iDreamPost

టీడీపీకి డొక్కా రాంరాం…

టీడీపీకి డొక్కా రాంరాం…

టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేసారు. ఈ మేరకు ఒక బహిరంగలేఖను ఆయన విడుదల చేసారు. గతంలో MLC పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

కాగా రాజీనామా లేఖలో టీడీపీ అధిష్టాన వైఖరి తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని డొక్కా వివరించారు. తాను 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ సీటును ఆశించానని, కానీ నాటకీయ పరిణామాల మధ్య తనకు ప్రత్తిపాడు సీటును కేటాయించారని తెలిపారు. ఓటమి సంకేతాలు కనబడుతున్నా సరే ప్రత్తిపాడు నుండి పోటీచేశానని, కానీ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యానని ఓటమి అనంతరం తనపట్ల పార్టీ చూపిన ఉదాశీన వైఖరికి తీవ్ర ఆవేదనకు గురయ్యానని పేర్కొన్నారు.

Read Also: అమరావతి – మాణిక్య వరప్రసాద్ రాజీనామా

రైతుల అమరావతి ఉద్యమం నేపథ్యంలో తనకున్న వ్యక్తిగత సమాచారం మేరకు మండలి సమావేశాలు అత్యంత వివాదాస్పదంగా జరిగే అవకాశం ఉన్నందున సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాను మానసికంగా వైసీపీ వైపు మొగ్గు చూపానని, కానీ వైసీపీ నాయకత్వంతో ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేసారు.

Read Also: మరో రెండు నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను ప్రకటించిన తెలుగుదేశం 

ఇంతలోనే కొన్ని ప్రసార మాధ్యమాల్లో JAC పేరిట నీతిబాహ్యమైన ఆరోపణలు చేసారని, అలాంటి చౌకబారు వ్యాఖ్యలను ఖండిస్తున్నానని స్పష్టం చేసారు. తాను రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసమే వచ్చానని పేర్కొన్న డొక్కా మాణిక్య వరప్రసాద్,తనపై అసత్య ప్రచారానికి, టీడీపీ అధిష్టాన వైఖరికి నిరసనగా, టీడీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని బహిరంగ లేఖలో తెలిపారు.

గతవారం పత్తిపాడుకి ఇంచార్జ్ గా మాకినేని పెద్ద రత్తయ్యను నియమించారు. దీనితో డొక్కా టీడీపీని వీడటం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. డొక్కా మీద టీడీపీలోని ఒక వర్గం గత కొంతకాలంగా దుష్ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ వైఖరిపై మనస్తాపం చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి