iDreamPost

ఉమ్మడి కుటుంబంలో ఒంటరైన అయ్యన్నపాత్రుడు

ఉమ్మడి కుటుంబంలో ఒంటరైన అయ్యన్నపాత్రుడు

మాజీ మంత్రిగా, సీనియర్‌ టీడీపీ నేతగా అయ్యన్న పాత్రుడు రాష్ట్రంలో అందరికీ సుపరిచతమే. టీడీపీ అధికారంలో ఉండగా ఓ వెలుగు వెలిగాడు. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో రాజకీయంగానే కాకుండా, కొడుకు వల్ల ఉమ్మడి కుటుంబంలోనూ అధికారం కోల్పోయాడు. నలుగురు అన్నదమ్ముల కుటుంబాలతో ఉన్న ఇంట్లో తన ఫ్యామిలీ ఒక్కటి ఒకవైపు.. మిగతా మూడు ఫ్యామిలీలు మరోవైపుగా పరిస్థితి తయారయ్యింది. వాస్తవంగా చెప్పాలంటే కుటుంబంలో అయ్యన్నపాత్రుడు ఒంటరి అయిపోయాడు. అయ్యన్న పెద్ద కొడుకు విజయ్‌ చేస్తున్న అవమానాలు, విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో చేస్తున్న డ్యామినేషన్, ఆస్తుల పంపిణీలో వివక్ష తట్టుకోలేక తమ్ముడు సన్యాసిపాత్రుడుతో పాటు మరో రెండు కుటుంబాలు గత ఏడాది నవంబర్‌లో వైఎస్సార్‌సీపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇంటి వద్ద వైఎస్సార్‌సీపీ జెండా కట్టే విషయంలో అయితే కేసుల వరకు పరిస్థితి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఒకే ఇంట్లోనే ఉంటున్నా.. ఎదురుపడితే మాట్లాడే దిక్కులేదు. దీంతో చేసేది లేక దశాబ్ధాలుగా ఉన్న ఇంటి నుంచి వేరుపడి అయ్యన్నపాత్రుడు మరో ఇంటిని నిర్మించుకుంటున్నాడు. త్వరలో తన చిన్న కొడుకు వివాహం ఉంటుండగా.. ఆ కార్యక్రమానికి తన అన్నదమ్ముల కుటుంబాల నుంచి ఎవరూ వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే సొంత నియోజకవర్గం నర్సీపట్నంలో కాకుండా విశాఖలో పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

గొడవ ఎక్కడ మొదలయ్యింది?
అయ్యన్న కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు. వారిలో ఒకరిని నక్సలైట్ల చంపేయగా, మరొకరు ఆరోగ్య కారణాల వల్ల మరణించారు. ఇక 35 ఏళ్ల రాజకీయ జీవితంలో అనుక్షణం తనకు అండగా ఉన్నది తమ్ముడు సన్యాసి పాత్రుడే. అన్న మంత్రిగా రాష్ట్రంలో అధికారం చెలాయిస్తూ ఉంటే.. సన్యాసి పాత్రుడు నర్సీపట్నం టౌన్‌లో పార్టీ కార్యక్రమాలు చక్కబెట్టేవారు. ఏ రోజూ పదవులు ఆశించలేదు. అన్నచాటు తమ్ముడిగానే ఇన్నేళ్లుగా ఉంటున్నారు. ఈ క్రమంలో అయ్యన్నపాత్రుడు పెద్ద కొడుకు విజయ్‌ రంగ ప్రవేశం చేశాడు. ప్రతి విషయంలోనూ తన బాబాయ్‌తో గొడవలకు దిగేవాడు. నియోజకవర్గంలో కార్యకర్తల ముందు అవమానకరంగా మాట్లాడేవాడు. ఇది రానురాను బాగా ముదిరిపోయింది. అయ్యన్నపాత్రుడికి తెలిసి కూడా తన కొడుకును వారించలేదు. ఈ పరిస్థితిని గమనించిన సన్యాసిపాత్రుడు తాను రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని భావించారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలసి నియోజకవర్గంలో తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు తన అభీష్టాన్ని వెల్లడించారు. ఒకానొక సమయంలో టికెట్‌ వచ్చేలానే కనపడింది. అయ్యన్న పాత్రుడిని అనకాపల్లి ఎంపీగా, సన్యాసిపాత్రుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని నియోజకవర్గంలో బాగా టాక్‌ నడిచింది. ఈ సమయంలో అయ్యన్న కొడుకు విజయ్‌.. లోకేశ్‌ ద్వారా తన బాబాయ్‌కి టికెట్‌ రాకుండా అడ్డుపుల్ల వేశాడు. అప్పటి నుంచి కుటుంబాల మధ్య గొడవలు మొదటి దశ దాటిపోయాయి.

కుటుంబాన్ని పట్టించుకోని అయ్యన్న
ఇంట్లో ఇద్దరు సోదరులు చనిపోయిన తర్వాత వారి కుటుంబాలను కాపాడాల్సిన అయ్యన్నపాత్రుడు మొదటి నుంచీ వారిని ఏ మాత్రం పట్టించుకోలేదు. సన్యాసిపాత్రుడే వారి బాగోగులు చూస్తూ వచ్చేవాడు. అయ్యన్న కొడుకు వ్యవహారశైలి చూసిన వారు.. ఇప్పుడే తమకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. అయితే ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా తన కొడుకుకే సపోర్ట్‌గా మాట్లాడేవాడు. పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన సన్యాసిపాత్రుడు కుటుంబం వైఎస్సార్‌సీపీ చేరిపోయింది.

జెండా వివాదంతో ముదిరిన గొడవలు
అన్ని ఫ్యామిలీలు కలసి ఉన్నప్పుడు ఆ ఇంటిపై టీడీపీ జెండా ఒకటే ఎగిరేది. సన్యాసిపాత్రుడు పార్టీ మారిన తర్వాత ఇంటిపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేశాడు. దీంతో వ్యవహారం ముదిరింది. తన పిన్నమ్మలను రంగంలోకి దింపిన అయ్యన్న.. వారి ద్వారా తన తమ్ముడిపై కేసులు పెట్టించాడు. అయ్యన్న కొడుకు వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ సన్యాసిపాత్రుడు కూడా కేసులు పెట్టారు. ప్రస్తుతం ఈ కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. త్వరలో అయ్యన్న చిన్న కొడుకు రాజేశ్‌ వివాహం ఉంది. అయితే ఆ వివాహానికి ఎవరూ రామని తేల్చిచెప్పారు.

తమ్ముడు ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తా..
సన్యాసిపాత్రుడికి నర్సీపట్నం మున్సిపాలిలో మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో అతను పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఆ ఎన్నికల్లో తన తమ్ముడిని ఓడించడానికి ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధమేనని తన అనుచరులతో అయ్యన్నపాత్రుడు చెబుతున్నాడట. తనను వదిలి వెళ్లినందుకు తగిన శాస్త్రి చేస్తానంటూ శబదాలు చేస్తున్నారట. ఏది ఏమైనా ఈ గొడవలు మున్ముందు ఎలాంటి పరిస్థితికి దారి తీస్తాయో చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి