iDreamPost

ఇరిగేషన్ పై మాట్లాడే హక్కు దేవినేని ఉమాకు ఉందా?

ఇరిగేషన్ పై మాట్లాడే హక్కు దేవినేని ఉమాకు ఉందా?

మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో తమ ప్రభుత్వం 73 వేల కోట్ల రూపాయలు సాగు నీటి ప్రాజెక్టుల మీద ఖర్చు చేసింది అంటూ ఒక కొత్త వాదనను పైకి తీసుకొచ్చే ప్రయత్నం మొదలు పెట్టారు. నిజంగా ఖర్చు పెట్టిన ఆ 73 వేల కోట్ల రూపాయలతో ఎన్ని ప్రాజెక్టులు మొదలు పెట్టి ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసారో మాత్రం చెప్పడం లేదు. తెలుగుదేశం పాలనా చరిత్ర చూస్తే చంద్ర బాబు నాయుడు అధికారంలో వున్న 14 సంవత్సరాలలో కనీసం ఒక ప్రాజెక్టును కూడా ప్రారంభించి పూర్తి చేసిన దాఖలాలు లేకపొయినా ఈ మధ్య ఆర్థిక లోటుతో అధికారంలోకి వచ్చి చెట్టు కింద నుండి పరిపాలన చేస్తూ కూడా సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాము అని చెప్పుకుంటున్నారు. చెట్టుకిందకు ఎలా వచ్చాము అనేది ఎందుకు చెప్పరు? ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల పాటు హైదరాబాదు మీద మనకు హక్కు వున్నా కూడా ఓటుకు నోటు కేసు ఫలితంగా హైదరాబాద్ నుండి విజయవాడకు బలవంతంగా రావాల్సి వచ్చిందన్న విషయం జగమెరిగిన సత్యం, మరి ఆ పాపం చంద్రబాబుది కాదా ?

గత పాలనలో తెలుగుదేశం నాయకులు పట్టపగలే అవినీతికి పాల్పడే విధంగా ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టుల అంచనా వ్యయాలను పెంచి వేల కోట్లు దోచుకున్నారు తప్ప దేవినేని ఉమా ఖర్చు చేసాము అని చెప్తున్న 73 వేల కోట్లలో ప్రజలకు ఉపయోగపడింది శూన్యం. అలాగే పోలవరంను తామేదో వేగంగా నిర్మించామని, ఒక్క రోజులో ఎక్కువ మొత్తంలో కాంక్రీట్ వేసినందుకు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కాము అని ప్రగల్బాలు పలుకుతున్నారు కానీ, ఇదే పోలవరం పనులు 2017 చివరి వరకు మొదలు పెట్టలేదనే వాస్తవాన్ని మాత్రం చెప్పరు. నిజానికి పనులు ముందుకు సాగలేదు అనే కారణం చూపే అప్పటివరకు ఉన్న ట్రాన్స్ ట్రాయ్ కంపెనీని తొలగించి చంద్రబాబుకు అత్త్యంత సన్నిహితులైన నవయుగకు పోలవరం కాంట్రాక్ట్ అప్పగించారు అంటే దీని అర్ధం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల వరకు పోలవరంను పట్టించుకోలేదనే మాట వినిపిస్తుంది. ప్రజలు ఐదేళ్లు అధికారం ఇస్తే ఆ ఐదేళ్లలో పోలవరం నిర్మాణం చెయ్యకుండా పోలవరం ను పక్కన పెట్టి చివరి సంవత్సరంలోని చివరి దశలో ఒక రోజు కాంక్రీట్ పోసి ఇదే పోలవరం గిన్నిస్ రికార్డ్స్ కు ఎక్కింది అని చెవ్ప్పుకోవటం తెలుగుదేశానికే చెల్లింది. ఒక్క రోజులో గిన్నిస్ బుక్ రికార్డుకు ఎక్కే అంత పని చేసాము అని చెప్పుకొనే తెలుగుదేశం ప్రచార సారధులని, అయిదు సంవత్సరాలలో పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారు అంటే సమాధానం దొరకదు.

గత ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా పని చేసిన ఉమా గారికి రివర్స్ పంపింగ్ గురించి కూడా తెలియకపోవడం ఇరిగేషన్ పై ఆయన లో ఉన్న అనాసక్తిని బయటపెట్టినట్టు అయింది. నిజానికి రివర్స్ పంపింగ్ చరిత్ర చూస్తే , నాగార్జున సాగర్ డ్యామ్ లో 30 సంవత్సరాల ముందు ఏర్పాటు చేసిన మిషన్స్ తో ఇప్పుడు రివర్స్ పంపింగ్ చేస్తున్నారు, పక్కన వున్న శ్రీ రామ్ సాగర్ ప్రాజక్టులో అటు పక్కన వున్న కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా రివర్స్ పంపింగ్ చేస్తున్నారు, ఉత్తరాఖండ్ లో మధ్యప్రదేశ్ లో కూడా రివర్స్ పంపింగ్ ప్రయత్నాలు జరిగాయి, ఇన్నేళ్లు ఇరిగేషన్ మంత్రి గా వున్నా ఉమాకు ఈ ప్రాథమిక అంశాలు కూడా తెలియకపోవటం నిజంగా శోచనీయం.

అసలు రివర్స్ పంపింగ్ అంటే ?

డ్యామ్ లోని నీరు విద్యుత్ ఉత్పత్తికి గాను టర్బైన్స్ లో నుండి వెళ్లి కింద టైల్ పాండ్ లో కలిసిపోతాయి. అలా కలిసిన నీటిని అవే టర్బైన్స్ ద్వారా టైల్ పాండ్ లో నుండి మళ్ళీ డ్యామ్ లోకి పంప్ చేస్తారు. అలా పంపిన నీటిని మళ్ళీ విద్యుత్ ఉత్పత్తికి వాడుకోవచ్చు. ఇలా రివర్స్ పంప్ చెయ్యడం వల్ల అటు నీటిని ఆదా చెయ్యచ్చు ఇటు ఎక్కువ కరెంటును ఉత్పత్తిని చెయ్యొచ్చు. సాగర్ డ్యామ్ లో గత సంవత్సరం జనవరి 18 నుండి మార్చ్ 24 వరకు కేవలం రెండు నెలల కాలంలో 7 టిఎంసి నీటిని రివర్స్ పంపింగ్ చేసి దాదాపు 95 కోట్లు ఆదా చేశారు. సాధారణంగా యూనిట్ ధర తక్కువ వుండే రాత్రి వేళల్లో రివర్స్ పంపింగ్ చేసి యూనిట్ ధర అధికంగా వుండే టైం లో ఆ నీటిని విద్యుత్ ఉత్పత్తికి వాడుకోవడం వలన దాదాపు యూనిట్ మీద 8 రూపాయలు ఆదా చెయ్యొచ్చు.

ఇక పట్టీసీమ గురించి ఉమా గారు మాట్లాడం చూస్తే తెలుగుదేశం మోసపూరిత విధానం మరో సారి బయట పడుతుంది. పట్టిసీమను చంద్రబాబు ఒక పెద్ద ప్రాజెక్టుగా చూపే ప్రయత్నం మొదటి నుండీ చేస్తూనే వచ్చారు. కానీ నిజానికి చంద్ర బాబు కేవలం పట్టిసీమకు మోటార్లు మాత్రమే బిగించారు తప్ప ప్రాజెక్టు కట్టలేదు. రాజశేఖర్ రెడ్డి కట్టిన పోలవరం కుడి కాలువకు మోటార్లు బిగించి వేల కోట్లు దోచుకొని ఇదే పట్టిసీమ, మేమె కట్టామని ప్రజలను సైతం మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. రాయలసీమకు నీళ్లు పట్టిసీమ ద్వారా ఇచ్చాము అని చెప్పుకోచ్చారు. పట్టిసీమతో రాయలసీమకు నీళ్లు ఇచ్చేసాము పులివెందులకు తీసుకెళ్ళామనే తెలుగుదేశం ప్రచారం ప్రజలు నమ్మలేదు, పట్టిసీమ ద్వారానో ఇంకో ద్వారానో రాయలసీమకు కనీసం చుక్క నీరు అయినా ఇవ్వాలి అంటూ అయిదేళ్ల కాలంలో ఒక్క జీవో కూడా ఇచ్చిన దాకలాలు లేవు ? వీటి ఫలితంగానే గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం ఎప్పుడు చూడనంత దారుణమైన ఫలితాలు చూసింది అనేది నిర్వివాదాంశం.

నిజానికి తెలుగుదేశం పార్టీకి రాయలసీమ గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది? రాజశేఖర్ రెడ్డి రాయలసీమకు నీళ్లు ఇస్తుంటే, ఆ నీటిని ఆపాలంటూ పోతిరెడ్డి పాడు వరకు పాదయాత్ర చేసి రాయలసీమ ద్రోహిగా ఆనాడు ముద్ర పడ్డ దేవినేని ఉమాకు నిజంగా రాయల సీమ పేరు ఉచ్చరించే హక్కైనా ఉందా అని రాయలసీమ ప్రజల సూటి ప్రశ్నకు ఉమా చెప్పే సమాధానం ఎంటి? జలయజ్ఞం ధనయజ్ఞం అని మాట్లాడే ముందు రాజశేఖర్ రెడ్డి ఐదేళ్లలో పోలవరం కు పెట్టిన ఖర్చు ఎంత? చేసిన పనులు ఏంటి అలాగే తెలుగుదేశం చేసిన పనులు ఏంటి ? పెట్టిన ఖర్చు ఎంత అనే లెక్కలు ఎందుకు చెప్పరు ? నిజానికి అలాగే తెలుగుదేశం అధికారంలోకి వచ్చాకా గడిచిన 5ఏళ్ళలో పెట్టిన ఖర్చు ఎంత చేసిన పనులు ఏంటి అనేది చూసుకుంటే తెలుగుదేశం చేసిన మోసం పోలవరం పేరున ప్రజలను ఎంత వంచించిదో అర్ధం కాకుకుండా పోతుందా? వీటికి ఉమానే సమాధానం చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి