iDreamPost

పదేపదే అవే తప్పులు..

పదేపదే అవే తప్పులు..

ప్రత్యర్ధులు బలంగా ఉన్నప్పుడు రాజకీయపార్టీలు డిఫెన్స్‌లో పడడం సహజం. అందులోనూ ప్రతిపక్షంలో ఉంటే రాజకీయపరమైన ఇబ్బందులు అనేకం ఉంటుంటాయి. సహజంగానే ఎదురయ్యే ఇబ్బందులు కొన్ని ఉంటే, తాము అధికారంలో ఉండగా చేసిన తప్పుల కారణంగా వచ్చే ఇబ్బందులు ఇంకొన్ని ఉంటుంటాయి. ఇటువంటివి ఎన్ని ఎదురైనప్పటికీ ధీమాగా ఎదుర్కొంటూనే ‘ప్రతిపక్ష’ కాలంలో పార్టీ శ్రేణులను నిలబెట్టుకునేందుకు నాయకుడిదే ప్రధానబాద్యత.

సాధారణంగా ఏ నాయకుడైనా చేసేది కూడా ఇదే. అయితే ఘనత వహించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ విమర్శకులకు చేతినిండా, నోటినిండా పని కల్పిస్తున్నారు. నిజానికి ప్రభుత్వ పరంగా చంద్రబాబుకు ఎదురవుతున్న ఇబ్బందులకంటే తనకుతానుగానే సృష్టించుకుంటున్న ఇబ్బందులే అధికం అన్న అభిప్రాయం సర్వత్రా విన్పిస్తోంది.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సొంత పార్టీ నాయకులకు వెనకేసుకు వచ్చే విధానంపై విమర్శలు రేగుతున్నాయి. గీతం యూనివర్శిటీ, సబ్బం హరిలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. దీంతో నిబంధనల మేరకు వారికి సంబంధించిన కట్టడాలను అధికారులు తొలగించారు. అయితే ఈ విషయంలో మొత్తం గీతం యూనివర్శిటీనే తవ్వేస్తున్నారన్నట్టు, సబ్బం ఇంటి మొత్తాన్నే కూలిగొట్టేస్తున్నారన్నట్టు చంద్రబాబు చేసిన, చేస్తున్న హడావిడిని జనం గమనిస్తూనే ఉన్నారు.

ప్రభుత్వ భూములను తమ తాతల ఆస్తుల మాదిరిగా ధైర్యంగా కబ్జా చేసిన వారికి అండగా నిలబడడం జనంలోకి తప్పుడు సంకేతాలనే పంపిస్తోందంటున్నారు. తనకు తానే నిప్పునని ప్రకటించుకున్న చంద్రబాబు అధికారంలో ఉండగా చేయాల్సిన పనులు ఇప్పటి ప్రభుత్వం చేస్తుంటే అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం పట్ల సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

మరో పక్క రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ విషయంలో తమ మధ్య ఉన్న బంధాన్ని తమకుతామే బైటకు వెల్లడి చేసుకుంటున్న విషయం కూడా జనం గుర్తించకమానలేదు. ఒక్క కేసు నమోదైనప్పుడు ఎన్నికలు రద్దు చేస్తే టీడీపీ మద్దతుగా నిలిచింది. అందుకు చెప్పిన కారణంగా ప్రజల ప్రాణాలు కాపాడడం. అయితే ఇప్పుడు రోజుకు నాలుగువేల కేసులు గుర్తిస్తున్నారు ఇటువంటప్పుడు ఎన్నికలు పెట్టేందుకు కమిషనర్‌ కార్యాచరణ రూపొందించుకుంటుంటే కూడా టీడీపీ మద్దతుగానే నిలుస్తోంది. అంటే అప్పుడు ప్రజల ప్రాణాలకు ఉన్న విలువ, ఇప్పుడు లేదా? అన్న ప్రశ్న జనం నుంచి బలంగానే విన్పిస్తోంది.

ఇవే కాకుండా సీయం జగన్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ విషయంలోగానీ, విజయవాడ రమేష్‌ హాస్పటల్స్‌ అంశంగానీ, జేసీ బ్రదర్స్‌ కేసుపైనగానీ, అచ్చెంనాయుడు కేసు విషయంగానీ.. ఇలా ప్రతి విషయంలోనై చంద్రబాబు, ఆయన బృందం అనుసరిస్తున్న వైఖరి వారికే బూమరాంగ్‌ అవుతోందన్న అభిప్రాయం సొంత పార్టీ నాయకుల నుంచి కూడా విన్పిస్తోంది. ప్రస్తుతం పార్టీ అనుసరిస్తున్న వైఖరులు వ్యూహాత్మక లోపాలుగానే కన్పిస్తున్నాయంటున్నారు. ప్రజల తరఫున ఉన్నామన్న నమ్మకాన్ని కల్గించుకోవాల్సిన సమయంలో, అక్రమాలకు పాల్పడిన తమ పార్టీ నాయకుల తరఫున మాత్రమే వకాల్తా పుచ్చుకుంటూ తమకు తాముగానే రాజకీయ వైకుంఠపాళీలో క్రిందికి జారుతున్నారంటున్నారు.

అయితే ఇవేవే గుర్తించలేనంత స్థితిలో చంద్రబాబునాయుడు లేరన్న అభిప్రాయం కూడా విన్పిస్తోంది. ప్రస్తుతం మిగిలిన పార్టీకేడర్‌ను కాపాడుకునేందుకు మిగులైనా, తగులైనా మద్దతు తెలపడం ఒక్కటే దారి కన్పిస్తుండడంతో ప్రజల నమ్మకం సంగతి తరువాత చూసుకుందాం.. ముందు మన వాళ్ళను కాపాడుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న వారు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా ప్రజల వైపు నుంచైతే మాత్రం టీడీపీ అనుసరిస్తున్న అ వ్యూహం ఫెయిల్యూర్‌ మోడల్‌గానే చూడాల్సి ఉంటుందంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి