iDreamPost

బాబు బస్సు యాత్ర అర్ధాంతరంగా విరమించుకున్నట్లేనా..?

బాబు బస్సు యాత్ర అర్ధాంతరంగా విరమించుకున్నట్లేనా..?

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో తెలిపేందుకంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరంభించాలనుకున్న ప్రజా చైతన్య బస్సు యాత్ర లేనట్టేనా..? చంద్రబాబు తన బస్సు యాత్రను విరమించుకున్నట్లేనా..? అంటే విశ్లేషకుల నుంచి అవుననే సమాధానాలు వస్తున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 45 రోజుల పాటు ఈ బస్సు యాత్ర చేపట్టాలని చంద్రబాబు భావించినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు సానుకూలంగా లేకపోవడం వల్ల బస్సు యాత్రకు ఆదిలోనే ముగింపు పలికారని పరిశీలకులు చెబుతున్నారు. సానుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నారంటున్నారు.

చంద్రబాబు ప్రజాచైతన్య బస్సు యాత్ర ప్రకాశం జిల్లా నుంచి ప్రారంభమైంది. మార్టురు పట్టణంలో ప్రారంభమైన చంద్రబాబు యాత్ర.. ఒంగోలుకు చేరుకుంది. ఆ తర్వాత ఆయన కొండపి నియోజకవర్గం టంగుటూరు, సింగరాయ కొండ మీదుగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి కావాలి పట్టణం వద్ద ప్రవేశించాలి. నెల్లూరు జిల్లా తర్వాత ఆయన చిత్తూరు జిల్లా తిరుపతి లేదా వైఎస్సార్‌ కడప జిల్లాలోకి ప్రవేశించాలి. కానీ అవేమీ లేకుండానే కొద్ది రోజుల విరామం తర్వాత నేరుగా చిత్తూరు జిల్లాలోని తన స్వంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు ప్రత్యక్షమయ్యారు. నిన్న సోమవారం నుంచి నేడు మంగళవారం వరకు ఆయన కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ ఘనటతోనే చంద్రబాబు తన బస్సు యాత్రకు ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

45 రోజులు రాష్ట్రమంతా బస్సు యాత్ర చేయాలనుకున్న చంద్రబాబుకు తమ్ముళ్ల నుంచి ఆశించన మద్ధతు రావడంలేదట. అందుకే బస్సు యాత్రకు విరామాలు తీసుకుంటూ.. ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆ నియోజకవర్గానికి వెళుతున్నారట. ఒంగోలు తర్వాత నెల్లూరు జిల్లా నేతలు ముందుకు రాలేదని టాక్‌ నడుస్తోంది. ఎన్నికలు ముగిసి 9 నెలలు కాకముందే మళ్లీ ఆర్థికంగా ఖర్చు, జనసమీకరణ అంటే తమ వల్ల కాదని తమ్ముళ్లు చేతులెత్తేశారట. ఒంగోలు నుంచి వెనక్కి వెళదామనుకుంటే.. గుంటూరు, కృష్ణాలను మినహాయించి.. పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లాలి. అక్కడ నుంచి తూర్పు గోదావరి జిల్లాకు చేరుకోవాలి. ఇటీవల అమరావతి ఉద్యమం పేరుతో.. పశ్చిమ గోదావరి మీదుగా రాజమహేంద్రవరం వరకు కార్యక్రమం నిర్వహించారు. జోలె పట్టుకుని అమరావతి ఉద్యమానికి విరాళాలు సేకరించారు. మళ్లీ రోజుల వ్యవధిలోనే పర్యటన అంటే.. సమీకరణ. ఆర్థిక ఖర్చు తమకు తలకుమించిన భారమవుతుందని గోదావరి తమ్ముళ్లు కూడా చడీడప్పుడు లేకుండా ఉన్నారట.

చివరకు సొంత జిల్లా చిత్తూరులో కూడా తమ్ముళ్ల నుంచి మద్ధతు కరువైందట. ఇక చేసేదేమీ లేక.. తన సొంత నియోజకవర్గాన్నే చంద్రబాబు ఎంపిక చేసుకుని ప్రజలను చైతన్య పరుస్తున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నా,రు. అందులో భాగంగానే నిన్న, ఈ రోజు కుప్పంలో పర్యటిస్తున్నారు. 45 రోజుల పాటు రూపొందించుకున్న బస్సు యాత్ర ప్రణాళిక విఫలం కావడంతో సానుకూలంగా ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర చేస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి