iDreamPost

రైతు ఉద్యమం కొలిక్కి రానుందా..?

రైతు ఉద్యమం కొలిక్కి రానుందా..?

రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. గడ్డ కట్టే చలిని సైతం లెక్కచేయక రోజూ వందల మంది వచ్చి ఉద్యమంలో చేరుతున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు కూడా వచ్చి ఆందోళనలో పాల్గొంటున్నారు. ఢిల్లీ శివార్లలో టెంట్లు వేసుకుని రైతులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. మరోవైపు రైతు ఉద్యమానికి రాజకీయ, ప్రజా సంఘాల మద్దతు కూడా రోజురోజుకూ పెరుగుతోంది. చట్టాల రద్దు నిమిత్తం పార్లమెంట్‌ను అత్యవసరంగా సమావేశపరచాలని శిరోమణి అకాలీదళ్‌ డిమాండ్‌ చేసింది. ఇంకా తాత్సారం చేస్తే ఆందోళన చేయిదాటిపోతుందని ఎస్‌ఏడీ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ అన్నారు. అటు కేరళలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం రైతుల ఆందోళనకు పూర్తి సంఘీభావం ప్రకటించింది. చట్టాల రద్దు నిమిత్తం రాష్ట్ర అసెంబ్లీ బుధవారంనాడు ప్రత్యేకంగా సమావేశమవుతోంది… ఆమేరకు ఓ తీర్మానాన్ని ఆమోదిస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ కొద్ది రోజుల కిందట ఇదే తీర్మానం చేసింది. గడిచిన 25 రోజులుగా నిరస హోరు కొనసాగిస్తున్న రైతులకు కేంద్రం మరోసారి వర్తమానం పంపింది. చర్చలకు వెళ్లాలా..? వద్దా..? అని రైతులు నేడు నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రభుత్వం లేఖపై రైతు సంఘాల భేటీ..

డిసెంబరు 9వ తేదీన తాము సూచించిన సవరణలపై అభ్యంతరాలతో పాటు రైతులు ఏఏ అంశాల్లో ఆందోళన చెందుతున్నారో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, చర్చలకు ఎపుడు వచ్చేదీ తేదీ చెప్పమని కోరుతూ వ్యవసాయ శాఖ కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌ ఓ లేఖ పంపారు. ఆదివారం రాత్రే ఇది వచ్చినా రైతులు దీనిని వెంటనే పట్టించుకోలేదు. ఇందులో కొత్త విషయమేమీ లేదని, అయినప్పటికీ 40 యూనియన్ల నాయకులూ సమావేశమై దీనిని చర్చిస్తారని, భవిష్యత్‌ కార్యాచరణను కూడా నిర్ణయిస్తారని క్రాంతికారీ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు గుర్మీత్‌ సింగ్‌ చెప్పారు. కేంద్రం ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించడంపై రైతు సంఘం నేత కుల్వంత్‌ సింగ్‌ సంధు తాజాగా స్పందించారు. బుధవారం అన్ని రైతు సంఘాల నేతలూ సమావేశమై ప్రభుత్వ లేఖపై చర్చిస్తామన్నారు. చర్చలకు వెళ్లాలా? లేదా? అనేది ఈ భేటీలో నిర్ణయిస్తామన్నారు. నేడు భేటీ జరిగే చర్చలు ఎప్పుడు జరుగుతాయనేది స్పష్టత రానుంది. ఇప్పటికే 5 సార్లు చర్చలు జరిగాయి. మరోసారి చర్చల్లో రైతు సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశాలు ఉన్నాయని కొందరు భావిస్తున్నారు. మరోపక్క- రైతులు సోమవారంనాడు అన్ని నిరసన కేంద్రాల వద్ద రిలే నిరాహార దీక్షలు మొదలెట్టారు. 11 మంది ఒక్కొక్క బ్యాచ్‌ చొప్పున వారు దీక్షకు కూర్చున్నారు. ఇవి వచ్చే మూడు రోజులూ కొనసాగుతాయన్నారు. బిహార్‌ రైతు సంఘాలను కూడా ఆందోళన చేస్తున్న యూనియన్ల ఐక్యవేదిక -సంయుక్త కిసాన్‌ మోర్చా సంప్రదించాయి. వెంటనే తమ నిరసనలో పాల్గొనవలసిందిగా కోరాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి