iDreamPost

ఇండియాని దోచేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ

ఇండియాని దోచేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ

ప్ర‌ముఖ చ‌రిత్ర‌కారుడు విలియ‌మ్‌డాల్ రింపుల్ ఈ మ‌ధ్య ఒక పుస్త‌కం రాశారు. దానిపేరు ANARCHY ఈస్టిండియా కంపెనీకి సంబంధించిన క‌థ‌. కొత్త సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌లుకుతూ 31 డిసెంబ‌ర్ 1600 సంవ‌త్స‌రంలో దీన్ని ప్రారంభించారు. సిపాయిల తిరుగుబాటు (1857) త‌ర్వాత దీన్ని 1874లో ర‌ద్దు చేశారు. మొగ‌ల్ సామ్రాజ్యానికి , చైనాకి ప‌త్తి, ఉప్పు, టీ ఇలాంటివి అమ్ముకోడానికి ఇది వ‌చ్చింది. త‌ర్వాత ఆ దేశ ప్ర‌జ‌ల్నే అమ్మేసింది.

జాన్‌వాట్స్ అనేవాడు ఈ కంపెనీని స్థాపించాడు. వాస్త‌వానికి తొలి రోజుల్లో ఇది వ్యాపార‌మే చేసింది. కానీ మొగ‌ల్ రాజుల ప‌త‌నం, సంస్థానాదీశుల కీచులాట‌లు ఇవ‌న్నీ క‌లిసొచ్చాయి.

డాల్‌రింపుల్ త‌న పుస్త‌కంలో ఏమంటారంటే 18వ శ‌తాబ్దం నాటికి భార‌త‌దేశ ఆర్థిక శ‌క్తి ప్ర‌పంచంలోనే 23 శాతం. అంటే యూర‌ప్ అంతా క‌లిస్తే ఎంత వ్యాపారం జ‌రుగుతుందో , ఒక్క భార‌త‌దేశంలోనే అంత జ‌రుగుతుంది. అందుకే ఫ్రెంచ్‌, పోర్చుగీస్ వాళ్లు దీనిపై క‌న్నేశారు. త‌ర్వాత ఇంగ్లండ్ వ‌చ్చి చేరింది. 1700 నాటికి ఔరంగ‌జేబు ఖ‌జానా 100 మిలియ‌న్ పౌండ్స్‌తో స‌మానం. అంటే చాలా దేశాలు మ‌న‌ముందు భిక్ష‌గాళ్ల కింద లెక్క‌. (ఈ రోజు మ‌న పిల్ల‌లు లండ‌న్‌లో పౌండ్ల కోసం ఉద్యోగం చేస్తున్నారంటే అదంతా మ‌న డ‌బ్బే. 200 ఏళ్లు ఈ దేశాన్ని దోచిన డ‌బ్బు)

1765 నాటికి మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి బ‌ల‌హీనుడ‌య్యే స‌రికి బెంగాల్‌, బీహార్‌, ఒరిస్సాల‌లో రెవెన్యూ వ‌సూళ్లు కంపెనీ అధికారులే చేప‌ట్టారు. ఆ త‌ర్వాత వాళ్లు ఆగ‌లేదు. సైనిక శ‌క్తిని పెంచుకున్నారు. రాజుల్ని మార్చారు. క‌ప్పం క‌ట్టించుకున్నారు. ఈ కంపెనీలో భాగ‌స్వాములంతా లండ‌న్‌లో వ్యాపారులు. వాళ్లు లాభాల కోసం పీడించే కొద్ది, కంపెనీ ఇక్క‌డి ప్ర‌జ‌ల‌పై దోపిడీ పెంచింది.

ర‌చ‌యిత చాలా ప‌రిశోధ‌న చేసి ఈ పుస్త‌కం రాశారు. మ‌చిలీప‌ట్నంలో అధికారిగా ఉన్న ఫ్రాన్సిస్‌డే , ఒక త‌మిళ అమ్మాయి ప్రేమ‌లో ప‌డ‌డం వ‌ల్లే మ‌ద్రాస్‌ని కొనుగోలు చేశాడ‌ట‌. వాస్త‌వానికి మ‌ద్రాస్ కొన‌డం బ్రిటీష్ అధికారుల‌కి ఇష్టం లేదు. ఫ్రాన్సిస్‌డే రొమాన్స్ వ‌ల్ల అది ఈ రోజు మ‌హాన‌గ‌ర‌మైంది.

కంపెనీ దృష్టిలో బ్రిటీష్ వాళ్ల ప్రాణాల‌కే విలువ‌. అందుకే 1757లో క‌ల‌క‌త్తాలో భార‌త సైనికులు నివాసం ఉండే బ్లాక్‌టౌన్‌పై సిరాజుద్దౌలా దాడి చేసిన‌ప్పుడు ఎలాంటి ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోలేదు.

జ‌గ‌త్‌సేఠ్ అనే ఇండియా వ్యాపారి, కంపెనీతో చేతులు క‌లిపి అనేక రాజ్యాల ప‌త‌నానికి కార‌ణ‌మ‌య్యాడు.

1770లో బెంగాల్ ప్ర‌జ‌లు 3వ వంతు క‌రువుతో చ‌నిపోయినా కంపెనీ ప‌ట్టించుకోలేదు. కంపెనీ ఎంత స్వార్థంగా ప‌నిచేసినా , ప‌రోక్షంగా అది భార‌త‌దేశం అనేక రాజ్యాలుగా చీలిపోకుండా కాపాడింది. ఇంగ్లండ్ దృష్టిలో అదొక హీరో. మ‌న దృష్టిలో విల‌న్‌. దాన్ని ఎలా చూసిన‌ప్ప‌టికీ అదొక చ‌రిత్ర‌, దుష్ట చ‌రిత్ర కూడా కావ‌చ్చు.

1874లో దాన్ని ర‌ద్దు చేసిన త‌ర్వాత ఒక గుజ‌రాతీ వ్యాపారి ఆ బ్రాండ్ పేరుతో లండ‌న్‌లో చాక్లెట్స్ తయారు చేశాడు. తిన్న త‌ర్వాత ఈస్ట్ ఇండియా రేప‌ర్ డ‌స్ట్‌బిన్‌లో క‌నిపించ‌డం ఒక విచిత్రం.

వ్యాపారులు ప్ర‌భుత్వాల‌ని న‌డ‌ప‌డం గ‌త‌మే కాదు, వ‌ర్త‌మానం కూడా. ఈస్ట్ ఇండియా స్ఫూర్తితో ఇప్పుడు కూడా మ‌న‌దేశాన్ని వ్యాపారులే పాలిస్తున్నారు. బ్రిటీష్ కంటే అన్యాయంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దిగ‌జార్చుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి