iDreamPost

మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి తోట నరసింహం

మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి తోట నరసింహం

రాజకీయంగా ఎంతో భవిష్యత్ ఉన్నప్పటికీ అనారోగ్యంతో గడిచిన సాధారణ ఎన్నికలకు దూరంగా ఉన్న తోట నరసింహం మళ్లీ కోలుకుంటున్నారు. సాధారణ జీవితానికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. అంతా అనుకూలిస్తూ రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆశిస్తున్నారు. గతంలో వైఎస్సార్ హయంలో తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో మంత్రి హోదాతో చక్రం తిప్పిన నాయకుడు ఇప్పుడు మళ్లీ కీలకంగా ఎదగాలని కోరుకుంటున్నారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అమరావతికి వచ్చి ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో కూడా ఆయన ఇదే అబిప్రాయాన్ని వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. తొలుత ఆరోగ్యం పూర్తిగా కుదుటపడాలని సీఎం కూడా సలహా ఇవ్వడంతో తోట నరసింహం సంతృప్తిని వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు.

తోట నరసింహం తూగో జిల్లా మెట్ట రాజకీయాల్లో వేగంగా ఎదిగిన నేత. ఆయన సోదరుడు తోట వెంకటాచలం మృతితో రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఏపీ మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో కాకినాడ నుంచి పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహించారు. అయితే 2018 చివరిలో ఆయనకు ఆరోగ్య సమస్యలు చుట్టుమట్టాయి. దాంతో ఆయన ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. చివరకు 2019 ఎన్నికల్లో ఆయన దూరంగా ఉండి భార్య తోట వాణిని బరిలో దింపారు పెద్దాపురం నుంచి వైఎస్సార్సీపీ తరుపున పోటీ చేసిన ఆమె అప్పటి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆతర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాద్యతలు దవులూరి దొరబాబుకి అప్పగించడంతో తోట వాణి ప్రస్తుతం మౌనంగా ఉన్నారు.

తోట నరసింహం, వాణి దంపతుల కుమారుడు తోట రాంజీ రాజకీయ భవితవ్యం కోసం తల్లిదండ్రులు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి పోటీ చేసేందుకు అర్హత దక్కించుకోబోతున్నరాంజీకి అవకాశం కోసం వారు ప్రయత్నాలు ప్రారంభించారు. దానికి తగ్గట్టుగా స్వయంగా తోట నరసింహం రంగంలో దిగి అంతా చక్కదిద్దే ప్రయత్నాలు ప్రారంభించారు. తాజాగా ముఖ్యమంత్రిని అసెంబ్లీలో తండ్రీ, తనయుడు కలిశారు. తాను మళ్లీ ఆరోగ్యవంతుడిగా మారుతున్నందున యధావిధిగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటానని ఆయన తెలియజేయడం ఆసక్తిగా మారింది. ఒకనాడు జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూని వరుసగా ఓడించిన నరసింహం ఇప్పుడు మళ్లీ సీన్ లోకి వస్తే తూగో జిల్లా మెట్లలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాదరహితుడిగా గుర్తింపు ఉన్న తోట నరసింహం ఆరోగ్యం మెరుగుపడితే అంతకుమించిన ఆనందం ఉండదని అభిమానులు సైతం చెబుతున్నారు. దాంతో తోట నరసింహం వ్యవహారం ఆసక్తిగా మారుతోంది.

జక్కంపూడి రామ్మోహన్ రావు తర్వాత జిల్లాలో కాపు కులస్తుల్లో కీలక నేతగా తోట నరసింహం పట్టు సాధించారు. తోట త్రిమూర్తులు వంటి వారు వివాదాల్లో ఇరుక్కోగా నరసింహం వాటికి దూరంగా ఉంటూ అందరినీ కలుపుకుని పోయే నేతగా ఎదిగారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో కన్నబాబు ఆ స్థానం దక్కంచుకున్నారు. దాంతో తోట నరసింహం రాక తర్వాత ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాల్సిన అవసరం ఉంది. అంతమేరకు ఆయన ఆరోగ్యం సహకరిస్తుందా అనేది కూడా చర్చనీయాంశమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి