iDreamPost

అయ్యప్ప స్వాములు నల్లటి వస్త్రాలు ఎందుకు ధరిస్తారో తెలుసా?.. అసలు కారణం ఇదే?

కార్తీకమాసంలో అయ్యప్ప స్వామి భక్తులు దీక్షను చేపడుతుంటారు. మాలధారణ చేసిన భక్తులు నలుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరిస్తారు. నలుపు రంగు దుస్తులు ధరించడం వెనక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా?

కార్తీకమాసంలో అయ్యప్ప స్వామి భక్తులు దీక్షను చేపడుతుంటారు. మాలధారణ చేసిన భక్తులు నలుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరిస్తారు. నలుపు రంగు దుస్తులు ధరించడం వెనక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా?

అయ్యప్ప స్వాములు నల్లటి వస్త్రాలు ఎందుకు ధరిస్తారో తెలుసా?.. అసలు కారణం ఇదే?

హరిహర సుతుడిగా, మణికంఠుడిగా కొలువు దీరిన అయ్యప్ప స్వామి భక్తుల పాలిట కొంగు బంగారమయ్యారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చుతూ ఇల దైవంగా వెలుగొందుతున్నారు అయ్యప్ప స్వామి. శబరిమలైలో కొలువుదీరిన అయ్యప్ప అశేషమైన భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్పను ఇష్ట దైవంగా కొలిచే భక్తులు ఎక్కువగా ఉంటారు. ప్రతి ఏటా కార్తీక మాసం ప్రారంభమవ్వగానే అయ్యప్ప దీక్షలు ప్రారంభమవుతాయి. ఎంతో నిష్టతో, భక్తి శ్రద్దలతో దీక్షను చేపడతారు. ఆరోగ్యాలు బాగుండాలని, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, తమ కష్టాలను తీర్చాలని భక్తులు అయ్యప్ప మాలను ధరిస్తారు. అంతే కాకుండా ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్న వారు, ప్రశాంతమైన జీవితం కోసం అయ్యప్ప దీక్షను చేపడతారు. స్వాములు మాలధారణ చేసిన నాటి నుంచి 41 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి కట్టుకుని అయ్యప్పను ఎంతో నిష్టతో పూజిస్తారు.

మాల ధరించిన నాటి నుంచి చన్నీటి స్నానం, కటిక నేలపై నిద్రించడం, మిత భోజనం, నిత్యం అయ్యప్ప నామ స్మరణతో భక్తి పారవశ్యంలో మునిగి తేలుతుంటారు. దీక్ష కాలం పూర్తైన తర్వాత అయ్యప్ప స్వాములు శబరిమల అయ్యప్ప సన్నిధానానికి  చేరుకుంటారు. మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం చేసుకుని దీక్షను విరమిస్తారు. అయితే దీక్ష సమయంలో అయ్యప్ప స్వాములు నలుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరిస్తారు. స్వాములు నల్లటి దుస్తులను మాత్రమే ధరించడం వెనుక పలు శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి.

ఆధ్యాత్మిక కారణాలు

ఆధ్యాత్మిక కారణాలు పరిశీలిస్తే.. అయ్యప్ప స్వామి శనీశ్వరుడికి ఒక మాట ఇస్తాడు. మీరు ఏలినాటి శని గురించి వినే ఉంటారు. ఏలినాటి శని అంటే ఏడు సంవత్సరాలు శని ఉంటుందని చెబుతారు. శనీశ్వరుడు మనుషులను ఏడు సంవత్సరాలు పట్టి పీడిస్తాడు.  ఎందుకు మనుషులను పట్టి పీడుస్తున్నావని అయ్యప్ప శనీశ్వరుడిని అడుగుతాడు. నరులు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు కాబట్టి తాను పీడిస్తున్నా అని.. అది నా ధర్మం అని శనీశ్వరుడు చెబుతాడు. దానికి అయ్యప్ప స్వామి ధర్మం అంటే పడపీడనం కాకూడదని అంటాడు. ఏడేళ్ల పీడనలో అనుభవించు కష్టాలన్నీ.. సంవత్సరానికి మండల కాలంలో తన భక్తులు అనుభవిస్తారని అయ్యప్ప చెబుతాడు. 40 దినాల్లో ఎన్ని కష్టాలు అనుభవించగలరు అని శనీశ్వరుడు అయ్యప్పతో అంటాడు. మధురసాలతో, మత్తు పానీయాలతో రుచిగా భుజించే వారి జిహ్వపై దెబ్బ తీస్తానని.. వారంతా భుక్తి లేక అలమటిస్తారని శనీశ్వరుడు అంటాడు. అంటే అప్పటి వరకూ మాంసం, మసాలా ఆహరం తిన్నవారికి రుచి అనేది తెలియనివ్వకుండా చేస్తా అని అంటాడు. దానికి అయ్యప్ప.. తన భక్తులు సాత్విక ఆహారంతో ఏకభుక్తం చేస్తారని మాట ఇస్తాడు. అందుకే అయ్యప్ప స్వాములు ఉల్లిపాయ కూడా తినరు.

పూలపాన్పులపై నిద్రించిన  వారినైనా సరే కట్టెల పాన్పు వరకూ కదిలేలా చేస్తానని శనీశ్వరుడు చెబుతాడు. తన భక్తులు సుఖాలు విడిచి కటిక నేల మీద నిద్రిస్తారని అయ్యప్ప అంటాడు. పన్నీటి జలకాలు ఆడే వారిని గజగజ వణికిస్తానని శనీశ్వరుడు అంటే.. ఉదయం, సాయంత్రం నా భక్తులు పన్నీటి స్నానం బదులు చన్నీటి స్నానం చేస్తారని అయ్యప్ప చెబుతాడు. కట్టుకోవడానికి సరైన బట్ట లేక, నకకేశ సంస్కారాలు, పాదరక్షలు లేక తనని తానుగా చెప్పుకోలేని దుస్థితిలో సిగ్గుపడి.. రూపు చెడి హీనంగా, దీనంగా పరిభ్రమించేలా చేస్తా అని శనీశ్వరుడు అంటాడు. అంతేకాదు తన చూపు సోకి అనురక్తులైన దంపతులు విరక్తులవుతారని అంటాడు. నకకేశ సంస్కారాలు అంటే జుట్టు, గడ్డం కట్టించుకోకుండా అలానే 40 రోజులు ఉండడం. జుట్టు, గడ్డం పెరిగిపోతే మనిషిని గుర్తుపట్టడం కష్టం కదా. అందుకే శనీశ్వరుడు అలా చెబుతాడు.

శనీశ్వరుడి మాటలకు.. అయ్యప్ప ఇలా అంటాడు. నీకిష్టమైన రంగు నలుపు కాబట్టి నల్లని దుస్తులు ధరించి.. నకకేశ సంస్కారాలు మానేస్తారు. కఠోరమైన బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంభిస్తారు. పాదరక్షలు విడిచి.. స్వామియే శరణం అయ్యప్ప అని శరణు ఘోష చేస్తూ అడవుల వెంబడి పాదచారులై తన దర్శనార్థం వస్తారు. అటువంటి భక్తులను పట్టి పీడించకూడదని.. శుభం చేకూర్చాలని అయ్యప్ప స్వామి శనీశ్వరుడికి ఆజ్ఞ వేస్తాడు. అలా శనీశ్వరుడి విధించే ఏలినాటి కష్టాలన్నీ 40 రోజుల అయ్యప్ప దీక్షలో ఉంటాయని.. ఆ విధంగా శనీశ్వరుడి వృత్తి ధర్మానికి భంగం కలగకుండా చేస్తాడు అయ్యప్ప స్వామి.

శాస్త్రీయ కారణాలు

ఇక శాస్త్రీయ కోణంలో ఆలోచిస్తే.. పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయ్యప్ప దీక్షను చేపట్టిన నాటి నుంచి స్వాములు తెల్లవారుజామున నిద్ర లేచి చన్నీటితో స్నానం చేస్తారు. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరం, మనస్సు తేలికపడి ఏకాగ్రత పెరుగుతుంది. అయ్యప్ప స్వాములు మిత భోజనం చేస్తారు కాబట్టి జీర్ణక్రియ సంబంధిత సమస్యలు దరిచేరవు. ఆకుకూరలు, కూరగాయలతో కూడిన వంటకాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయ్యప్ప స్వాములు పాదరక్షలు లేకుండా నేలపై నడుస్తారు. దీని వల్ల రక్త ప్రసరణ రేటు పెరుగుతుంది. అంతేకాకుండా దీక్ష చేపట్టిన వారు కటిక నేలపై నిద్రించడం వల్ల వెన్ను నొప్పులు దరిచేరవు.  సృష్టిలో జరిగే శక్తి మార్పిడి వల్ల భూమి నుంచి శక్తి లభిస్తుందని సైంటిస్టులు చెబుతారు. నుదుటన విభూతి పెట్టుకోవడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

విభూతిని ఆవుపేడతో తయారు చేయడం వల్ల ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీన్ని ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. తలనొప్పి, జబ్బు, చర్మ సంబంధిత అలర్జీల నుంచి రక్షిస్తుంది. గాయాలు నయం కావడానికి విభూతి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే.. దిష్టి తగలకుండా ఉండడానికి విభూతి పెట్టుకుంటారు. ఆధ్యాత్మిక భావనతో మాల వేసుకున్నప్పటికీ సైంటిఫిక్ గా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. దీక్ష చేపట్టిన నాటి నుంచి అయ్యప్ప స్వాముల దినచర్య సిస్టమాటిక్ గా ఉంటుంది. కాబట్టి మెరుగైన ఆరోగ్యం కలుగుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

స్వాములు నల్లటి వస్త్రాలను ఎందుకు ధరిస్తారంటే?

అయ్యప్ప స్వాములు నలుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరిస్తారు. ఎందుకంటే.. చలికాలంలోనే అయ్యప్ప దీక్ష ప్రారంభమవుతుంది. దీక్షాసమయంలో చన్నీటి స్నానం చేస్తారు స్వాములు. ఈ సమయంలో నలుపు రంగు దుస్తులను ధరించడం వల్ల సూర్యరశ్మిని గ్రహించి(వేడిని) శరీరానికి చలి నుంచి రక్షణ కల్పిస్తుంటాయి. అదేవిధంగా అయ్యప్ప దర్శనానికి వెళ్లినప్పుడు అడవుల్లో పాదయాత్ర చేస్తున్న సమయంలో అటవీ జంతువుల నుంచి రక్షణ పొందేందుకు స్వాములు మాలను ధరిస్తారు. అంతేకాకుండా శని దేవుడి అనుగ్రహం కోసం కూడా నలుపు రంగు దుస్తులను ధరిస్తుంటారు. మాలధారణ చేసిన భక్తులు నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే అయ్యప్ప కాపాడుతాడని పురాణాల్లో చెప్పినట్లు ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు. ఈ కారణాలతో అయ్యప్ప స్వాములు నలుపు రంగు వస్త్రాలను ధరిస్తారు.  మరి అయ్యప్ప మాలను ధరించడం వెనుక ఉన్న శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు… వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి