iDreamPost

అహ్మద్ పటేల్ ఇంట్లో తీగ లాగితే.. అమరావతిలో డొంక కదులుతోందా ??..

అహ్మద్ పటేల్ ఇంట్లో తీగ లాగితే.. అమరావతిలో డొంక కదులుతోందా ??..

ఆదాయ పన్ను శాఖ తాజాగా జారీచేసిన నోటీసులపై కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారి, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ముఖ్య రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ స్పందించారు. 550 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి తనకు నోటీసులు అందినట్టు ఆయన ధ్రువీకరించారు. పార్టీ తరపున ఆ డబ్బు స్వీకరించామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలతో బిజీగా ఉన్నానని త్వరలోనే ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై స్పందిస్తానని అహ్మద్ పటేల్ తెలిపారు. పార్లమెంటు సమావేశాల తర్వాత ఐటీ శాఖ ఎదుట హాజరవుతానని వెల్లడించారు.

కాగా గత అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు దేశవ్యాప్తంగా 42 చోట్ల జరిగిన ఐటీ శాఖ సోదాలు జరిపిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు, పుణెతో పాటు, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న అహ్మద్‌ పటేల్‌కు ఐటీ శాఖ సమన్లు జారీ చేసింది. అయితే అప్పటి నుంచి తనకు ఆరోగ్యం బాగోలేదని సాకులు చెబుతూ అహ్మద్‌ పటేల్‌ ఇంతవరకు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకాలేదు.

ఇదే సమయంలో గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి భారీమొత్తంలో నిధులు అందినట్టు ఐటి శాఖ గుర్తించింది.ఈ నిధులు ఎక్కడనుండి వచ్చాయనేదానిపై లోతుగా విచారం జరిపిన ఐటి శాఖ దీనికి కొనసాగింపుగా హైదరాబాద్‌, విజయవాడ, కడప, విశాఖలో రెండో విడత తనిఖీలు నిర్వహించింది. ఈక్రమంలోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాసరావు ఇంట్లో జరిపిన ఏడు రోజుల సోదాల్లో ఐటి అధికారులకు కొన్ని కీలకఆధారాలు లభించాయి. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ వద్ద స్వాధీనం చేసుకున్న వేలాది డాక్యుమెంట్లు, డైరీలు, వ్యక్తిగత పుస్తకంలో భారీ అక్రమ నగదు లావాదేవీలను ఐటీ శాఖ గుర్తించింది.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, ఏపీ నుంచి షుమారు 2వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఐటి అధికారులు గుర్తించారు. ఈ రెండువేల కోట్ల రూపాయలు వేర్వేరు మార్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి చేరినట్లు ప్రాధమికంగా గుర్తించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ కంపెనీకి భారీ కాంట్రాక్టు ఇచ్చారని 2652 కోట్ల రూపాయల విలువగల పనులకు సంబంధించిన ఆ కాంట్రాక్టు సంస్థ నుంచి 20 శాతం ముడుపులు పుచ్చుకునేలా ఒప్పందం జరిగిందని సమాచారం. ఈ ముడుపులకు సంబంధించి ఐటీ శాఖకు కీలక ఆధారాలు దొరికాయి.

ఆ సమాచారం ప్రకారం తీగ లాగితే డొంకంతా కదిలినట్టు కాంట్రాక్ట్ సంస్థ ఇచ్చినట్టు చెబుతున్న ఈ ముడుపుల్లో ఏపీ ప్రముఖుడికి 150 కోట్ల అందగా.. మిగిలిన 450 కోట్ల ముడుపులు పొలిటికల్‌ ఫండింగ్‌ కోసం మరో మార్గంలో కాంగ్రెస్ అధిష్టానానికి చేరినట్టుగా అధికారులు గుర్తించారు.ఈ క్రమంలోనే దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా ఉన్న అహ్మద్‌ పటేల్‌ కు ఐటీ శాఖ తాజాగా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారంపై ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌), ఎస్‌ఎఫ్‌ఐవో(సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌) కూడా రంగంలోకి దిగాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి