iDreamPost

మాటలు జారుతూనే ఉన్నాయ్‌

మాటలు జారుతూనే ఉన్నాయ్‌

కాలు జారినా తీసుకోగలం.. కానీ మాట జారితే వెనక్కి తీసుకోలేం.. అన్నది బాగా ప్రాచూర్యంలో ఉన్న సామెత. చూడడానికి ఒక వ్యాక్యమైనా.. దీని వెనుక ఎంతో అర్థం ఉంది. నరం లేని నాలుకను ఎలా అదుపులో ఉంచుకోవాలో, పొదుపుగా ఎలా వాడాలో ఈ సామెత చెబుతుంది. ఆవేశంలో లేదా అకారణంగా ఎవరినీ దూషించకూడదని, అలా చేస్తే తిరిగి ఆ మాటను వెనక్కి తీసుకోలేమని చెబుతోందీ సామెత. ప్రస్తుత తెలుగు రాజకీయ నేతలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ నేతలు ఈ సామెతను తరచూ మననం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడినట్లుగా తాజాగా జరిగిన పరిణామాల ద్వారా అర్థం అవుతోంది.

ప్రభుత్వ స్థలం ఆక్రమించడం తప్పని తెలిసినా. ఆక్రమించి నిర్మాణం కట్టేశారు. తీయాలని నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో అధికారులే ఆ పనికి పూనుకున్నారు. కానీ నోటీసులు ఇవ్వలేదంటూ మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి మాట్లాడడం విడ్డూరంగా ఉన్నా.. కొంత మంది రాజకీయ నేతల ప్రవర్తనకు ఈ ఘటన ఉదహరణగా నిలుస్తోంది. పైగా ఆక్రమణలను తొలగిస్తున్న సిబ్బందిపై, ప్రభుత్వ పెద్దలపై రాయలేని భాషలో దూషించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అన్ని వైపుల నుంచి విమర్శలు చెలరేగడంతో నాలుక్కరుచుకున్న సబ్బం హరి.. తీరిగ్గా ఇప్పుడు మన్నించండంటూ కోరారు. తప్పు తెలుసుకుని క్షమాపణ కోరడం వరకూ బాగానే ఉన్నా.. ఆయన నోటి నుంచి జారిన మాట మాత్రం నిలిచిపోయింది.

ఒక్క సబ్బం హరి మాత్రమే కాదు తెలుగు రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు చేసుకునే విమర్శలు కూడా శృతి మించుతున్నాయనే భావన నెలకొంది. ముఖ్యంగా ఏపీలో అధికారం మారిన తర్వాత ఓ పార్టీ నేతల్లో అసంతృప్తి, ఓర్వలేనితనం పరాకాష్టకు చేరిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాము అనడంతోపాటు, ఇతరుల చేత కూడా ప్రభుత్వ పెద్దలను అనరాని మాటలు అనేలా ప్రొత్సహిస్తున్నారని దాదాపు మూడు వందల రోజుల నుంచి జరుగుతున్న ఉద్యమంలోని నిరసనకారుల నుంచి వచ్చిన మాటలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మాట అంటే.. అది ఎన్నాళైయినా నిలబడిపోతుంది. పైగా ప్రస్తుత సోషల్‌ మీడియా కాలంలో గతం వద్దనుకున్నా నిత్యం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అందుకే రాజకీయ నేతలు.. మాట్లాడే సమయంలో కాలు జారితే తీసుకోగలం.. కానీ మాట జారితే తీసుకోలేం అనే సామెతను ఒక్క సారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి