iDreamPost

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్.. సాగర్ లో రిపీట్ అవుద్దా?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్.. సాగర్ లో రిపీట్ అవుద్దా?

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఏకంగా 128 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజైన మంగళవారం 58 మంది 105 సెట్ల నామినేషన్లు వేశారు. మొత్తంగా 77 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, బీజేపీ అభ్యర్థి రవి కుమార్ నాయక్ ఉన్నారు.

77 మంది అభ్యర్థుల్లో 17 మంది నామినేషన్లు తిరష్కరణకు గురయ్యాయి. ఇందులో బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జి నివేదితా రెడ్డితోపాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి సహా స్వతంత్రులు 15 మంది ఉన్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి జానా రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్, బీజేపీ అభ్యర్థి రవికుమార్‌ నాయక్‌లతో సహా వివిధ పార్టీలు, స్వతంత్రులు 60 మంది నామినేషన్లు అధికారులు ఆమోదించారు. 

నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తక్కువలో తక్కువ 50 మంది అభ్యర్థులు బరిలో నిలిచే చాన్స్ ఉంది. ఇంత మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. దీంతో ఇది అధికార పార్టీకి కలిసొస్తుందని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ రిపీట్ కావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read : సాగర్‌ బైపోల్‌ : నామినేషన్ల పరిశీలనలో ట్విస్ట్‌.. బీజేపీ నేతకు షాక్‌..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల చీలిక

ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గాలకు మార్చి రెండో వారంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నడూ లేనంతగా హైదరాబాద్ సీటులో 93 మంది, వరంగల్ సీటులో 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇంత మంది పోటీకి దిగడం వెనుక టీఆర్ఎస్ ప్లాన్ ఉందని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే ఇలా చేసిందని ఆరోపణలు వచ్చాయి.

అనుకున్నట్లుగానే ఓట్లు భారీగా చీలిపోయాయి. ఏ అభ్యర్థికీ 50 శాతం ఓట్లు రాలేదు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థులకు మాత్రం ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఎలిమినేషన్ ప్రాసెస్ తర్వాత ఎక్కువ ఓట్లు ఉన్నటీఆర్ఎస్ అభ్యర్థలను ఎన్నికల అధికారులు విజేతలుగా ప్రకటించారు. అలా ఓట్ల చీలిక టీఆర్ఎస్ కు కలిసి వచ్చింది. ఈ సారి కూడా అదే వ్యూహంతో ఎక్కువ మందితో టీఆర్ఎస్ నామినేషన్లు వేయించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Also Read : సాగర్ బరిలో డాక్టర్.. బీజేపీ ప్రయోగం ఫలిస్తుందా..?

ముగ్గురు అభ్యర్థులు.. మూడు సామాజిక వర్గాలు

ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల అభ్యర్థులు మూడు వేర్వేరు కులాలకు చెందిన వాళ్లు. వేముల భగత్ ది యాదవ కమ్యూనిటీ కాగా, జానారెడ్డిది రెడ్డి సామాజిక వర్గం, రవికుమార్ ది లంబాడా కమ్యూనిటీ.

సాగర్ లో 2.2 లక్షలకు పైగా ఓట్లు ఉండగా.. ఈ మూడు సామాజిక వర్గాల ఓట్లే లక్ష దాకా ఉంటాయి. యాదవ ఓటర్లు 37 వేలు, లంబాడాలు 35 వేలు, రెడ్లు 24 వేల మంది దాకా ఉండొచ్చని అంచనా. దీంతో ఈ ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేయనున్నాయి. మరోవైపు గౌడలు 12 వేల మంది, ముదిరాజ్ లు 9 వేల మంది, మాలలు 8 వేల మంది దాకా ఉన్నట్లు సమాచారం. ఈ ఓట్లు కూడా కీలకం కానున్నాయి. అయితే అభ్యర్థుల సంఖ్య పెరిగే కొద్దీ ఈ ఓట్లు భారీగా చీలిపోయే చాన్స్ ఉంది. గెలిచిన అభ్యర్థికి కూడా పెద్దగా మెజారిటీ ఉండకపోవచ్చు.

Also Read : 80వ దశకం రాజకీయాలు చేద్దామంటున్న జానారెడ్డి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి