iDreamPost

భూ అంతర్భాగంలో నీటి నిల్వ ఎలా సాధ్యమో తెలుసా?

భూ ఉపరితలంపై నీటి నిల్వ ఎలా ఉంటుందో తెలిసిన విషయమే. కానీ భూ అంతర్భాగంలో నీటి నిల్వ ఎలా సాధ్యం. వాటర్ స్టోరేజ్ కు సాధ్యపడే అంశాలు ఏంటి? అసలు గ్రౌండ్ వాటర్ లేకపోతే జీవరాశి మనుగడ సాధ్యమా? ఆ వివరాలు మీకోసం..

భూ ఉపరితలంపై నీటి నిల్వ ఎలా ఉంటుందో తెలిసిన విషయమే. కానీ భూ అంతర్భాగంలో నీటి నిల్వ ఎలా సాధ్యం. వాటర్ స్టోరేజ్ కు సాధ్యపడే అంశాలు ఏంటి? అసలు గ్రౌండ్ వాటర్ లేకపోతే జీవరాశి మనుగడ సాధ్యమా? ఆ వివరాలు మీకోసం..

భూ అంతర్భాగంలో నీటి నిల్వ ఎలా సాధ్యమో తెలుసా?

సృష్టికి మూలాధారాలైన నీరు, నిప్పు, గాలి, భూమ్యాకాశాలను పంచభూతాలుగా చెప్పుకుంటాము. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా సకల జీవరాశులు తమ మనుగడను సాగించలేవు. పంచభూతాల్లో ఒకటైన నీరు సకల కోటి జీవ జాతులకు ప్రాణాధారం. సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలన్నింటిలో ఆవాసయోగ్యమైన గ్రహం ఏదైనా ఉందంటే అది భూ గ్రహం మాత్రమే. భూమిపైన మానవులతో పాటు సకల జీవులు జీవించడానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ భూమి యొక్క ఉపరితలం ఒక వంతు మాత్రమే భూమి, మూడొంతుల నీరు చేత ఆక్రమించబడింది. ఈ కారణంగానే భూమిని నీలి గ్రహం అనికూడా అంటారు.

అయితే భూ ఉపరితలంపై ఉన్న నీటిలో కేవలం మూడు శాతం మాత్రమే మంచి నీరు, మిగిలినదంతా సముద్రపు నీరు మాత్రమే. కాగా ఈ 3 శాతం ఉన్న మంచి నీటిలో 70 శాతం నీరు నదులు, సరస్సులు, మంచు పర్వతాల రూపంలో ఉండగా తక్కిన 30 శాతం నీరు భూ గర్భ జలాల రూపంలో నిల్వ ఉంది. మరి భూగర్భ జలాలు అని చెప్పుకుంటున్న నీరు ఎక్కడి నుంచి వచ్చింది. అసలు భూమిలోపల నీరు ఎలా నిల్వ ఉంటుంది? భూ అంతర్బాగంలో నీటి నిల్వ ఎలా సాధ్యం అని ఎప్పుడైనా ఆలోచించారా?

భూ గర్భ జలాల కారణంగానే తాగు, సాగుకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మానవులు తమ అవసరాలను తీర్చుకోగలుగుతున్నారు. భూమిపైన నీరు అనేది లేకపోతే భూతాపం పెరిగిపోయి మానవులతో పాటు వృక్ష, జంతు జాతులు నిర్జీవంగా మారిపోతాయి. భూమి అంతా ఎడారిలా మారిపోతుంది. అందువల్లనే నీటికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ కారణంగానే నీటిని పొదుపుగా వాడుకోవాలని, వృథా చేయకూడదని పర్యావరణ నిపుణులు సూచిస్తుంటారు. అయితే భూ ఉపరితలంపైన నీరు సముద్రాలు, నదులు, డ్యాంలు, సరస్సులు, చెరువుల రూపంలో నిల్వ ఉంటుందని మనకు తెలుసు. అయితే.. మానవ ప్రమేయం లేకుండానే భూమి లోతుల్లో అత్యంత విలువైన భూ గర్భ జలాలు నిల్వ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ వాటర్ ప్రకృతిలో సహజ సిద్ధంగానే ఏర్పడ్డాయి. కాగా భూమిలోపల నీరు నిల్వ ఉండడానికి దోహదపడే అంశాలు ఏంటంటే?

భూ అంతర్భాగంలో నీటి నిల్వ

సాధారణంగా సూర్యరశ్మి వల్ల నీరు వేడెక్కుతుంది. అలా హీటైన వాటర్ వాయురూపంలోకి మారుతుంది. ఆ తరువాత ఆ నీటిఆవిరి కొన్ని ప్రక్రియల అనంతరం మేఘాలుగా ఏర్పడుతుంది. ఆ మేఘాలు వర్షం రూపంలో కురవడం వలన భూమిపైకి నీరు చేరుతుంది. ఇలా వచ్చిన వర్షపు నీరు చెరువులు, నదులు, సముద్రాల్లో కలుస్తుంది. కొంత నీరు వృక్షాలు, మొక్కలు పీల్చుకుంటాయి. మరి కొంత నీరు నీటి ఆవిరిగా మారుతుంది. ఇక భూ ఉపరితలంపై మిగిలిన వర్షపు నీరు భూ గర్భంలోకి చేరుతుంది. భూమిపై ఉన్నటువంటి చిన్న చిన్న రంధ్రాల ద్వారా నీరు భూమి లోపలి పొరల్లో ఉన్న అక్వాఫయర్ లోకి ఇంకుతుంది.

అక్వాఫయర్స్

మరి ఈ అక్వాఫయర్స్ అంటే ఏంటో తెలుసా.. నేల లోపల ఉన్నటువంటి రాళ్ల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాలను అక్వాఫయర్లు అంటారు. ఈ అక్వాఫయర్ లనే జలధారలు అని కూడా పిలుస్తారు. అయితే ఈ అక్వాఫయర్లు సాండ్ స్టోన్, లైమ్ స్టోన్ లతో ఏర్పడతాయి. ఇవి భూమిలోపల సహజసిద్ధంగానే ఏర్పడినటువంటి జలధారలు. వీటిని మరో రకంగా చెప్పాలంటే భూ ఉపరితలంపైన ఏవిధంగా కాలువలు ప్రవహిస్తున్నాయో అదే విధంగా వీటిని అండర్ గ్రౌండ్ కెనాల్స్ గా అభివర్ణించొచ్చు.

అయితే ఈ అక్వాఫయర్స్ భూమిలోపల తక్కువ లోతులో ఉంటే మరికొన్ని అక్వాఫయర్స్ ఎక్కువ లోతులో ఉంటాయి. తక్కువ లోతులో ఉన్నటువంటి జలధారలను స్థిరత్వంలేని అక్వాఫయర్స్ అంటాము. చాలా ఎక్కువ లోతులో ఉండే అక్వాఫయర్స్ ను స్థిరమైన అక్వాఫయర్స్ గా చెప్పుకుంటాము. ఇలా స్థిరమైన, స్థిరత్వంలేని అక్వాఫయర్లు అని ఎందుకు అంటుంటారంటే తక్కువ లోతులో ఉన్న జలధారల నుంచి నీటిని డ్రిల్ చేసి బోరు బావుల ద్వారా బయటికి తోడేస్తుంటాము. అందువల్ల అక్కడి జలాలు త్వరగా అడుగంటి పోతాయి. స్థిరత్వం లేని అక్వాఫయర్స్ లో నీరు కొన్ని వారాల నుంచి నెలల వరకు మాత్రమే ఉంటుంది. అదే అస్థిరమైన అక్వాఫయర్స్ లో కొన్ని సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల వరకు నీరు నిల్వ ఉంటుంది. ఎందుకంటే ఈ జలాధారలు డ్రిల్ చేయడానికి సాధ్యం కానంత లోతులో ఏర్పడి ఉంటాయి. అయితే ఈ జలధారలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి.

కాగా ఈ అక్వాఫయర్స్ భూ అంతర్భాగంలో చాలా దూరం వరకు కనెక్ట్ అయి ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మీటర్స్ వరకు విస్తరించి ఉంటే, మరి కొన్ని ప్రాంతాల్లో 100 కి. మీ కన్నా ఎక్కువ దూరం వరకు విస్తరించి ఉంటాయి. అనగా భూమిలోలప ఉన్న రాళ్ల మధ్య ఖాలీ ప్రదేశం అనేది కొన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఈ విధంగా నీరు అక్వాఫయర్ లో నిల్వ ఉంటుంది. అక్వాఫయర్ లోని వాటర్ పరిమాణం అనేది అక్కడి రాక్స్ పై ఆదారపడి ఉంటుంది. ఆ రాక్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి క్రెవిస్డ్ రాక్స్.. వీటిల్లో జలధారలు పైప్ లైన్ వేసిన విధంగా కనెక్ట్ చేయబడి ఉంటాయి. రెండవది గ్రావెల్ రాక్స్.. వీటిల్లో జలధారలు చిన్న మడుగుల రూపంలో ఉంటాయి. అయితే ఈ గ్రౌండ్ వాటర్ కేవలం వర్షం నీరు వల్ల మాత్రమే సమకూరుతుందా అంటే.. కాదు భూ ఉపరితలంపై ఉన్న మంచు పర్వాతాలు కరగడం, నదుల ప్రవాహం, చెరువుల ద్వారా నీరు భూ గర్భంలోకి వెళ్తుంది. అధిక వర్షాలు, వరదలు సంభవించినప్పుడు భూ గర్భ జలాలు అమాంతం పెరగడం మనం చూస్తుంటాము.

ఈ కారణంగానే వ్యవసాయ బావులు, ఇళ్లలో మంచి నీటి కోసం ఏర్పాటు చేసుకున్న చేద బావులల్లో నీరు పైకి ఉబికి వస్తుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆధునిక మిషనరీస్ అందుబాటులోకి వచ్చాక బోరు బావుల తవ్వకం ఎక్కువైంది. పరిమితికి మించి గ్రౌండ్ వాటర్ ను తోడేస్తున్నారు. గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ కాక ముందే నీటిని తోడడం వల్ల భూ గర్భ జలాలు తగ్గిపోతున్నాయి. అదే విధంగా మానవుడు విచక్షణ కోల్పోయి పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడే పారేయడం, ఇండస్ట్రీ వ్యర్థాలు, సెప్టిక్ ట్యాంకులు, అండర్ గ్రౌండ్ గ్యాస్ ట్యాంకులు లీకవ్వడం వల్ల భూ గర్భ జలాలు కలుషితమవుతున్నాయి. గ్రౌండ్ వాటర్ ఒక్కసారి కలుషితమైతే మళ్లీ దాన్ని తాగడానికి ఉపయోగించలేము.

ప్రపంచం, దేశంలో అతిపెద్ద అక్వాఫయర్స్

అయితే ఈ అక్వాఫయర్స్ ప్రపంచమంతటా ఉంటాయి. వరల్డ్ లో అతిపెద్ద అక్వాఫయర్ అమెరికాలో ఉంది. అదే ఒగల్లాల అక్వాఫయర్. ఇది నాలుగు లక్షల యాభై వేల స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించి ఉంది. ఇక భారత్ విషయానికి వస్తే అతి పెద్ద అక్వాఫయర్ అలోవియం అక్వాఫయర్. ఇది దేశంలోని బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, అస్సాం, యూపీ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఇది భారత్ లో ఉన్న భూభాగంలో 31 శాతం ఆక్రమించి ఉంది. ఇదిలా ఉంటే.. గ్రౌండ్ వాటర్ చాలా ఉపయోగకరమైనవి. తాగు నీరు గానే గాక, వ్యవసాయానికి, ఫుడ్ ఇండస్ట్రీలల్లో ఇంకా ఇతర పరిశ్రమల్లో గ్రౌండ్ వాటర్ పైనే ఆదారపడతారు. పూర్వం వ్యవసాయం చేయడానికి వర్షం పైన మాత్రమే ఆదారపడే వారు. ఆ తరువాత చెరువులు,కాలువలు తవ్వుకుని వీటి ద్వారా పంటలు పండించే వారు.

ప్రతి నీటి బొట్టు విలువైనదే

కానీ కాలం మారింది. టెక్నాలజీ పెరిగిన తర్వాత బోరు బావులు డ్రిల్ చేసి విద్యుత్ మోటార్ల ద్వారా భూ గర్భ జలాలను తోడి వినియోగిస్తున్నారు. ప్రపంచమంతా ఈ గ్రౌండ్ వాటర్ మీదనే ఆదారపడి మనుగడ సాగిస్తోంది. కాగా ఈ గ్రౌండ్ వాటర్ ను గుర్తించేందుకు ఓ పరికరం ఉంది. అదే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్. ఇది మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీని అండర్ గ్రౌండ్ లోకి పంపించి భూ గర్భ జలాలను, ఇతర ఖనిజాలను గుర్తిస్తుంది. కాగా ప్రతి నీటి బొట్టు చాలా విలువైనది. నీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీటి సంరక్షణ పద్దతులను ప్రతిఒక్కరు పాటించి భవిష్యత్ తరాలకు మంచి నీటిని అందించాల్సిన బాధ్యత మనందరిది. మంచి నీటి వాడకం విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి వృథా చేసినట్లైతే భవిష్యత్తులో దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి ప్రతి నీటి బొట్టును ఒడిసి పడుదాం.. నీటి వనరులను కాపాడుకుందాం.. భవిష్యత్ తరాలకు భరోసా కల్పిద్దాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి