iDreamPost

ఏపీ నూతన ఎస్‌ఈసీగా నీలం సాహ్ని

ఏపీ నూతన ఎస్‌ఈసీగా నీలం సాహ్ని

ఊహించిందే జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల తదుపరి కమిషనర్‌గా మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఎంపికయ్యారు. ఈ నెల 31వ తేదీన ప్రస్తుత కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల తదుపరి కమిషనర్‌ ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ముగ్గురు అధికారులతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. మాజీ ఐఎఎస్‌ అధికారులైన నీలం సాహ్ని, ప్రేమ్‌ చంద్రారెడ్డి, శ్యామ్యూల్‌ పేర్లను సిఫార్సు చేస్తూ గవర్నర్‌కు జాబితాను పంపింది. అందులో నీలం సాహ్నిని తదుపరి కమిషనర్‌గా ఎంపిక చేస్తూ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు.

1984 ఐఏఎస్‌ బ్యాచ్‌ ఏపీ క్యాడర్‌కు చెందిన నీలం సాహ్ని ఈ ఏడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా పదవీ విరమణ చేశారు. సీఎస్‌గా రాక ముందు ఆమె కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్నారు. కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా పని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో నీలం సాహ్నిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీఎం వైఎస్‌ జగన్‌ నియమించారు.

Also Read : చేతులెత్తేసిన నిమ్మగడ్డ..! ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు సమయం లేదంట..!!

2019లో సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని.. 2020 జూన్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ఆమె సేవల్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌ మూడు నెలల పాటు నీలం సాహ్ని ఉద్యోగ కాలం పొడిగించాలని కేంద్రానికి లేఖరాశారు. సానుకూలంగా స్పందించిన కేంద్రం అనుమతి ఇచ్చింది. రెండో సారి మరో మూడు నెలల పాటు ఉద్యోగ కాలాన్ని సీఎం జగన్‌ పొడిగింపజేశారు.

ఆరు నెలల పాటు నీలం సాహ్ని సేవల్ని వినియోగించుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.. ఆమె ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తన ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పోస్టుకు నీలం సాహ్నిని సిఫార్సు చేశారు. నీలం సాహ్ని ఈ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. ప్రేమ్‌ చంద్రారెడ్డి, శ్యామ్యూల్‌లు ఇద్దరూ.. ముఖ్యమంత్రికి వివిధ శాఖల సలహాదారులుగా ప్రస్తుతం సేవలందిస్తున్నారు.

Also Read : కొత్త కమిషనర్‌ వచ్చాకే పరిషత్‌ ఎన్నికలు.. నిమ్మగడ్డకు మాయని మచ్చ..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి