iDreamPost

సుజనాకు ఇంకా బీజేపీ నీళ్లు వంటబట్టలేదా..?

సుజనాకు ఇంకా బీజేపీ నీళ్లు వంటబట్టలేదా..?

పారిశ్రామికవేత్తగా ఉంటూ తెలుగుదేశం నుంచి రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసి.. ఆ పార్టీ నుంచి రెండు సార్లు రాజ్యసభకు నామినేట్‌ అయిన సుజనా చౌదరి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమితో బీజేపీ పంచన చేరారు. ఆయన బీజేపీలో చేరి ఏడాది అవుతోంది. అయినా ఇప్పటికీ బీజేపీ విధానాలు, పార్టీ సిద్ధాంతాలు, పనితీరు సుజనా చౌదరి వంటబట్టించుకోలేదా..? అనే సందేహం ఆయన ప్రవర్తిస్తున్న తీరును బట్టి రాజకీయాలను క్షణ్నంగా ఫాలో అయ్యే వారిలో కలుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని విషయంలో సుజనా చౌదరి వ్యవహరిస్తున్న తీరుతో ఆయన జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరినా.. ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశంలోనే ఇంకా ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని అర్థం అవుతోంది.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికై వైసీపీ సర్కార్‌ మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పెట్టినప్పటి నుంచీ ఈ అంశంపై బీజేపీ స్టాండ్‌కు భిన్నంగా సుజనా చౌదరి వ్యవహరిస్తున్నారు. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని, ఇందులో కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోబోదని బీజేపీ జాతీయ నేతలు పలుమార్లు స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయితే సుజనా చౌదరి మాత్రం అందుకు భిన్నంగా సరైన సమయంలో అమరావతి విషయంపై కేంద్రం జోక్యం చేసుకుంటుందని, మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకుంటుందని ప్రకటనలు చేస్తున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం తర్వాత తాజాగా నిన్న సుజనా చౌదరి పూర్వం చేసిన ప్రకటననే మళ్లీ వల్లించారు. అమరావతి విషయంలో కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని చెప్పుకొచ్చారు. అయితే నిన్న ఢిల్లీ వెళ్లి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి తర్వాత సోము వీర్రాజు ఈ విషయంపై స్పందించారు. బీజేపీ రాష్ట్ర శాఖ అమరావతిలో రైతులకు న్యాయం చేయాలనే స్టాండ్‌కు కట్టుబడి ఉన్నామని, అయితే రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని గతంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరశింహారావు చేసిన ప్రకటననే పునరుద్ఘాటించారు.

అంతేకాదు.. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాఖ.. తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలోనూ స్పష్టంగా పోస్టు పెట్టింది. ‘‘ బీజేపీ రాజ్యసభ సభ్యులు వైఎస్‌ చౌదరి చెప్పినట్లు రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది అనటం పార్టీ అభిప్రాయం కాదు. పార్టీ అభిప్రాయం అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో కొనసాగింపు అలాగే రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదు’’ అని తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. మరి ఇప్పటికైనా సుజనా చౌదరి తన పాతపాటను విడిచిపెట్టి.. బీజేపీ లైన్‌కు అనుగుణంగా రాజకీయాలు చేస్తారా..? లేదా పాత పంథాలోనే సాగుతారా..? అనేది ఆయన మరో ప్రెస్‌మీట్‌ పెడితేకానీ స్పష్టత రాదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి