ సంస్థలకు మినహాయింపు.

– కోల్డ్ స్టోరేజ్ లు, ఆగ్రో ఇండస్ట్రీస్, బేకరీ, చేపల ధానా తయారీ పరిశ్రమలకు మినహాయింపు.

– అమెజాన్, వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్ కార్యకలాపాలకు అనుమతి.

– ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతుల యూనిట్లకు మినహాయింపు.

– ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు పనిచేసేందుకు అవకాశం.

– ఐస్ ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, ఈ కామర్స్ సంస్థలకు మినహాయింపు.

– గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టుల పనులు, భవన నిర్మాణాలకు అనుమతి.

– ఐటీ సంస్థల్లో 50 శాతం ఉద్యోగాలతో కార్యకలాపాలకు, అన్ని రకాల వస్తువుల రవాణాకు అనుమతులు.

– వాహనాల మరమ్మత్తు కేంద్రాలు, జాతీయ రహదారి పక్కన నిబంధనల మేరకు నిర్వహించుకోవచ్చు.

30 నుంచి 40 శాతం రవాణా సామర్థ్యంతో వాహనాల్లో ఉద్యోగులు తరలించాలి. కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలనుకునే సంస్థలు, కంపెనీలు నిర్ణిత ఫారం లో సంబంధిత శాఖ లేదా అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. కలెక్టర్లు, ఎస్పీలు, పరిశ్రమల శాఖ, రవాణా, కార్మిక శాఖ అధికారులకు అనుమతులు ఇస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి