iDreamPost

‘ఆంధ్రుల అన్నపూర్ణ’ డొక్కా సీతమ్మ వర్ధంతి నేడు

‘ఆంధ్రుల అన్నపూర్ణ’ డొక్కా సీతమ్మ వర్ధంతి నేడు

‘అన్నిదానాలలోకి అన్నదానం మిన్న’.మనిషి ఆకలి తీర్చడం,అన్ని కర్తవ్యాలలోకి,అతి ముఖ్యమైన కర్తవ్యం.ఆ బాధ్యతను తనదిగా భావించి,నిత్యాన్నదానం చేసిన మహనీయులు ఎందరో ఉన్నారు.అయితే వారందరిలోకి ఎన్నతగిన పేరు డొక్కా సీతమ్మది.

ఆమె తెలుగు నేలలో జన్మించిఈ నేలకు గౌరవం తెచ్చిన మహామనిషి. తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమలో లంకల గన్నవరంలో నిత్యాన్నదానంకు పేరు పొందింది డొక్కా సీతమ్మ. నిజానికి ఆమె తల్లితండ్రులు కూడా అన్నదానం చేయడంలో ఎంతో గుర్తింపు పొందినవారే. ఆమె తండ్రి అనప్పిండి భవానీ శంకరం మండపేట గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. ప్రజలు ఆయనను ‘బువ్వన్న గారు’ అని పిలిచేవారు. తెలుగులో అన్నాన్ని ‘బువ్వ’అనికూడా అంటారు కదా.. అందుకే బువ్వన్న అంటే,అన్నం పెట్టే పెద్ద మనిషి అని జనం మాట.

భవానీశంకరం భార్య నరసమ్మ. ఆ దంపతులకు 1841వ సంవత్సరంలో సీతమ్మ జన్మించింది. ఆరోజుల్లో ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు.

ఆమెకు తొమ్మిదవ ఏడు వచ్చేసరికి, తల్లి మరణించింది.ఆ చిన్న వయసులో ఇంటి బాధ్యత అంతా సీతమ్మ పైనే పడింది.అంతవరకు తల్లి చేస్తున్న అన్నదానాన్ని ఆ ఇంట ఆమె కొనసాగించింది. ఒకరోజు లంకల గన్నవరం నుండి..డొక్కా జోగన్న అనే వేదపండితుడు వారి ఇంటికి భోజనానికి వచ్చారు. ఆయనకు సీతమ్మ చాలా నచ్చింది. ఆమెను వివాహం చేసుకోవాలని భావించాడు. అయితే వాళ్ళిద్దరికి మధ్య వయసులో ఎక్కువ తేడా ఉంది. కానీ జోగన్న పాండిత్యానికి మెచ్చిన భవానీశంకరంకు సీతమ్మతో వివాహం జరిపించాడు.

డొక్కా జోగన్నసహృదయులు. వారిది బాగా కలిగిన కుటుంబం.అందువల్ల సీతమ్మ యధావిధిగా అన్న దానం చేస్తూ ఉండేది. ఆమెను జోగన్న అన్నివిధాల ప్రోత్సహించారు.

లంకల గన్నవరం రాజోలు వెళ్లేదారిలో ఉన్న గ్రామం. రోజూ చాలా మంది ఆ దారిన ప్రయాణం చేస్తూ ఉండేవారు. వారందరికీ భోజన కేంద్రం డొక్కా సీతమ్మ ఇల్లే. ఎవరు ఎప్పుడు వచ్చినా ఆమె ప్రేమతో అన్నం పెట్టేది.

కాలం ఎప్పుడూ ఎవరి జీవితాలలోనూ ఒకే విధంగా సాగదు కదా. ఉన్నట్టుండి జోగన్నమరణించారు. సీతమ్మ వంటరిదైపోయింది. భర్త పోయిన దుఃఖం ఆమెను ఎంత బాధిస్తున్నా ఆమె తన నిత్యాన్నదానం మానలేదు. ఆ కార్యక్రమాన్ని ద్విగుణీకృతంగా కొనసాగిస్తూనే వచ్చింది.

డొక్కా సీతమ్మ అన్నదానం గురించి ఎన్నో కథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ రోజుకి జనులు ఆమె కథలు చెప్పుకొంటూనే ఉంటారు.

లంకల గన్నవరం గోదావరి నది ఒడ్డున ఉంది. ప్రతి ఏటా గోదావరికి వరదలు వస్తుంటాయి. ఒకసారి చాలా పెద్ద వరద వచ్చింది. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఆ రాత్రి ఒక వ్యక్తి ఆకలితో బాధపడుతూ గోదావరి లంకలో నుండి సీతమ్మ గారూ…ఆకలి వేస్తోంది.. అన్నం పెట్టండి అంటూ కేకలు పెడుతున్నాడు. అది సీతమ్మ చెవిన పడింది. వెంటనే అన్నం వండింది. ఆరాత్రి పడవ నడపడానికి అందరూ భయపడ్డారు. ఆమే ధైర్యంతో తన భర్తని తీసుకుని గోదావరిలో పడవ ఎక్కింది.ఆ రాత్రి అతడి ఆకలి తీర్చింది.

ఒకసారి ఒక దొంగ వారి ఇంట్లో దొంగతనానికి వచ్చాడు. ఆమె విలువైన పట్టుచీర దొంగిలించాడు. అయితే.. ఈ లోగా జనం దొంగను పట్టుకుని కొట్టబోయారు. ఈలోగా సీతమ్మకి మెలుకువ వచ్చింది. ఆమెను చూసి దొంగ ఆమె కాళ్ళమీద పడ్డాడు. దొంగని ప్రేమతో దగ్గరకు తీసుకొంది. అతడికి కడుపునిండా అన్నం పెట్టి..ఏ పట్టుచీర అతడు దొంగతనం చేసాడో..ఆ పట్టుచీర అతడికి ఇచ్చేసి ఆశీర్వదించింది.

ఒకసారి, ఆమెఅంతర్వేదిలోని లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి బయలుదేరింది. దారిలో ఒక ఊళ్ళో ఒక సత్రంలో ఆగినప్పుడు..ఒక కుటుంబం కన్పించింది. అందులో పిల్లలు ఆకలి ఏడుస్తుంటే పెద్దవాళ్లు ఓదారుస్తూ మనం సీతమ్మ గారి ఇంటికి దగ్గరలో ఉన్నాం ఏడవకండి తొందరలో కడుపునిండా 
భోజనం చేయవచ్చు అంటున్నారు. అది విన్న ఆమె తన ప్రయాణాన్ని మానుకొని వేగంగా ఇంటికి చేరి వేడివేడిగా వంట చేసివచ్చిన వాళ్లకు తృప్తిగా భోజనాలు పెట్టింది. ఆపైన మనసులోనే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామికి నమస్కరించుకొంది. ఆమె గురించి ఇటువంటి ఎన్నో కథలు ప్రజలు ప్రేమతో చెబుతూ ఉంటారు.

ఆమె కీర్తి క్రమంగా దేశాలు దాటిబ్రిటీష్ చక్రవర్తి చెవిన పడింది. ఏడవ ఎడ్వర్డ్ ప్రభువు ఆమెను తన పట్టాభిషేకానికి లండన్ రమ్మని ఆహ్వానించాడు. అయితే లండన్ వెళ్లి వచ్చే సమయంలో తాను చేస్తున్న అన్నదానానికి అంతరాయం ఏర్పడుతుంది అని భావించి చక్రవర్తి కోరికను ఆమె మర్యాదగా తిరస్కరించింది. అయితే ఆంగ్ల ప్రభుత్వం ఢిల్లీలో తిరిగి పట్టాభిషేకం వేడుకలు జరిపినప్పుడు దర్బార్ హాలులో ఆమె చిత్రపటాన్ని పెట్టి గౌరవించారు.

గోదావరి జిల్లా కలెక్టర్ ద్వారా ఆమెకు ఒక బంగారు పతకాన్ని, ప్రశంసా పత్రాన్ని పంపించారు. కలెక్టర్ గన్నవరం వచ్చి సీతమ్మని సత్కరించారు. 
జీవితాంతం నిత్యాన్నదానం చేస్తూ డొక్కా సీతమ్మ 1909వ సంవత్సరం ఏప్రియల్ 28వ తేదీన మరణించారు.

ఆమె భౌతికంగా మరణించి ఉండవచ్చు. కానీ.. ఆమె కీర్తికి మరణం లేదు. ఆనాడు ఆరంభించిన నిత్యాన్నదానం అనే భావన ఈనాడు విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది. భారతదేశంలోని అనేక దేవాలయాల్లో నిత్యాన్నదానం సాగుతూనే ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి