iDreamPost

ఆ బాధ్యతలు నాకొద్దు.. తేల్చి చెప్పిన శిద్దా!

ఆ బాధ్యతలు నాకొద్దు..  తేల్చి చెప్పిన శిద్దా!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు క్యూ కడుతున్నారు. లాభనష్టాలు, సమీకరణాలపై ఆలోచించిన పిదప పార్టీ మారుతున్నట్లు లీకులిస్తున్నారు. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే పార్టీ మారుతూ టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు రామసుబ్బారెడ్డి, కదిరి బాబురావు, ఎమ్మెల్యే కరణం బలరాం తదితర నేతలు పార్టీ మారగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి మారో నేత పేరు చేరుతుందన్న ప్రచారం గట్టిగా సాగుతోంది.

ప్రకాశం జిల్లా నేత, మాజీ మంత్రి, గత ఎన్నికల్లో టీడీపీ ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ గ్రానైట్‌ వ్యాపారి శిద్ధా రాఘవరావు వైఎస్సార్‌సీపీలో చేరుతారనే ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది. ఈ ప్రచారాన్ని ఆయన ఖండించలేదు. పైగా టీడీపీలో ఆయన సైలంట్‌గా ఉండడంతో ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది.

2014 ఎన్నికల్లో శిద్ధా రాఘవరావు ప్రకాశం జిల్లా దర్శి నుంచి పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు కేబినెట్‌లో రవాణాశాఖ మంత్రిగా ఐదేళ్లపాటు పని చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఒంగోలు లోక్‌సభకు పోటీ చేసి మాగుంట శ్రీనివాసుల రెడ్డి 2019 సాధారణ ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆఖరు నిమిషంలో మాగుంట ఇచ్చిన ట్వీస్ట్‌తో టీడీపీకి ఎంపీ అభ్యర్థి కరువయ్యారు.

మళ్లీ దర్శి నుంచి శాసన సభకు పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న శిద్ధా రాఘవరావును ఎంపీగా పోటీ చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దర్శి వదిలి ఎంపీగా పోటీ చేసేందుకు సుతారమూ రాఘవరావుకు ఇష్టం లేదు. అయినా తప్పని పరిస్థితుల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది ఆ ఎన్నికల్లో అటు ఎంపీ, ఇటు దర్శి ఎమ్మెల్యే స్థానాలు రెండింటినీ టీడీపీ చేజార్చుకుంది.

ఎన్నికల తర్వాత శిద్ధా రాఘవరావు టీడీపీలో పెద్దగా యాక్టివ్‌గా లేరు. దర్శి నుంచి పోటీ చేసుంటే తాను గెలిచి ఉండేవాడినన్న ఆలోచన ఆయనలో ఉండిపోయింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ శిద్ధా వాటికి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. దర్శి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలు తీసుకోవాలని టీడీపీ అధినేత స్వయంగా ఆదేశించినా శిద్ధా తిరస్కరించారు. ఈ కారణంతోనే శిద్ధా రాఘవరావు పార్టీ మారుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఈ అంశంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి