iDreamPost

గాల్లో ఏలూరు కార్పొరేషన్‌ ఫలితం.. విచారణ మళ్లీ వాయిదా..

గాల్లో ఏలూరు కార్పొరేషన్‌ ఫలితం.. విచారణ మళ్లీ వాయిదా..

ఎన్నికలు జరిగి నెల రోజులు అవుతున్నా.. ఏలూరు కార్పొరేషన్‌ ఫలితం ఎప్పుడు వస్తుందనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఓట్ల లెక్కింపు చేపట్టడంపై విచారణను ఈ రోజు ఏపీ హైకోర్టు మరోమారు వాయిదా వేసింది. ఈ నెల 19వ తేదీన మళ్లీ విచారణ జరగనుంది. ఇప్పటికే ఒక సారి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ రోజు విచారణ పూర్తయి తుది తీర్పు వస్తుందని ఆశించిన అభ్యర్థులకు నిరాశే ఎదురైంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఏకైక కార్పొరేషన్‌ ఏలూరు. కార్పొరేషన్‌లో సమీప పంచాయతీలు విలీనమయ్యాయి. పంచాయతీల తీర్మాణాలు లేకుండానే విలీనం చేశారని, ఓటర్ల జాబితా శాస్త్రియంగా జరగలేదని, రిజర్వేషన్లు సక్రమంగా పాటించలేదనే కారణాలతో పలువురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమ అభ్యంతరాలు పరిష్కరించే వరకూ ఎన్నికలను నిలిపివేయాలని కోరారు. ప్రతివాదులుగా ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాన్ని చేర్చారు.

ఇరు వైపుల వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మున్సిపల్‌ పోలింగ్‌ జరిగిన మార్చి 10వ తేదీకి ముందు రోజు రాత్రి తీర్పు వెల్లడించింది. పోలింగ్‌ నిర్వహించేందుకు అనుమతించిన ధర్మాసనం.. ఫలితాలను మాత్రం ప్రకటించవద్దని ఆదేశాలు జారీ చేసింది. తుది తీర్పునకు లోబడి ఫలితాలు వెల్లడించాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను మార్చి 23వ తేదీకి వాయిదా వేసింది.

కోర్టు తీర్పు నేపథ్యంలో 11 కార్పొరేషన్లతోపాటు ఏలూరుకు ఎన్నికలు జరిగాయి. మార్చి 14వ తేదీన ఏలూరు మినహా 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఫలితాలు వెల్లడించారు. ఏలూరు ఎన్నికల ఓట్లు లెక్కింపు కోర్టు తీర్పుతో ఆగిపోయింది. 23వ తేదీన విచారణ జరగాల్సి ఉండగా.. విచారణలు ఎక్కువగా ఉండడంతో తదుపరి రోజునకు వాయిదా పడింది. ఈ వాయిదాల పర్వం 24వ తేదీతో ఆగలేదు. ఏప్రిల్‌ 1వ తేదీన తాజాగా ఈ రోజున వాయిదా పడింది. దీంతో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఓకింత నిరాశ నెలకొంది. ఈ నెల 19వ తేదీన అయినా వివాదం పరిష్కారం అవుతుందనే ఆశతో అభ్యర్థులున్నారు.

ఏలూరు కార్పొరేషన్‌లో 50 డివిజన్ల పరిధిలో 2,32,378 మంది ఓటర్లు ఉన్నారు. 56.82 శాతం పోలింగ్‌ నమోదైంది. పంచాయతీలను విలీనం చేయడంతోపాటు ఓటర్లను సర్దుబాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారే విమర్శలు వచ్చాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఓటు కూడా గల్లంతు కావడం ఈ విమర్శలకు బలం చేకూరింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి