iDreamPost

దుబ్బాక లో టెన్ష‌న్.. టెన్ష‌న్..!

దుబ్బాక లో టెన్ష‌న్.. టెన్ష‌న్..!

దుబ్బాక ఎవ‌రిదో.. నేడు ప్ర‌జ‌లు తీర్పు ఇవ్వనున్నారు. అభ్య‌ర్థుల స‌హా అంత‌టా టెన్ష‌న్ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొన‌సాగుతుంది. టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి రఘునందన్‌ రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థులుగా బ‌రిలో ఉన్న విష‌యం తెలిసిందే. వీరు కాకుండా మొత్తంగా ఇక్క‌డి నుంచి 23 మంది పోటీ చేస్తున్నారు.

అక్క‌డి రాజ‌కీయ వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల దృష్ట్యా భారీ స్థాయిలో బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. 2 వేల మంది పోలీస్ సిబ్బందిని నియ‌మించారు. 4 వరకు దుబ్బాక నియోజకవర్గంలో 144 సెక్షన్ అమ‌లులో ఉంటుంది. నియోజకవర్గంలో మొత్తం 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అధికారులు 89 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్క‌డ నిఘా ఎక్కువ‌గా ఉంచారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ఏర్పాట్లు చేశారు. ఒక్కో కేంద్రానికి వెయ్యి మంది మాత్ర‌మే ఓటర్లు ఉండేలా చూశారు. వృద్ధులు, దివ్యాంగులు, కరోనా రోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉంది.

డిష్యూం.. డిష్యూం..

మరికొన్ని గంటల్లో దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో సోమ‌వారం రాత్రి సిద్ధిపేటలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. కాగా స్థానికంగా ఉన్న స్వర్ణా ప్యాలెస్‌ హోటల్‌లో డబ్బులు పంచుతున్నట్లు సమాచారం ఉందంటూ బీజేపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అదే హోటల్‌లో బస చేసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువ‌చ్చారు. టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి