iDreamPost

80వ దశకం రాజకీయాలు చేద్దామంటున్న జానారెడ్డి

80వ దశకం రాజకీయాలు చేద్దామంటున్న జానారెడ్డి

ఎన్నికలంటే ఓ కోలాహలం. నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచీ నామినేషన్‌ దాఖలు, ప్రచారం, పోలింగ్, ఫలితాలు.. ఇలా ప్రతి దశలోనూ ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. ఎన్నికలు జరుగుతున్నాయంటే.. పోటీ చేసే అభ్యర్థులే కాదు.. ఆయా పార్టీల కార్యకర్తలు, నేతలకు చేతి నిండా పని. ఆ నియోజకవర్గ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. ప్రజలు కూడా ఎన్నికల ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొంటారు. అయితే.. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానా రెడ్డి.. సరికొత్త ప్రతిపాదన చేస్తున్నారు. అసలు ప్రచారమే వద్దంటున్నారు జానా రెడ్డి.

మొన్న.. అందరం నామినేషన్లు వేసి ఇంట్లోనో, పార్టీ ఆఫీసులోనో కూర్చుందాం. ఓట్లు ఎవరికి వేయాలో ప్రజలకు వదిలేద్దామని జానా రెడ్డి అన్నారు. తాను గాంధీ భవన్‌లో, టీఆర్‌ఎస్‌ వాళ్లు ప్రగతి భవన్‌లో, బీజేపీ నేతలు వారి పార్టీ ఆఫీసులో కూర్చుందాం.. ఎవరు గెలుస్తారో చూద్దామా..? అంటూ సవాళ్లు విసిరారు. తాజాగా ఈ రోజు నామినేషన్‌ దాఖలు చేసిన జానా రెడ్డి మరో సరికొత్త ప్రతిపాదన పెట్టారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దు, ప్రజలను మభ్యపెట్టవద్దంటున్న జానా రెడ్డి.. ఆరోగ్యకరమైన ప్రజా స్వామ్యానికి పునాది వేసేలా.. కేవలం కర పత్రాల ద్వారా ప్రచారం చేద్దామని టీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఒకరిపై ఒకరు పరుషపదజాలం వాడకుండా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా.. దుష్ప్రచారం చేయకుండా.. ఓటర్లను కరపత్రాలతో కలుద్దామని ప్రతిపాదించారు జానా రెడ్డి. కరపత్రాలు ఇచ్చి.. వారి అభీష్టం మేరకు ఓటు వేయాలని కోరుదామని, ప్రజల అభీష్టం మేరకు పట్టం కట్టేలా దేశానికే ఓ రోల్‌ మోడల్‌గా సాగర్‌ ఉప ఎన్నికను నిలుపుదామని ఈ సీనియర్‌ నేత ప్రతిపాదించారు.

Also Read : చింతా మోహన్‌ చిలక జోస్యం… చింత చచ్చినా పులుపు చావలేదు                                                                                       

జానా రెడ్డి ప్రతిపాదన బాగానే ఉన్నా.. ఇది ఇప్పటి రాజకీయాల్లో సాధ్యం కాదు. 70, 80 దశకాల్లోని రాజకీయాలను 21వ శతాబ్దంలో చేయాలని జానా రెడ్డి చెబితే.. వినేవారు ఎవరూ ఉండరు. పైగా ఇలాంటి ప్రతిపాదన వింటే నవ్వుకుంటారు. నష్టం కూడా జరుగుతుంది. ఓట్లు అడిగేందుకు అవకాశం లేక ఇలాంటి ప్రతిపాదనలు చేస్తున్నారంటూ ప్రత్యర్థులు విమర్శలు చేస్తారు.

ఇలా జానా ప్రతిపాదించారో లేదో.. అలా మంత్రి జగదీష్‌ రెడ్డి అందుకున్నారు. 35 ఏళ్లు సాగర్‌ను ఏలిన పెద్దమనిషి.. ప్రజలకు సాగు, తాగు నీళ్లు ఇవ్వలేదని, ఇప్పుడు ప్రజల ముందుకు వెళితే నిలదీస్తారనే ఇలాంటి ప్రతిపాదన చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. జానా రెడ్డి ప్రతిపాదనే అర్థరహితమని కొట్టిపారేశారు.

ఎన్నికల ప్రచారాల్లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాటల తూటాలు ఎలా ఉంటాయో తెలిసిందే. ఇక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ దూకుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నికల్లో చూశాం. ఇలాంటి దూకుడు నేతలను సౌమ్యుడైన జానా రెడ్డి ఎలా ఎదుర్కొంటారో, వారి చేసే విమర్శలకు ఎలా ధీటుగా సమాధానం చెబుతారో వేచి చూడాలి. గెలుపు గుర్రంగా భావిస్తున్న జానా రెడ్డికి ఎన్నికల ప్రచారంలో అసలైన పరీక్ష ఎదురుకాబోతోందనేది నిస్సందేహం.

Also Read : సాగర్ బరిలో డాక్టర్.. బీజేపీ ప్రయోగం ఫలిస్తుందా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి