iDreamPost

సబ్బం హరి పరిస్థితి ఎలా ఉంది.. సీఎం ఎలా స్పందించారు..

సబ్బం హరి పరిస్థితి ఎలా ఉంది.. సీఎం ఎలా స్పందించారు..

మాజీ ఎంపీ, విశాఖ రాజకీయాల్లో చిరపరిచితుడైన సబ్బం హరి పరిస్థితి విషమంగానే ఉంది. ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. మూడు రోజులుగా వెంటిలేటర్ సహాయంతో ఆయనకు వైద్యం అందిస్తున్నారు. కరోనాతో ఆస్పత్రి పాలయిన ఆయన తీవ్రంగా శ్వాస సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్నారు. వైద్యులు ఆయనకు మెరుగైన చికిత్స కోసం ప్రయత్నిస్తున్నారు. స్వయంగా సీఎం కూడా సబ్బం హరి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. మంచి వైద్యం అందించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని వారికి తెలిపారు.

రాజకీయంగా నిత్యం వైఎస్ జగన్ మీద విమర్శలు గుప్పించే సబ్బం హరి విషయంలో సీఎం చొరవను పలువురు ప్రశంసిస్తున్నారు. ఒకనాటి తన సహచర ఎంపీగా ఉన్న సబ్బం హరి పరిస్థితి బాగోలేదని తెలిసి, ముఖ్యమంత్రి నేరుగా వైద్యులతో మాట్లాడిన తీరుని కొనియాడుతున్నారు. వైఎస్సార్ అనుచరుడిగా ముద్రపడిన సబ్బం హరి ఆయన మరణం తర్వాత కొద్దికాలం జగన్ వెంట ఉండి, ఆ తర్వాత పలు శిబిరాల్లో మారారు. కిరణ్ కుమార్ రెడ్డి జైసమైక్యాంధ్ర, ఆ తర్వాత టీడీపీ అంటూ సాగారు. మొన్నటి ఎన్నికల్లో భీమిలి నుంచి బరిలో దిగి టీడీపీ అభ్యర్థిగా ఓటమి పాలయ్యారు.

1980 చివరి దశలో రాజకీయాల్లోకి వచ్చిన సబ్బం హరికి కాంగ్రెస్ లో మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా వైఎస్సార్ చొరవ ఆయనకు ఉపయోగపడింది. విశాఖ నగర పాలక సంస్థ మేయర్ గా ఆయనకు అవకాశం వచ్చింది. ఐదేళ్ల పాటు మేయర్ గా పనిచేసిన తర్వాత కూడా రాజకీయంగా నిలదొక్కుకునేందకు ఆయన తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. వరుసగా రెండు ఎన్నికల్లో ఆయన అవకాశం కోసం తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. చివరకు వైఎస్సార్ ఆశీస్సులతో 2009 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి టికెట్ దక్కింది. అప్పట్లో గట్టి పోటీలో అల్లు అరవింద్, నూకారపు సూర్యప్రకాశరావులను ఓడించి పార్లమెంట్ లో అడుగుపెట్టారు.

అప్పటి వరకూ సాధారణ నాయకుడిగా ఉన్న సబ్బం హరికి ఎంపీ హోదా రావడం మంచి గుర్తింపునకు దోహదపడింది. ముఖ్యంగా వైఎస్సార్ మరణం తర్వాత జగన్ కి గట్టి మద్ధతుదారుగా ఆయన కనిపించేవారు. కానీ అనూహ్యంగా ఆయన జగన్ కి దూరం కావడం, కిరణ్ కి సన్నిహితుడిగా మారడం కూడా చర్చనీయాంశమే. దానికి ప్రధాన కారణం సబ్బం హరి మనస్తత్వం తెలిసి జగన్ దూరం పెట్టారని కూడా ప్రచారంలో ఉంది. ఏమయినా సబ్బం హరి వాక్యూతుర్యం ద్వారా మీడియాలో మంచి గుర్తింపు సాధించారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేశారు. చివరకు ఆ ఎన్నికల్లో జగన్ ఓటమి పాలవుతున్నారంటూ విశ్లేషణలు చేసి అభాసుపాలయ్యారు. ఆయన ఓటమి కూడా రాజకీయంగా ఎదురుదెబ్బ కలిగించిందని చెప్పవచ్చు. ఇక ఫలితాల తర్వాత కూడా ఒంటెద్దుపోకడతో వ్యవహరించిన మూలంగా సబ్బం హరికి అత్యంత సన్నిహితులు కూడా దూరమయ్యారు.

ప్రస్తుతం కోవిడ్ కారణంగా సబ్బం హరి తీవ్ర అస్వస్థతకు పాలుకావడంతో విశాఖ వాసుల్లో పలువురు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా ఆశిస్తున్నారు. ఇప్పటికే విశాఖలో ఇద్దరు కార్పోరేటర్లు, ద్రోణం రాజు శ్రీనివాస్ లాంటి సీనియర్ నేతలు కూడా కోవిడ్ కి బలయ్యారు. సబ్బం హరి క్షేమంగా తిరిగి రావాలని అంతా కోరుకుంటున్నారు.

Also Read : పరీక్షల నిర్వహణపై విమర్శలకు సీఎం జగన్‌ చెక్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి