iDreamPost

లుంగీ బ్యాచ్ .. అప్పుడు వర్క్‌ అవుట్‌ అయింది.. ఇప్పుడవుతుందా..?

లుంగీ బ్యాచ్ .. అప్పుడు వర్క్‌ అవుట్‌ అయింది.. ఇప్పుడవుతుందా..?

లుంగీ బ్యాచ్‌లు, కడప కల్చర్, పులివెందుల ఫ్యాక్షన్‌.. ఇందులో చివరి రెండు పదాలు చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లపాటు పలికారు. మొదటి పదం మాత్రం 2014లో విశాఖలో వినిపించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు వినిపిస్తోంది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు.. తాజాగా వైఎస్సార్‌సీపీపై రెచ్చిపోయారు. విశాఖలో లుంగీ బ్యాచులు దిగాయని, విశాఖను లుంగీ బ్యాచులు పాడుచేస్తున్నాయని, జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని.. చెప్పుకొచ్చారు.

ఒక్క సారి వెనక్కి వెళితే.. దాదాపు ఆరేళ్ల కిత్రం ఇవే మాటలు అప్పట్లో బీజేపీ, టీడీపీ నేతలు ఇదే విశాఖలో వల్లెవేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేశాయి. విశాఖ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, వైఎస్సార్‌సీపీ తరఫున వైఎస్‌ జగన్‌ తల్లి విజయమ్మ పోటీ చేశారు. అప్పట్లో వైఎస్సార్‌సీపీ హవాను నిలువరించేందుకు టీడీపీ, బీజేపీ నేతలు.. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు చెప్పినట్లే.. విశాఖలో లుంగీ బ్యాచులు దిగాయి, విశాఖలో రౌడీయిజం చేస్తారు.. విశాఖలో భూములు ఆక్రమిస్తారని ప్రచారం చేశారు. లుంగీ బ్యాచులని ప్రచారం చేయడమే కాదు ఏకంగా జూనియర్‌ ఆర్టిస్టులను ఉపయోగించి వారికి తెల్ల చొక్కాలు, లుంగీలు ధరింపజేసి విశాఖ నగరంలో తిప్పారు.

ఆ ఎన్నికల్లో టీడీపీ స్ట్రాటెజీ విజయవంతమైంది. విశాఖ ఎంపీ, నాలుగు ఎంమ్మెల్యే సీట్లు బీజేపీ, టీడీపీ కూటమి గెలుచుకుంది. ఆ తర్వాత టీడీపీలో మంత్రులుగా చేసిన వారు, ముఖ్య నేతలు విశాఖలో లక్ష ఎకరాలను ఆక్రమించారు. ఇదే అయ్యన్న పాత్రుడు తన సహచర మంత్రులపైనే భూ కుంభకోణాలపై ఆరోపణలు చేశారు. అప్పుడు విశాఖ ప్రజలకు అర్థమైంది. విశాఖలో భూములు ఆక్రమించుకున్నదెవరో.

ఇప్పుడు మూడు రాజధానులను అడ్డుకునేందుకు టీడీపీ లుంగీ బ్యాచ్‌ల స్ట్రాటెజీనే ఉపయోగిస్తున్నట్లు అయ్యన్న మాటల ద్వారా అర్థమవుతోంది. విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించారు. సచివాలయం ఏర్పాటు చేసేందుకు భవనాల అన్వేషణ వేగంగా సాగుతోంది. దేవుడు దిగి వచ్చినా.. మూడు రాజధానుల ఏర్పాటును అడ్డకోలేరని వైఎస్సార్‌సీపీ నేతలు కరాఖండిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అమలు చేస్తున్న లుంగీ బ్యాచ్‌ వ్యూహం 2014 ఎన్నికల్లో లాగా ఇప్పుడు విజయవంతమవుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్లుగా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

రాజధాని అంటే.. ఎవరికి ఇష్టం ఉండదు. విశాఖ లాంటి నగరం కార్యనిర్వాహక రాజధానిగా ఉండడం వల్ల అక్కడ ఉపాది, ఉద్యోగ అవకాలు పుష్కలంగా లభిస్తాయి. మౌలిక వసతులు అత్యున్నతంగా ఉంటాయి. ప్రజల అభీష్టం మేరకు నడుచుకుంటేనే రాజకీయ పార్టీలైనా, నేతలైన మనుగడలో ఉంటారు. లేదంటే.. ఇప్పటిలాగే ఎప్పటికీ ఎదురు చూపులు తప్పవు. ఈ విషయం టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్న అర్థం చేసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి