iDreamPost

PM Modi డ‌బుల్ ఇంజ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చితీరుతుంది, తెలంగాణలో మెగా టెక్స్ టైల్స్ పార్క్, ప్ర‌ధాని

PM Modi డ‌బుల్ ఇంజ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చితీరుతుంది,  తెలంగాణలో మెగా టెక్స్ టైల్స్ పార్క్, ప్ర‌ధాని

తెలంగాణ‌లో డ‌బుల్ ఇంజ‌న్ వ‌చ్చి తీరుతుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.
బీజేపీ కార్యవర్గ సమావేశాల త‌ర్వాత‌, పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో, కార్య‌క‌ర్త‌ల‌కు చురుకుపుట్టించేలా మాట్లాడారు. సభా వేదికపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను మోదీ భుజం​ తట్టి అభినందించారు. కిక్కిరిసిన బీజేపీ శ్రేణుల‌కు అభివాదం చేశారు.

సోద‌రీ సోద‌రీమ‌ణుల్లారా అంటూ తెలుగులో ప్ర‌సంగాన్ని ప్రారంభించిన ప్ర‌ధాని, ఎంతో దూరం నుంచి వ‌చ్చిన కార్య‌క‌ర్త‌ల‌కు నా అభినంద‌న‌లు. తెలంగాణ నేల‌తల్లికి వంద‌నం స‌మ‌ర్పిస్తున్నా. తెలంగాణ గ‌డ్డ‌కుశిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నా. తెలంగాణ మొత్తం ఈ మైదానంలో కూర్చొన్న‌ట్లే ఉంది. హైద‌రాబాద్ సిటీ అంద‌రికీ అండ‌గా నిలుస్తోంది. ప్రాచీన సంస్కృతి, ప‌రాక్ర‌మానికీ తెలంగాణ నేల‌ పుణ్య‌స్థ‌లం. తెలంగాణ ప‌విత్ర భూమి. దేశ ప్ర‌జ‌ల‌కు యాదాద్రి న‌ర‌సింహ‌రావు. గ‌ద్వాల జోగులాంబ‌, వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళి అమ్మ‌వారి ఆశీస్సులుంటాయ‌ని మోదీ అన్నారు. ఇలా, తెలంగాణ చ‌రిత్ర‌ను, ఆధ్యాత్మిక‌ను ఘనంగా ప్ర‌స్తావించారు.

కాకతీయుల వీరత్వం, శిల్పకళా సౌందర్యం చాలా గొప్పది. ఈ సాహిత్యకారుల కృషి దేశానికే గర్వకారణం. తెలంగాణలో కలలు, నైపుణ్యం ఎంతో మెండుగా ఉన్నాయ‌న్న మోదీ తెలంగాణ గడ్డ ఎంతో స్ఫూర్తిని ఇస్తోంద‌ని అన్నారు. అలాంటి తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంద‌ని చెప్పారు.

రాజ‌కీయంగా ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌ని ప్ర‌ధాని, త‌న ప్ర‌సంగంలో తెలంగాణ‌కు చేసిన అభివృద్ది గురించే చెప్పారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాం. తెలంగాణ నుంచి ధాన్యం కొన్నామ‌ని చెప్పిన ప్ర‌ధాని, ఆరేళ్ల‌లో లక్ష కోట్ల విలువచేసే ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసింద‌ని చెప్పారు. తెలంగాణ‌లో జాతీయ రహదారులకు పెద్ద‌గా నిధులు కేటాయించాం. తెలంగాణలో కొత్త రైల్వే లైన్లను నిర్మించామ‌ని చెప్పిన మోదీ, తెలంగాణలో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను నిర్మిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఇత‌ర రాష్ట్రాల్లో జ‌నంలో పెరుగుతున్న న‌మ్మ‌కం వ‌ల్ల‌ డ‌బుల్ ఇంజ‌న్ గ‌వ‌ర్న‌మెంట్లు వ‌చ్చాయి. తెలంగాణ‌లోనూ బీజేపీ డబుల్ ఇంజ‌న్ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లు దారివేస్తున్నార‌ని ప్ర‌ధాని అన్నారు. బీజేపీ డ‌బుల్ ఇంజ‌న్ ప్ర‌భ‌త్వం వ‌స్తే అంద‌రికీ మేలు జ‌రుగుతుంద‌ని అన్నారు.

గ‌త ఎనిమిదేళ్ల‌లో పేద‌లు, ద‌ళితులు, వెనుక‌బ‌డిన వ‌ర్గాల కోసం మేం చాలా ప‌థ‌కాల‌ను ఆరంభించాం. అందుకే ఈ ప్ర‌భుత్వం మీద, ప‌థ‌కాల మీద న‌మ్మ‌కం ఉంచారని ప్ర‌ధాని చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి