iDreamPost

డీమార్ట్‌లో ఇలాంటి మోసాన్ని ఎప్పుడైనా గమనించారా.. ఏం జరిగిందో చూడండి!

  • Published Jul 03, 2023 | 7:02 PMUpdated Jul 03, 2023 | 7:02 PM
  • Published Jul 03, 2023 | 7:02 PMUpdated Jul 03, 2023 | 7:02 PM
డీమార్ట్‌లో ఇలాంటి మోసాన్ని ఎప్పుడైనా గమనించారా.. ఏం జరిగిందో చూడండి!

కొన్నేళ్ల క్రితం వరకు నెలవారి సరుకులు కావాలన్నా.. ఇంట్లోకి ఏ చిన్న అవసరం వచ్చినా.. వెంటనే కిరాణ షాపు దగ్గరకు వెళ్లేవాళ్లం. చిల్లర సామాను మొదలు.. నెలవారి అవసరాలకు సరిపడా సరుకులు తెచ్చుకునేవాళ్లం. అయితే గత కొంత కాలంగా ఈ పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. గ్లోబలైజషన్‌.. కిరాణ దుకాణాలకు భారీ షాక్‌ ఇచ్చింది. ఫలితంగా ఎక్కడ చూడు మాల్స్‌ కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా డీమార్ట్‌ వచ్చాక.. కిరాణ షాపుల పరిస్థితి మరింత దిగజారింది. అందుకు కారణం.. ఇక్కడ ప్రకటించే డిస్కౌంట్‌లు. ఒకప్పుడు మాల్స్‌లో షాపింగ్‌ అంటే కేవలం ధనవంతులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగస్తులు మాత్రమే అనుకునేవారు. కానీ డీమార్ట్‌ ప్రకటించే డిస్కౌంట్‌ల కారణంగా.. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఛలో డీమార్ట్‌ అంటున్నారు.

డీమార్ట్‌లో ప్రతి వాటి మీద ఎంతో కొంత డిస్కౌంట్‌ లభిస్తుండటంతో.. సామాన్యులు మొదలు ధనవంతులు వరకు ప్రతి ఒక్కరు డీమార్ట్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. కిరాణ దుకాణాలతో పోలిస్తే.. ధర తక్కువ.. మంచి నాణ్యత ఉండటం వల్ల.. జనాలు డీమార్ట్‌కు వెళ్లడానికే ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే కస్టమర్లను ఆకర్షించేందుకు డిస్కౌంట్లు ఇస్తూ.. వారిని తన వైపు తిప్పుకుంటున్న డీమార్ట్‌లో కొత్త తరహా మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..

డీమార్టులో ఇచ్చే డిస్కౌంట్‌ మాయలో పడి కొన్న తర్వాత బిల్లు చూసుకోకపోతే  మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డీమార్ట్‌లో షాపింగ్‌ ముగిసిన తర్వాత మీరు బిల్లు చూసుకోకపోతే.. మీ జేబుకు చిల్లు పడటం గ్యారంటీ. తాజాగా డీమార్ట్‌లో జరుగుతున్న మోసం వెలుగులోకి వచ్చింది. దాంతో అధికారులు డీమార్ట్‌పై కేసు నమోదు చేశారు. ఇంతకు ఏం జరిగింది అంటే.. డీమార్ట్‌లో కొన్న ఒక వస్తువుకు.. అక్కడి సిబ్బంది.. రెండు, మూడు సార్లు బిల్లులు వేస్తున్నారు. షాపింగ్‌ హడావుడిలో ఉండి అక్కడ ఈ విషయాన్ని పట్టించుకోము. ఇక ఇంటికి వచ్చాక బిల్‌ తీసి.. చెక్‌ చేసుకునే అలవాటు అందరికి ఉండదు. దాంతో డీమార్ట్‌ సిబ్బంది యధేచ్చగా మోసాలకు పాల్పడుతున్నారు. కరీంనగర్‌ డీమార్ట్‌లో జరుగుతున్న ఈ మోసాల గురించి గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

అది చూసిన ఆ జిల్లా కలెక్టర్​.. తూనికలు కొలతలు అధికారులకు తనిఖీ చేయమని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు వెళ్లి.. అక్కడ జరుగుతున్న మోసాన్ని గుర్తించారు. కరీంగనర్‌ డీమార్ట్‌లో ఒక వస్తువు కొనుగోలు చేస్తే.. దానిని రెండు, మూడుసార్లు స్కాన్​ చేయడం వల్ల.. ఒక వస్తువుపై రెండు, మూడు సార్లు బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. సాధారణంగా వినియోగదారులు ఇంటికి వెళ్లిన తర్వాత మరోసారి చెక్‌ చేసుకొనే అవకాశం చాలా తక్కువ ఉంటుందని అందువల్ల మోసపోతున్నారని తూనికలు కొలతల అసిస్టెంట్ కమిషనర్‌ విజయసారథి తెలిపారు. వినియోగదారులు విధిగా తమ వస్తువులు మరోసారి చెక్‌ చేసుకోవాలని సూచించడమే కాకుండా డీమార్ట్‌పై కేసు నమోదు చేస్తున్నట్లు తూనికలు కొలతల శాఖ అధికారి వివరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి