iDreamPost

మళ్లీ టీడీపీ గూటికి ఆ మాజీమంత్రి

మళ్లీ టీడీపీ గూటికి ఆ మాజీమంత్రి

ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడమే కాకుండా అనూహ్యంగా మంత్రి పదవి కూడా కొట్టేశారు. కానీ ఆ పదవి మూడేళ్ల ముచ్చటగానే మారింది. దాంతో అలకబూని పార్టీ మార్చేశారు. అక్కడా ఉండలేక ఇంకో పార్టీలోకి.. ఇలా మూడు పార్టీలు మారి.. తాజాగా మళ్లీ తన తొలి పార్టీలోకి మారేందుకు సిద్ధం అవుతున్న ఆ నేత మాజీమంత్రి రావెల కిషోర్ బాబు. టీడీపీతో రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన ఎనిమిదేళ్లలోనే టీడీపీ, జనసేన, బీజేపీ.. మూడు పార్టీలు మార్చారు. మళ్లీ ఇప్పుడు తిరిగి తెలుగుదేశంలో కి మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మంత్రి పదవి పోగానే పార్టీ నుంచి జంప్

ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు 2014 ఎన్నికలకు ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చీ రావడంతోనే ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ అందుకుని టీడీపీ ఎమ్మెల్యేగా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. అంతేకాకుండా ఊహించని రీతిలో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా చోటు సంపాదించారు. సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా సుమారు నాలుగేళ్లు పనిచేశారు. కానీ మంత్రి హోదాలో అనేక వివాదాలు, ఆరోపణల్లో ఇరుక్కున్నారు. దాంతో 2018లో జరిపిన కేబినెట్ విస్తరణలో రావెలను చంద్రబాబు పదవి నుంచి తొలగించారు. పదవి పోవడంతో అసంతృప్తి చెందిన మాజీమంత్రి జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జనసేనను కూడా వీడి బీజేపీలో చేరారు.

చంద్రబాబుతో మంతనాలు

సుమారు మూడేళ్లుగా బీజేపీలో కొనసాగుతున్న రావెల కిషోర్ బాబు ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో అంతంతమాత్రంగానే పాల్గొంటూ అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఆమధ్య అమరావతి రైతులు తిరుపతికి పాదయాత్ర చేసినప్పుడు తన నియోజకవర్గమైన ప్రత్తిపాడులో దారి పొడవునా వారికి స్వాగత సత్కారాలు, భోజన వసతులు తానే ఏర్పాటు చేశారు. అప్పటినుంచీ జిల్లా, రాష్ట్ర టీడీపీ నేతలతో సన్నిహితంగా వుంటూవస్తున్న కిషోర్ బాబు.. తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాంతో ఆయన బీజేపీని వీడి టీడీపీలో చేరుతారని అప్పటినుంచే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రావెల తాజాగా పార్టీ అధినేత చంద్రబాబుతో గుంటూరులో భేటీ అయ్యి మంతనాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో పునఃప్రవేశానికి చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని అంటున్నారు. త్వరలోనే రావెల టీడీపీలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి