iDreamPost

ఆ మాజీ మంత్రి మౌనం వెనుక కారణం అదేనట..!

ఆ మాజీ మంత్రి మౌనం వెనుక కారణం అదేనట..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ఐదేళ్లు, విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ఐదేళ్లు ఆయన మంత్రిగా పని చేసి రికార్డు సృష్టించారు. పార్టీలు వేరైనా ఆయన మాత్రం భవిష్యత్‌ను అంచనా వేసి ఎన్నికలకు ముందు గెలిచే పార్టీలో చేరిపోయేవారు. 2019లో కూడా సదరు నేత సరైన అంచనాలే వేసినా.. గెలిచే పార్టీలో మాత్రం బెర్త్‌ దక్కలేదు. దాంతో అప్పటి వరకు ఉన్న పార్టీ నుంచే పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆయన ఎవరో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ.

గత చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన పితాని సత్యనారాయణ 2019 సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత నల్లపూసయ్యారు. అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలోనూ పితాని మంత్రిగా పని చేశారు. తూర్పుగోదావరి జిల్లాల్లో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పితానికి అందరి కేబినెట్‌లోనూ బెర్త్‌లు దొరికాయి. రాష్ట్ర విభజన తర్వాత శల్యమైన కాంగ్రెస్‌ను వదలి టీడీపీలో చేరారు. ఆచంట నుంచి గెలిచి మంత్రి అయ్యారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు శతవిధాలా ప్రత్నించారు. రాజమహేంద్రవరం ఎంపీ సీటును వైఎస్సార్‌సీపీ బీసీలకు కేటాయించడంతో.. ఆ సీటుపై కన్నేశారు. గట్టి ప్రయత్నాలు జరిగినా.. ఫలించలేదు. దీంతో చేసేదేమీ లేక ఆచంట నుంచే అసెంబ్లీకి పోటీ చేసి ప్రస్తుత గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు చేతిలో ఓటమిపాలయ్యారు.

వైఎస్సార్‌సీపీ అఖండ విజయం తర్వాత పితాని మీడియా ముందుకు రావడం మానేశారు. ఇటీవల ఈఎస్‌ఐ స్కాం వెలుగులోకి రావడంతో.. అప్పట్లో కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన పితాని తప్పని సరి పరిస్థితుల్లో మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఆయన చెప్పాలనుకుంది చెప్పారు. అంతేకాకుండా.. తాను మౌనంగా ఎందుకుంటోంది చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీని గెలిపించారు కాబట్టి ప్రజా తీర్పును గౌరవిస్తూ సైలెంట్‌గా ఉంటున్నారట.

తమ అధినేత చంద్రబాబు ఆవేశపడొచ్చేమో గానీ తాను మాత్రం ప్రజా తీర్పును గౌరవిస్తానని చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వం మంచి చేస్తుందో.. నష్టం చేస్తుందో.. ప్రజలే అనుభం ద్వారా తెలుసుకుంటారని చెబుతున్నారు. ప్రభుత్వం ఏదో చేస్తుందని.. తాము గోల చేయకూడదని, ప్రజలే తెలుసుకుంటారంటున్నారు ఈ మాజీ మంత్రి. వాస్తవాలు తెలిసినా మాట్లాడడం మానేశానంటున్నారు. అయితే పార్టీ కార్యక్రమాలకు చంద్రబాబు పిలిస్తే మాత్రం వెళుతున్నానని ముక్తాయిస్తున్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ మౌనంగా ఉంటున్నారా..? లేక అధికార పార్టీ వైపు చూస్తున్నారా..? అనే అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. గత చరిత్రని చూసే ఏమో.. గుర్రం ఎగరావచ్చు అని విశ్లేషకులంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి