iDreamPost

నిర్లక్ష్యం చేసాయి.. ఫలితం అనుభవిస్తున్నాయి..

నిర్లక్ష్యం చేసాయి.. ఫలితం అనుభవిస్తున్నాయి..

కోవిడ్‌ 19 మొదటి వేవ్‌ పూర్తయిన తరువాత వచ్చే పరిణామాలను ఎదుర్కొనేందుకు తగిన విధంగా సిద్ధం కాకపోవడం వల్లనే ప్రస్తుతం యూరప్‌ దేశాలు అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయా? అవుననే అంటున్నారు నిపుణులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డేవిడ్‌ నబార్రో చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఇతర దేశాల కంటే వైద్య పరంగా మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్న పలు యూరోప్‌ కంట్రీలన్నీ కోవిడ్‌దెబ్బకు కకావికలైపోతున్నాయి. వ్యాధి ప్రారంభంలో ఉన్న దారుణ పరిస్థితులకంటే కూడా ఇప్పుడు మరింత అధ్వాన్నకర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. రోజూ లక్షల సంఖ్యలో మరణాలు నమోదవుతుండడంతో అక్కడి వైద్య రంగం కూడా చేతులెత్తేసే పరిస్థితులు నెలకొంటున్నాయి.

అయితే ఇటువంటి విపత్కర పరిస్థితికి అక్కడి ప్రభుత్వాలతో పాటు, ప్రజలు కూడా సమాన బాధ్యతే వహించాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండవ, మూడవ వేవ్స్‌ ఉంటాయని, వాటిని తట్టుకునే విధంగా సంసిద్ధం కావాలని నిపుణులు ముందునుంచే హెచ్చరిస్తున్నారు. అయితే యూరోప్‌ దేశాలన్నీ కూడా నిపుణుల మాటను పెద్దగా పట్టించుకున్న దాఖలాల్లేవు. మొదటి వేవ్‌లో పాజిటివ్‌ కేసులు నెమ్మదించిన వెంటనే కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు కొనసాగించాల్సిన చర్యల పట్ల నిర్లక్ష్యం చేసాయి. ఇందుకు అనుగుణంగా ప్రజలు కూడా విచ్చలవిడిగా బైటకు వచ్చి తిరగడం ప్రారంభించారు.

సాధారణ రోజుల్లో మాదిరిగానే పార్టీలు, పబ్‌లు అంటూ హల్‌ఛల్‌ చేసారు. దీంతో వైరస్‌ వ్యాప్తి విస్తృతమైపోయింది. దీని ప్రభావమే ఇప్పుడు ఆయా దేశాలు ఎదుర్కొంటున్నాయి. ప్రతి రోజూ లక్షల సంఖ్యలో ఆయా దేశాల పౌరులు మృత్యువాత పడుతున్నారు. మృతుల సంఖ్యను సెకన్లతో పోలుస్తున్నారంటే అక్కడి పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ దేశాల్లో మూడో వేవ్‌ వస్తుందని, దానికి కొత్త సంవత్సరమే గడువని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే 1, 2, 3.. ఇలా వేవ్‌లు వచ్చేస్తున్నాయి, జనం నిర్లక్ష్యంగా ఉన్నారు, ప్రభుత్వాలు కూడా తమ చేతికి మట్టి అంటకుండా వ్యవహరించేస్తున్నాయి.

కానీ ఇలా లక్షల సంఖ్యలో వచ్చిపడే పాజిటివ్‌ కేసులకు వైద్యం అందించాల్సిన వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ వారివారి సేవలను ఎంతకాలం అందించగలుగుతారు? అన్న ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పటి వరకు తమ ప్రాణాలు తెగించి కోవిడ్‌ బాధితులకు చికిత్స అందించారు, సేవలు చేసారు. కానీ మళ్ళీమళ్ళీ అదే రీతిలో లక్షలాది వచ్చిపడే పాజిటివ్‌లకు సేలందించే పరిస్థితులు ఎల్లకాలం కొనసాగుతాయన్న ఆశలు పెట్టుకోవడం అత్యాశే అవుతుంది. ఇప్పటికే వైద్య సిబ్బంది, పోలీస్, ఇతర కీలక శాఖల్లోని సిబ్బంది కోవిడ్‌ కారణంగా మృత్యువాత పడ్డారు.

ఇటువంటి పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు ఏర్పడే వాటికి ఎలాగూ సేవలందిస్తారు.. కానీ నిర్లక్ష్యం కారణంగా తెచ్చుకునే వ్యాధులకు కూడా వారి ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించమనడం ఎంత వరకు భావ్యమో వ్యక్తిగతంగా ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాస్కు పెట్టుకోండి, భౌతిక దూరం పాటించండి, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోండి అంటూ ఎంతగా మొత్తుకుంటున్నప్పటికీ మొత్తం జనాభాలో కేవలం 40–60 శాతం మంది మాత్రమే ఆయా జాగ్రత్తలు పాటిస్తున్నట్లుగా పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మిగిలిన వారంతా తీవ్ర నిర్లక్ష్యంతోనే వ్యవహరిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇటువంటి స్థితిలో మున్ముందు ఎదురవ్వబోయే ముప్పును ఎవరికి వారు వ్యక్తిగతంగా ఎదుర్కొవడానికి సిద్ధం కావాల్సిందేనంటున్నారు.  

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి